ఎంపీటీసీనా.. వద్దేవద్దు
ABN , Publish Date - Oct 24 , 2026 | 12:14 AM
All eyes are on the Sarpanch post జిల్లాలో చాలామంది ఆశావహులు సర్పంచ్ పదవి కోసం పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఎంపీటీసీ బరిలో నిలిచేందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదు. కొన్ని మండలాల్లో ఎంపీటీసీ సభ్యులుగా పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రాకపోవడంతో రాజకీయ పార్టీలకు తలనొప్పిగా మారుతోంది.
ఉత్సవ విగ్రహం అన్న అపవాదు
కేవలం మండల సమావేశాలకే పరిమితం
విముఖత చూపుతున్న నాయకులు
అందరి దృష్టి సర్పంచ్ పదవిపైనే
ఇచ్ఛాపురం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి)
ఇచ్ఛాపురం మండలంలోని ఓ పంచాయతీ సర్పంచ్ పదవి కోసం ఐదుగురు ఆశావహులు ఉన్నారు. కానీ ఎంపీటీసీ సభ్యుడిగా అవకాశం ఉన్నా అటువైపుగా చూడడం లేదు. సర్పంచ్‌గా అవకాశమివ్వాలని నేతలను కోరుతున్నారు. ఎంపీటీసీ సభ్యుడిగా మాత్రం పోటీచేయబోమని తెగేసి చెబుతున్నారు.
సోంపేట మేజర్ పంచాయతీ పరిధిలో సర్పంచ్ పదవికి ఏడుగురు ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. ఇక్కడ ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. కానీ ఈ ఏడుగురు అటువైపు మొగ్గుచూపకపోవడం విశేషం.
కవిటి మండలంలో ఎక్కువ మంది నాయకులు సర్పంచ్ పదవిపైనే ఆసక్తి చూపుతున్నారు. ఎంపీటీసీలుగా పోటీ చేసేందుకు ఇష్టపడడం లేదు. దీంతో ఇరు పార్టీల నాయకులు ఎంపీటీసీ అభ్యర్థులను వెతుక్కునే పరిస్థితి వచ్చింది.
జిల్లాలో చాలామంది ఆశావహులు సర్పంచ్ పదవి కోసం పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఎంపీటీసీ బరిలో నిలిచేందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదు. కొన్ని మండలాల్లో ఎంపీటీసీ సభ్యులుగా పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రాకపోవడంతో రాజకీయ పార్టీలకు తలనొప్పిగా మారుతోంది. ముఖ్యంగా వైసీపీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి. దీంతో ఎవరినో ఒకరిని ఒప్పించి రంగంలోకి దించాల్సి వస్తోంది. ఏదో ఒక పదవి ఉండాలనుకుంటున్నవారు... ఎంపీపీ రేసులో ఉన్నవారు మాత్రమే ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఎంపీటీసీ సభ్యులు ఉత్సవ విగ్రహాలు అన్న అపవాదు ఉంది. మండల సమావేశాలకే పరిమితం తప్ప.. చిన్న చిన్న పనులు కూడా చేయించుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో పంచాయతీల పరిధిలో సర్పంచ్ పదవులపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఖర్చుకు భయపడి పోటీ చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో నాయకులే తాము భరిస్తామంటూ చెప్పడంతో కొంతమంది ఎంపీటీసీ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. సాధారణంగా ఎంపీపీ అభ్యర్థినే అన్ని ఎంపీటీసీల పరిధిలో ఖర్చు చూసుకునేవారు. కానీ ఇప్పడు ఎంపీపీ ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. తీరా ఖర్చుపెట్టిన తరువాత ఆ మొత్తం తిరిగి వస్తుందా? లేదా? అన్న ఆందోళనతో నాయకులు ఉన్నారు.
పెరిగిన ప్రాధాన్యం..
సర్పంచ్ పదవిపై ఆశలు పెరగడానికి ప్రధాన కారణం దాని ప్రాధాన్యత పెరగడమే. కూటమి వచ్చిన తరువాత విధులు, నిధులు భారీగా పెరిగాయి. వైసీపీ హయాంలో పంచాయతీలు నిర్వీర్యమయ్యాయి. ఆర్థిక సంఘం నిధులు పక్కదారి పట్టాయి. ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు ఉండేవి కావు. చివరకు కేంద్రం అందించే నిధులను సైతం వివిధ పద్దుల రూపంలో పక్కదారి పట్టించేవారు. కూటమి వచ్చిన తరువాత పంచాయతీలకు నేరుగా నిధులు అందుతున్నాయి. పల్లెపండుగ పేరుతో గ్రామాల్లో చురుగ్గా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సర్పంచ్ పదవి చేపడితే నిధులు.. మంచి పేరు సొంతం అవుతుందని భావించి ఎక్కువ మంది ఇటువైపే మొగ్గుచూపుతున్నారు.