‘అణు’ కదలిక!
ABN , Publish Date - Nov 21 , 2026 | 10:58 PM
Setting up plants using SMR technology అణు విద్యుత్ పరిశ్రమల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. జల విద్యుత్, థర్మల్ విద్యుత్‌తో భవిష్యత్ అవసరాలు తీరవని భావిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అణు విద్యుత్ దిశగా అడుగులు వేస్తున్నాయి. కాలుష్యాన్ని తగ్గిస్తూ.. బొగ్గుపై ఆధారపడే పరిస్థితిని నివారించేలా విద్యుత్ ఉత్పత్తి కోసం స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు(ఎస్‌ఎంఆర్) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనిపై ప్రత్యేక జీవో సైతం జారీచేసింది.
థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ప్రత్యామ్నాయం
ఎస్‌ఎంఆర్ సాంకేతికతతో ప్లాంట్ల ఏర్పాటు
ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
కొవ్వాడలో పరిశ్రమపై కొత్త ఆశలు
రణస్థలం, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): అణు విద్యుత్ పరిశ్రమల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. జల విద్యుత్, థర్మల్ విద్యుత్‌తో భవిష్యత్ అవసరాలు తీరవని భావిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అణు విద్యుత్ దిశగా అడుగులు వేస్తున్నాయి. కాలుష్యాన్ని తగ్గిస్తూ.. బొగ్గుపై ఆధారపడే పరిస్థితిని నివారించేలా విద్యుత్ ఉత్పత్తి కోసం స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు(ఎస్‌ఎంఆర్) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనిపై ప్రత్యేక జీవో సైతం జారీచేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో అణువిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై మళ్లీ కదలిక వస్తోంది.
మూడున్నర దశాబ్దాల కిందట..
జిల్లాలోని రణస్థలం మండలం కొవ్వాడ పరిసర ప్రాంతాల్లో 1991లో అణువిద్యుత్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనిని మొదట్లో మత్స్యకారులు, ప్రజాసంఘాలు, పర్యావరణ వేత్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజల్లో ఉన్న భయాందోళనలు, అపోహలు నివృత్తి చేసి ప్లాంట్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పడంతో మత్స్యకారులు భూసేకరణకు అంగీకరించారు. లక్ష కోట్ల వ్యయంతో 1,208 మెగావాట్ల సామర్ధ్యంతో ఆరు రియాక్టర్లను ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. భూసేకరణతో పాటు పరిహారం చెల్లించారు. కానీ పరిశ్రమ ఏర్పాటు విషయంలో మాత్రం తాత్సారం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అణు విద్యుత్ పరిశ్రమ ఏర్పాటుపై కదలిక వచ్చింది. అమెరికా సహకారంతో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని అప్పటి మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ రాజ్యసభ వేదికగా ప్రకటించారు. కానీ తర్వాత ఎటువంటి కదలిక లేదు.
2,079 ఎకరాల భూ సేకరణ..
కొవ్వాడలో అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం సుమారు 2,079 ఎకరాల భూమిని సేకరించారు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐఎల్) ప్రతినిధులు.. కొవ్వాడ పంచాయతీ పరిధిలోని కొవ్వాడ, చిన్నకొవ్వాడ, టెక్కలి, గూడెం, రామచంద్రాపురం గ్రామాలను నిర్వాసితులుగా ప్రకటించారు. ఇళ్లు కోల్పోయిన వారికి ఎచ్చెర్ల మండలం ధర్మవరంలో నిర్వాసిత కాలనీ ఏర్పాటుకు నిర్ణయించారు. 190 ఎకరాలను రైతుల నుంచి సేకరించారు. 2013 భూసేకరణ చట్టానికి అనుగుణంగా కొంతమేర పరిహారాన్ని చెల్లించారు. అటు పరిశ్రమ ఏర్పాటుకాక.. ఇటు భూములపై హక్కులు లేక.. మరోవైపు పునరావాస గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం.. మౌలిక వసతులు లేక నిర్వాసితులు గందరగోళంలో ఉన్నారు. ఇప్పుడు నేరుగా ప్రభుత్వమే జీవో జారీచేయడంతో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.
తక్కువ స్థలంలో.. తక్కువ ఖర్చుతో..
సాధారణంగా అణువిద్యుత్ పరిశ్రమలు అంటేనే ఒక రకమైన భయం ఉంది. అందుకే ఇప్పుడు అణు విద్యుత్ ఉత్పత్తిలో అత్యాధునికంగా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ టెక్నాలజీని వినియోగించనున్నారు. తక్కువ స్థలంలో, తక్కువ ఖర్చుతో వీటిని ఏర్పాటు చేయవచ్చు. సుమారు 1000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. మానవ ప్రమేయం లేకుండా వాటంతటే అవే చల్లబడి సురక్షితంగా ఆగిపోయే టెక్నాలజీ వాటి సొంతం. వీటి ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. జిల్లాలోని రణస్థలం మండలం కొవ్వాడలో ఇప్పటికే అణు విద్యుత్ ప్లాంట్ కోసం భూములు సేకరించారు. మరోవైపు సంతబొమ్మాళి మండలం కాకరాపల్లి, సోంపేటలో థర్మల్ విద్యుత్ ప్లాంట్ల కోసం భూ సేకరణ చేపట్టారు. ఈ మూడుచోట్ల ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.