నేడు పుర పోరు!
ABN , Publish Date - Nov 01 , 2026 | 12:20 AM
Distribution of materials to election staff జిల్లాలోని రెండు చోట్ల పురపోరుకు రంగం సిద్ధమైంది. పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మునిసిపాలిటీల్లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచేశారు. శనివారం సాయంత్రం పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు.
జిల్లాలోని రెండు మునిసిపాలిటీల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు
ఇచ్ఛాపురంలో 17 ప్రాంతాల్లో 39 పోలింగ్ కేంద్రాలు
పలాస- కాశీబుగ్గలో 67 పోలింగ్ స్టేషన్లు
పోలీసు బందోబస్తు సిద్ధం
ఎన్నికల సిబ్బందికి సామగ్రి పంపిణీ
ఇచ్ఛాపురం/ పలాస, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రెండు చోట్ల పురపోరుకు రంగం సిద్ధమైంది. పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మునిసిపాలిటీల్లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచేశారు. శనివారం సాయంత్రం పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. అనంతరం ప్రత్యేక వాహనాల్లో వారంతా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇచ్ఛాపురం మునిసిపాలిటీలోని 17 ప్రాంతాల్లో 39 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 31,452 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 6 రూట్లు, ఆరు జోన్లుగా కేటాయించారు. ఎన్నికల నిర్వహణకు 40మంది పోలింగ్ అధికారులు (పీవోలు), 40 మంది సహాయ పోలింగ్ అధికారులు(ఏపీవోలు), 177మంది ఓపీవోలు, ఆరుగురు రూట్ ఆఫీసర్లు, ఆరుగురు జోనల్ ఆఫీసర్లను నియమించారు. పురుషోత్తపురం ఏపీ మోడల్ స్కూల్ వద్ద శనివారం సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, పత్రాలు, ఎన్నికల సామగ్రిని అందించారు. ఎన్నికల సామగ్రి వినియోగం, పోలింగ్ ప్రక్రియపై సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం పోలీస్ బృందాలతో పీవో, ఏపీవోతోపాటు సిబ్బందిని కేంద్రాలకు తరలించారు. ఇందుకుగాను 12 బస్సులను సిద్ధం చేశారు.
సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు..
ఇచ్ఛాపురంలో సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానంగా 1, 2, 3, 4, 16, 17, 18, 21, 22, 23, 24వ వార్డుల పరిధిలోని పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. 7, 8 ,9, 11, 12, 13, 14, 15, 19, 20, 27 వార్డులో సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. ఆయా కేంద్రాల్లో ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఉంటుంది. అన్నింటా డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐల పర్యవేక్షణ ఉంటుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్ రికార్డింగ్ చేపడతారు. ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణంలోనే స్ర్టాంగ్‌రూంను ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసిన తరువాత పోలీస్ బందోబస్తుతో బ్యాలెట్ బాక్సులను స్ర్టాంగ్‌రూంకు తరలిస్తారు. ఈ నెల 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇచ్ఛాపురంలో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచేశామని కమిషనర్ నల్లి రమేష్ తెలిపారు. ఓటర్లను ప్రలోభపెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఇచ్ఛాపురంలో 144 సెక్షన్, పోలీసు 30 యాక్ట్ అమల్లో ఉంటుందని సీఐ మీసాల చిన్నమనాయుడు తెలిపారు. ఎన్నికల నియామవళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో 36 వార్డులు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో 49,420 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 67 పోలింగ్‌స్టేషన్లు ఏర్పాటు చేయగా, నాలుగు జోన్లు, ఎనిమిది రూట్లుగా విభజించారు. 572 మంది కేవలం ఎన్నికల సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఏఎస్పీ, డీఎస్పీ, ఐదుగురు సీఐలు, 11 మంది ఎస్‌ఐలు, 250 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు సిద్ధం చేశారు. దీనికి అదనంగా ప్రత్యేక పోలీసు పార్టీని ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో వీరు నిఘా పెట్టనున్నారు. శనివారం పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద బ్యాలెట్ బాక్స్‌లు, పత్రాలు, ఇతర ఎన్నికల సామగ్రిని సిబ్బందికి పంపిణీ చేశారు. రూట్లు వారీగా కేటాయించిన బస్సులు, కార్లలో వారిని ఎన్నికల కేంద్రాలకు తరలించారు. జిల్లా ఎన్నికల పరిశీలకుడు మల్లవరపు సూర్యతేజ, ప్రత్యేక అధికారి వినాయకరావు, మున్సిపల్ ఎన్నికల అధికారి ఇ.శ్రీనివాసులు.. శనివారం ఎన్నికల ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఎన్నికల విధులకు హాజరైన సిబ్బందికి ఎన్నికల నియమావళి వివరించారు. ఏ చిన్న సమస్య తలెత్తినా కంట్రోలు రూమ్‌కు ఫోన్ చేసి తెలపాలని సూచించారు. కాశీబుగ్గ డీఎస్పీ జివి.రమణ ఆధ్వర్యంలో పోలీసులకు ముందుగా తర్ఫీదు ఇచ్చి ఎన్నికల కేంద్రాలకు తరలించారు.