Share News

ఏడేళ్లుగా నత్తనడకే!

ABN , Publish Date - Oct 12 , 2026 | 12:24 AM

When will the Badabanda seed treatment center be inaugurated? రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలనే లక్ష్యంతో నందిగాం మండలం బడబంద కొండపై చేపట్టిన విత్తనశుద్ధి, నిల్వ కేంద్రం నిర్మాణం ఏడేళ్లుగా నత్తనడకన సాగుతోంది. గోదాముల నిర్మాణం పూర్తయినా, అవసరమైన సాంకేతిక పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రాకపోవడంతో కేంద్రం ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు.

ఏడేళ్లుగా నత్తనడకే!
బడబందలో నిర్మిస్తున్న విత్తనశుద్ధి, నిల్వ కేంద్రం

  • బడబంద విత్తనశుద్ధి కేంద్రానికి మోక్షమెప్పుడు?

  • గోదాములు పూర్తయినా అందుబాటులోకి రాని సేవలు

  • ఈ ఏడాది నవంబరు నాటికి పనులు పూర్తి చేస్తాం: అధికారులు

  • టెక్కలి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలనే లక్ష్యంతో నందిగాం మండలం బడబంద కొండపై చేపట్టిన విత్తనశుద్ధి, నిల్వ కేంద్రం నిర్మాణం ఏడేళ్లుగా నత్తనడకన సాగుతోంది. గోదాముల నిర్మాణం పూర్తయినా, అవసరమైన సాంకేతిక పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రాకపోవడంతో కేంద్రం ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు.

  • రూ.9 కోట్లతో నిర్మాణం

  • జిల్లా రైతాంగానికి సౌలభ్యం కల్పించేందుకు సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను రెండు కేంద్రాలుగా విభజించారు. ప్రస్తుతం శ్రీకాకుళం సమీపంలోని అంపోలు వద్ద జిల్లా ఏపీ సీడ్స్‌ పర్యవేక్షణలో విత్తనశుద్ధి కేంద్రం పనిచేస్తోంది. రెండో కేంద్రాన్ని నందిగాం మండలం బడబంద కొండపై రాష్ట్రీయ కృషి యోజన పథకం కింద సుమారు రూ. తొమ్మిది కోట్లతో మంజూరు చేశారు. ఈ పనులను ఏపీ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ 2020లో ప్రారంభించింది. సుమారు 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో చేపట్టిన నిర్మాణంలో భాగంగా తొలుత రూ.4.75 కోట్లతో గోదాములు నిర్మించారు. ఇవి 2024 నాటికే పూర్తయ్యాయి. అయితే మిగిలిన పనులు మాత్రం ముందుకు సాగలేదు.

  • అసంపూర్తిగానే మౌలిక సదుపాయాలు

  • రెండో దశలో కాంపౌండ్‌ వాల్‌, సీసీ రోడ్డు, వేబ్రిడ్జి, కార్యాలయ గదులు, మొలకల పరీక్షల ప్రయోగశాల, జల్లెడలు, విత్తనశుద్ధి యంత్రాలు, ఇతర సాంకేతిక పరికరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆరేళ్లు కావస్తున్నా ఈ పనులు పూర్తికాలేదు. 2025 ఖరీఫ్‌ సీజన్‌ నాటికే కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సి ఉన్నా ఆ లక్ష్యం నెరవేరలేదు. 2026 ఫిబ్రవరి నాటికి పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ భవనాలను నిర్మించి ఏపీ సీడ్స్‌కు అప్పగించింది. అయితే వేబ్రిడ్జి, సాంకేతిక పరికరాలు, ఇతర కీలక పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉంది.

  • 20 మండలాలకు ఉపయోగం

  • బడబందలో విత్తనశుద్ధి కేంద్రం అందుబాటులోకి వస్తే టెక్కలి, పలాస డివిజన్ల పరిధిలోని ఇరవై మండలాల రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ఇక్కడ సుమారు పదిహేను వేల మెట్రిక్‌ టన్నుల విత్తనాలను శుద్ధి చేసి, నిల్వ చేసి రైతులకు అందించేలా సీడ్‌ హబ్‌ను అభివృద్ధి చేయవచ్చు. ప్రస్తుతం ఖరీఫ్‌, రబీ సీజన్లలో రైతులకు అవసరమైన వరి, రాగులు, మినుములు, పెసలు, నువ్వులు, కట్టెజనుము, ఉలవలు తదితర విత్తనాలను తెలంగాణలోని వరంగల్‌, కరీంనగర్‌, హన్మకొండతోపాటు రాష్ట్రంలోని కర్నూలు తదితర ప్రాంతాల నుంచి తీసుకురావాల్సి వస్తోంది. స్థానికంగా కేంద్రం అందుబాటులోకి వస్తే ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.

  • ఏడేళ్లయినా ముందుకు సాగని పనులు

  • వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు పనులు మందకొడిగా సాగాయని, పర్యవేక్షణ కొరవడిందని విమర్శలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా కేంద్రం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవ తీసుకుని పనులు వేగవంతం చేయాలని కోరుతున్నారు. నిర్మాణ పనులు, సాంకేతిక పరికరాల ఏర్పాటులో జాప్యంపై ఇంజినీరింగ్‌ మేనేజర్‌ వెంకటేశ్వరరావు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా ఈ ఏడాది నవంబరు నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసి, సాంకేతిక పరికరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Updated Date - Oct 12 , 2026 | 12:24 AM