Share News

‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:10 AM

త్వరలో జరగనున్న మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌, పురపాలక సంఘాల ఎన్నికలకు అంతా సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు.

 ‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

- ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు పూర్తి చేయాలి

- కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): త్వరలో జరగనున్న మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌, పురపాలక సంఘాల ఎన్నికలకు అంతా సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌తో కలిసి మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు, పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం స్థానిక ఎన్నికలకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు పూర్తిచేయాలని స్పష్టం చేశారు. బ్యాలెట్‌ బాక్సుల భద్రతకు పటిష్టమైన డబుల్‌ లాక్‌ విధానంతో కూడిన స్ట్రాంగ్‌ రూమ్‌లను గుర్తించడంతో పాటు, కౌంటింగ్‌ హాళ్లలో మౌలిక వసతులు కల్పించాలన్నారు. గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిర్వహించనున్న సమావేశానికి పూర్తి సమాచారంతో అధికారులు హాజరు కావాలన్నారు. బ్యాలెట్‌ పేపర్లు, వాటి ముద్రణకు తగిన ప్రణాళికతో ఉండాలన్నారు. ప్రీ పోలింగ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. ఎంపీడీవోలు, పోలీసు అధికారులు సంయుక్తంగా గ్రామ పంచాయతీల్లోని పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. కేంద్రాల వద్ద కాంపౌండ్‌ వాల్‌, విద్యుత్తు, ఇంటర్‌నెట్‌ వసతులు పక్కాగా ఉండేలా చూడాలని ఆదేశించారు. ఓటర్ల సంఖ్య ప్రాతిపదికన పోలింగ్‌, కౌంటింగ్‌ సిబ్బందిని ఎంపిక చేసి, మాస్టర్‌ ట్రైనర్ల ద్వారా వారికి తగిన శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు సమగ్ర భద్రతా ప్రణాళిక రూపొందించామని, జిల్లాలోని సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అదనపు బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేస్తామన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడక ముందే బైండోవర్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అఽధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ హరిఓం పాండ్యా, డీఆర్వో విశ్వేశ్వరరావు, జడ్పీ సీఈవో వెంకటరామన్‌, డీపీవో స్వరూపరాణి, డీఎస్పీలు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, స్టేషన్‌ హౌస్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2026 | 12:11 AM