‘బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించండి’
ABN , Publish Date - Oct 29 , 2026 | 11:53 PM
వంశధార నదీ తీరంలో ముంపునకు అవకాశం ఉన్న గ్రామాల ప్రజానీకాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్యా అధికారులను ఆదేశించారు.
జలుమూరు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): వంశధార నదీ తీరంలో ముంపునకు అవకాశం ఉన్న గ్రామాల ప్రజానీకాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్యా అధికారులను ఆదేశించారు. మండలంలో గల పర్లాం, ఉప్పరపేట, అంధవరం, మాకివలస, కొమనాపల్లి తదితర నదీ తీర ప్రాంత గ్రామాల్లో గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంశధార నీటి ప్రవాహం పెరిగే సూచనలు ఉన్నందున వరదనీరు గ్రామాల్లోకి వెళ్లే అవకాశం ఉన్న ప్రజానీకానికి అప్రమత్తం చేయాలన్నారు. ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగకుండా చర్యలు చేపట్టాలన్నారు. నదిలో నీటి ప్రవాహం తగ్గేవరకు ప్రజలు నదిలోనికి వెళ్లకూడదన్నారు. నదీతీర గ్రామాల్లో వీఆర్వోలను అప్రమత్తం చేసి ప్రజానీకానికి జాగ్రత్తలు సూచించి పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. పర్లాం వద్ద వంశధార ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ పరిశీలనలో ఆర్డీవో సాయి ప్రత్యూష, తహసీల్దారు జె.రామారావు, ఎంపీడీవో బి.చిన్నమ్మడు, ఆర్.ఐ. జగదీష్, వీఆర్వోలు పాల్గొన్నారు.
వరదలు తగ్గేవరకూ బయటకు రావద్దు
కొత్తూరు (మెళియాపుట్టి), అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): వరదలు తగ్గేవరకూ బయటకు రావద్దని టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి ప్రజలకు సూచించారు. గురువారం నివగాం, మాతలలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. నివగాం నుంచి ఒడిశాలోని హడ్డుబంగి వెళ్లే రహదారి పూర్తిగా ముంపునకు గురవ్వడంతో దీనిపై జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. నష్టాలను త్వరగా అంచనా వేస్తామన్నారు. వ్యవసాయాధికారుల సూచనలను రైతులు పాటించాలని తెలిపారు. కరకట్టలను నిర్మిస్తేనే తమకు వరద ముప్పు తగ్గుతుందని ఆర్డీవోకు రైతులు విన్నవించారు. అనంతరం వసపలో మూతపడిన వల్లభరాయగెడ్డ, రామన్నగెడ్డలవద్ద జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి నష్టం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయనతో పాటు తహసీల్దార్ బి.సరోజిని తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు
పాతపట్నం, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. జలదిగ్బంధంలో ఉన్న కె.గోపాలపురం గ్రామాన్ని గురువారం పరిశీలించారు. నదీ ప్రవాహ ఉధృతి పెరిగే అవకాశాలున్నాయని తెలిపారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాన్ని విడిచి రావడానికి స్థానికులు సుముఖత చూపకపోడంతో వారికి భోజన ఏర్పాట్లు చేశారు. గ్రామాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట సి.ఐ. కె. వెంకటరావు, ఎస్.ఐ. కె.మధుసూధనరావు తదితరులు ఉన్నారు.
పునరావాస కేంద్రం ఏర్పాటు
మండల పరిధిలోని చంగుడి గ్రామ పాఠశాలలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ బి.వెంకటరమణ, సి.ఐ. కె. వెంకటరమణ తెలిపారు. ధర్మసాగరం నీరు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో చంగుడి ,సరాళి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు.
తీరప్రాంత గ్రామాల్లో అప్రమత్తం
ఎల్.ఎన్.పేట, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): వంశధార నదికి వరదనీరు పోటెత్తడంతో నదీ తీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్టు ఆమదావలస సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సన్యాసినాయుడు తెలిపారు. వంశధారన దీ తీర గ్రామాలైన లక్ష్మినర్సుపేట, మిరియాపల్లి, వాడవలస, దబ్బపాడు గ్రామాలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్నబ్ తుఫాన్ కారణంగా ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వంశధార నదికి వరదనీరు ఉధృతంగా వస్తోందని చెప్పారు. దీంతో నదీతీర గ్రామాల్లో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లకుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్టు తెలిపారు. గురువారం వేకువజాము నుంచి వంశధార నదిలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగిపోయిందన్నారు. ఉదయం 11 గంటలకు సుమారు 70వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని అన్నారు. ఇదిలా ఉండగా... తహసీల్దార్ జె.ఈశ్వరమ్మ నదీ తీర గ్రామాలను పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు. వర్షాలు పడుతున్నందువల్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వీరితోపాటు ఎస్‌ఐ చిరంజీవి, ఆర్‌ఐ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.