‘పది’లో శతశాతం ఉత్తీర్ణత సాధించాలి
ABN , Publish Date - Feb 07 , 2026 | 11:27 PM
Special focus on students పదో తరగతి పరీక్షల్లో జిల్లా శతశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శనివారం శ్రీకాకుళంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీల ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల్లో జిల్లా శతశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శనివారం శ్రీకాకుళంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీల ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఎస్‌సీ 100 రోజుల కార్యాచరణలో భాగంగా జరుగుతున్న స్లిప్‌టెస్టుల ఫలితాల నివేదికను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ‘విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ 10వ తరగతి ఫలితాల నుంచే ప్రారంభమవుతుంది. గతేడాది పదో తరగతి ఫలితాల్లో జిల్లా 82 శాతం ఉత్తీర్ణత సాధించింది. కానీ పక్కనే ఉన్న పార్వతీపురం 92శాతం ఉత్తీర్ణతతో ముందుంది. ఈసారి జిల్లాలో శతశాతం ఫలితాలే లక్ష్యంగా ముందుకు సాగాలి. పరీక్షలకు 37 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈ సమయం అత్యంత కీలకం. అభ్యసనలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలి. వారికోసం అదనపు సమయం కేటాయించాలి. రోజువారీ లక్ష్యాలతో విద్యార్థుల పొరపాట్లను గుర్తించి, ఎప్పటికప్పుడు సరిదిద్దాల’ని ఆదేశించారు. సమావేశంలో డీఈవో ఏ.రవిబాబు, ఎస్‌ఎస్‌ఏ పీవో వేణుగోపాలరావు, యశోదలక్ష్మి, విజయకుమారి, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.