Share News

పారిశ్రామిక హబ్‌గా మూలపేట

ABN , Publish Date - Aug 21 , 2026 | 12:32 AM

Fertilizer plant worth Rs 2,250 crore పారిశ్రామికాభివృద్ధి దిశగా జిల్లాలో భారీ పెట్టుబడులకు మార్గం సుగమమైంది. సముద్ర తీరప్రాంతమైన మూలపేటలో ‘కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌’ ఆధ్వర్యంలో ఫాస్ఫారిక్‌ యాసిడ్‌, అనుబంధ ఎరువుల తయారీ ప్లాంట్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

పారిశ్రామిక హబ్‌గా మూలపేట

  • రూ.2,250 కోట్లతో భారీ ఎరువుల కర్మాగారం

  • 450 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

  • శ్రీకాకుళం, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): పారిశ్రామికాభివృద్ధి దిశగా జిల్లాలో భారీ పెట్టుబడులకు మార్గం సుగమమైంది. సముద్ర తీరప్రాంతమైన మూలపేటలో ‘కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌’ ఆధ్వర్యంలో ఫాస్ఫారిక్‌ యాసిడ్‌, అనుబంధ ఎరువుల తయారీ ప్లాంట్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించి పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, వాణిజ్య శాఖ కార్యదర్శి డాక్టర్‌ ఎన్‌.యువరాజ్‌ అధికారిక ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్‌ఐపీబీ) ఈ నెల 12న నిర్వహించిన సమావేశంలో కోరమాండల్‌ ప్లాంట్‌ ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం తెలపగా, ఆ సిఫార్సుల మేరకు తాజాగా ప్రభుత్వం భూ కేటాయింపులు చేస్తూ ఉత్వర్వులు విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.2,250 కోట్ల భారీ పెట్టుబడిని కోరమాండల్‌ సంస్థ పెట్టనుంది. (వర్కింగ్‌ క్యాపిటల్‌ మినహాయించి). ప్లాంట్‌ ఏర్పాటుకు అవసరమైన 450 ఎకరాల భూమిని మూలపేట వద్ద ‘ఎల్‌ఏ ఫర్‌ అదర్స్‌’ విధానంలో వాస్తవ ధర ప్రాతిపదికన కేటాయించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

  • ప్లాంట్‌ ఉత్పత్తి సామర్థ్యాలు ఇవీ

  • సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌: రోజుకు 2,000 టన్నులు(టీపీడీ)

  • ఫాస్ఫారిక్‌ యాసిడ్‌ : రోజుకు 650 టన్నులు

  • జిప్సం ప్లాస్టర్‌ ప్లాంట్‌ : రోజుకు 1,000 టన్నులు

  • ఉపాధి అవకాశాలు..

  • ఈ భారీ కర్మాగారం ద్వారా స్థానికంగా 400 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పరోక్షంగా మరికొంత మందికి లబ్ధి చేకూరనుంది. ప్లాంట్‌ నిర్వహణకు రోజుకు 15 ఎంఎల్‌డీల నీరు, సంవత్సరానికి 1,38,204 మెగావాట్‌ అవర్స్‌ (సుమారు 20 మెగావాట్లు) విద్యుత్‌ అవసరం అవుతుందని అంచనా వేశారు. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం ఇది ‘రెడ్‌’ కేటగిరీ కిందకు వస్తుంది. ఈ ప్రాజెక్టును 2030 అక్టోబర్‌ నాటికి అందుబాటులోకి తెచ్చేలా లక్ష్యం విధించారు.

  • షరతులు - అనుమతులు...

  • ముడిసరుకు దిగుమతులు, సరఫరా గొలుసు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు(జియో-పొలిటికల్‌ రిస్క్స్‌)ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొన్ని వెసులుబాటులు కల్పించింది. సంస్థకు భూమి కేటాయించిన 4 నుంచి ఆరు నెలల్లోపు చట్టబద్ధమైన అన్ని అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలని, ఆ అనుమతులు వచ్చిన నాటి నుంచే ప్రాజెక్టు అమలు గడువును పరిగణనలోకి తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు పన్నుల రూపంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పక్కదారి పట్టకుండా, కోరమాండల్‌ సంస్థతోపాటు వారి సరఫరాదారులు, వెండర్లు కచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని ఏపీఐఐసీ వీసీ అండ్‌ ఎండీ, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌, కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

  • యువతకు ఉపాధి, రైతులకు మేలు

  • మూలపేటలో కోరమాండల్‌ ఎరువుల కర్మాగారాం ఏర్పాటుకు ప్రభుత్వం భూమి కేటాయించడంపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ‘కూటమి ప్రభుత్వం జిల్లా సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉంది. మూలపేట పోర్టు పనులు శరవేగంగా సాగుతున్న తరుణంలో, దానికి అనుబంధంగా ఇంత భారీ పరిశ్రమల మన జిల్లాకు రావడం సిక్కోలు చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం. ఈ కోరమాండల్‌ ఫ్యాక్టరీ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయి. రైతులకు ఎరువుల కొరత రాకుండా ఈ ప్లాంట్‌ ఎంతో ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో జిల్లా పారిశ్రామిక హబ్‌గా రూపుదిద్దుకోబోతోంది’ అని మంత్రి అచ్చెన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - Aug 21 , 2026 | 12:33 AM