Share News

ఎంపీటీసీల రిజర్వేషన్లు ఖరారు

ABN , Publish Date - Oct 17 , 2026 | 12:53 AM

542 MPTC seats across 30 mandals జిల్లాలో పరిషత్‌ పోరుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే జడ్పీటీసీలు, ఎంపీపీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. తాజాగా శుక్రవారం మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపీటీసీ) ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లను ఖరారు చేశారు.

ఎంపీటీసీల రిజర్వేషన్లు ఖరారు

  • 30 మండలాల్లో 542 స్థానాలు

  • బీసీలకు 193 స్థానాలు కేటాయింపు

  • మహిళలకు 263 స్థానాలు.. జనరల్‌ కోటాలో 279 స్థానాలు

  • 21 నుంచి నామినేషన్ల స్వీకరణ

  • శ్రీకాకుళం, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పరిషత్‌ పోరుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే జడ్పీటీసీలు, ఎంపీపీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. తాజాగా శుక్రవారం మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపీటీసీ) ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ జిల్లాలో మొత్తం 542 ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్ల జాబితాను విడుదల చేశారు. ఈ నెల 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో పల్లెల్లో ఎన్నికల వేడి రాజుకుంది. పార్టీల వారీగా ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పావులు కదుపుతున్నారు. టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఎవరి స్థానం ఎటు మారిందో చూసుకుని ఆశావహులు తమ నామినేషన్లకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.

  • సామాజిక వర్గాల వారీగా సమీకరణాలు

  • జిల్లాలో ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లలో బీసీ సామాజికవర్గానికి ప్రాధాన్యం దక్కింది. మొత్తం 542 స్థానాల్లో బీసీలకు 193 స్థానాలు దక్కాయి. షెడ్యూల్డ్‌ కులాలకు (ఎస్సీ) 45 స్థానాలు ఖరారయ్యాయి. షెడ్యూల్డ్‌ తెగలకు (ఎస్టీ) 24 స్థానాలు లభించాయి. అన్‌రిజర్వ్‌డ్‌ (జనరల్‌) విభాగంలో అత్యధికంగా 280 స్థానాలు ఉన్నాయి. అలాగే మహిళలకు అన్ని కేటగిరీలు కలిపి 263 స్థానాలు కేటాయించడంతో దాదాపు 48.52 శాతం మేర ప్రాతినిఽథ్యం లభించింది.

  • జిల్లాలోనే అత్యధికంగా రణస్థలం మండలంలో 25 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. తర్వాత పలాసలో 24 స్థానాలు ఉండగా.. ఎచ్చెర్ల, గార, సోంపేట మండలాల్లో 23 చొప్పున స్థానాలు ఉన్నాయి. అత్యల్పంగా సరుబుజ్జిలి మండలంలో 9 స్థానాలు మాత్రమే ఉండగా, ఎల్‌.ఎన్‌.పేటలో 10 స్థానాలు ఉన్నాయి.

  • ఏజెన్సీ సరిహద్దు ప్రాంతాలైన హిరమండలం(3), కొత్తూరు (3), మెళియాపుట్టి (3), పాతపట్నం (3) మండలాల్లో గరిష్టంగా మూడేసి ఎస్టీ స్థానాలు రిజర్వ్‌ అయ్యాయి. మెజారిటీ మైదాన మండలాల్లో ఎస్టీ రిజర్వేషన్లు ‘సున్నా’గా నమోదయ్యాయి.

  • ఇచ్ఛాపురం, వజ్రపుకొత్తూరు మండలాల్లో ఒక్క ఎస్సీ స్థానం కూడా రిజర్వ్‌ కాలేదు.

  • ఎంపీటీసీ రిజర్వేషన్ల కేటాయింపు ఇలా

  • ------------------------------------

  • కేటగిరీ మహిళలు జనరల్‌ మొత్తం స్థానాలు

  • ----------------------------------------------------------------------------

  • ఎస్టీ 9 15 24

  • ఎస్సీ 16 29 45

  • బీసీ 91 102 193

  • అన్‌రిజర్వ్‌డ్‌ 147 133 280

  • ---------------------------------------------------------------------------

  • మొత్తం 263 279 542

  • ---------------------------------------------------------------------------

  • సర్పంచ్‌, వార్డు రిజర్వేషన్ల గెజిట్‌ విడుదల

  • సర్పంచ్‌, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియ కొలిక్కి వచ్చింది. కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ శుక్రవారం రాత్రి విడుదల చేశారు. జిల్లాలోని 910 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులు మహిళా కేటగిరీకి 448 స్థానాలు, జనరల్‌ కేటగిరీకి 462 స్థానాలు ఖరారయ్యాయి. బీసీలకు 318, ఎస్సీలకు 79, ఎస్టీలకు 48 సీట్లు ఇచ్చారు. మొత్తం 8638 వార్డులు ఉండగా మహిళలకు 4,277 స్థానాలు, జనరల్‌కు 4,361 స్థానాలు కేటాయించారు.

Updated Date - Oct 17 , 2026 | 12:53 AM