Share News

ముహూర్తం ఖరారు

ABN , Publish Date - Nov 10 , 2026 | 11:49 PM

Election of MPPs on the 19th, ZP Chairpersons on the 20th జిల్లాలో స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న జిల్లాలోని 30 మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు, 20న జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌/చైర్‌పర్సన్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది.

ముహూర్తం ఖరారు

19న ఎంపీపీలు, 20న జడ్పీ చైర్‌పర్సన్‌ ఎన్నిక

షెడ్యూల్‌ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

ఈ నెల 14లోగా సభ్యులకు ప్రత్యేక సమావేశాల నోటీసులు

కో-ఆఫ్సన్‌ సభ్యుల ఎన్నిక.. తర్వాతే అధ్యక్ష, చైర్మన్‌ పదవులకు..

చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్‌.. విప్‌ ధిక్కరిస్తే అనర్హత వేటు

శ్రీకాకుళం, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న జిల్లాలోని 30 మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు, 20న జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌/చైర్‌పర్సన్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఎంపీపీలు, జడ్పీ చైర్‌పర్సన్‌ ఎన్నికలతో పాటు కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక కూడా చేపట్టనున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఈసీ ఆదేశించింది. ఈ నెల 14వ తేదీలోగా ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు ప్రత్యేక సమావేశాల నోటీసులు అందజేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 5,6 తేదీల్లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 7వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తయింది. తాజాగా పరోక్ష ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఎంపీపీలు, జడ్పీ చైర్మన్‌ పదవుల కోసం రాజకీయ పార్టీల్లో కసరత్తు మొదలైంది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలుత కో-ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఆ తర్వాతే ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు జడ్పీ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌/చైర్‌పర్సన్‌ ఎన్నికలు నిర్వహిస్తారు.

ఎన్నికల షెడ్యూల్‌ ఇలా..

ఎంపీపీ ఎన్నికలు: ఈనెల 19వ తేదీ ఉదయం 10 గంటలలోపు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్ల పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఒంటి గంటకు ప్రత్యేక సమావేశం నిర్వహించి కో-ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక నిర్వహిస్తారు.

జడ్పీ ఎన్నికలు: ఈనెల 20న ఎంపీపీ ఎన్నికల తరహాలోనే ఉదయం 10 గంటలలోపు నామినేషన్ల స్వీకరణ, మధ్యాహ్నం 12 గంటలకు అభ్యర్థుల జాబితా ప్రకటన, ఒంటి గంట వరకు ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు ఇద్దరు కో-ఆఫ్సన్‌ సభ్యులను ఎన్నుకుంటారు. అనంతరం 3గంటలకు జిల్లా పరిషత్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహిస్తారు.

ముందుగా కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక

పరోక్ష ఎన్నికల రోజున తొలుత మైనారిటీ వర్గాలకు చెందిన కో-ఆప్షన్‌ సభ్యులను ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు ఎన్నుకుంటారు. జిల్లా పరిషత్‌కు ఇద్దరు, జిల్లాలోని 30 ఎంపీపీలకు ఒక్కొక్కరు చొప్పున కో-ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకుంటారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఎంపీపీ, చైర్‌పర్సన్‌ పదవులకు ఎన్నిక నిర్వహిస్తారు. ఒకవేళ కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక జరగకపోతే ప్రధాన ఎన్నికను వాయిదా వేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించాల్సి ఉంటుంది. అలాగే ముందుగా మండల పరిషత్‌ అధ్యక్షుడిని, జడ్పీ చైర్‌పర్సన్‌ను ఎన్నుకున్న తర్వాతే ఉపాధ్యక్షుడు, వైస్‌ చైర్మన్‌ పదవులకు ఎన్నిక నిర్వహిస్తారు. అధ్యక్ష, చైర్‌పర్సన్‌ ఎన్నికలు జరగకపోతే సంబంధిత ఉపాధ్యక్ష, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలను నిలిపివేస్తారు.

చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్‌.. విప్‌ తప్పనిసరి

ఎంపీపీ, జడ్పీ చైర్‌పర్సన్‌ ఎన్నికలు చేతులెత్తే పద్ధతిలో నిర్వహిస్తారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ సభ్యులకు తప్పనిసరిగా విప్‌ జారీ చేయాలి. పార్టీ ఆదేశాలను ధిక్కరించి మరో అభ్యర్థికి ఓటు వేసిన సభ్యులపై అనర్హత వేటు పడుతుంది. ఎన్నికకు ముందు రోజు ఉదయం 11 గంటల్లోగా తమ పార్టీ విప్‌ ఎవరనేది సంబంధిత పార్టీలు ప్రిసైడింగ్‌ అధికారికి తెలియజేయాలి. అయితే కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు విప్‌ నిబంధన వర్తించదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కాగా ప్రత్యేక సమావేశాలకు ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆహ్వానం అందుతుంది. అయితే వారికి ఓటు హక్కు ఉండదు.

Updated Date - Nov 10 , 2026 | 11:50 PM