కాటేసిన పిడుగు
ABN , Publish Date - Apr 06 , 2026 | 12:28 AM
Mother and daughter die ఏడాది కిందట భర్త మృతి చెందగా.. కూలీ చేస్తూ ఇద్దరు కుమార్తెలను చదివిస్తోంది. ఇంతలో ఊహించని ప్రమాదం.. పిడుగు రూపంలో ఆమెతోపాటు చిన్నకుమార్తెను బలిగొంది. పెద్దకుమార్తె అనాథగా మిగిలింది.
పిడుగుపడి తల్లీకుమార్తె మృతి
మందస మండలం పెద్దకేసుపురంలో దుర్ఘటన
హరిపురం, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): ఏడాది కిందట భర్త మృతి చెందగా.. కూలీ చేస్తూ ఇద్దరు కుమార్తెలను చదివిస్తోంది. ఇంతలో ఊహించని ప్రమాదం.. పిడుగు రూపంలో ఆమెతోపాటు చిన్నకుమార్తెను బలిగొంది. పెద్దకుమార్తె అనాథగా మిగిలింది. ఇక తమకు దిక్కెవరంటూ రోదిస్తోంది. వివరాల్లోకి వెళితే.. మందస మండలం నారాయణపురం పంచాయతీ పెద్దకేసుపురంలో పిడుగుపడి తల్లీకుమార్తె మడియా కృష్ణకుమారి(36), యోగేశ్వరి(15) మృతిచెందారు. ఆదివారం మధ్యాహ్నం వారిద్దరూ తోటలో ఉన్న ఆవులకు నీరు పెట్టేందుకు వెళ్లారు. అప్పటికే వాతావరణంలో మబ్బులు కమ్ముకోవడంతో చెట్టుకింద ఆవులను శాలలో కట్టి ఇంటికి తిరిగొస్తున్నారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పిడుగు పడడంతో తల్లీకుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. వర్షం తగ్గినా, సాయంత్రమైనా తల్లీ చెల్లి ఇంటికి రాకపోవడంతో కృష్ణకుమారి పెద్ద కుమార్తె నిఖిత ఆందోళన చెందింది. పక్కింటి వారితో కలిసి తోటకు వెళ్లింది. మార్గమధ్యలో ఒక చెట్టుకింద ఇద్దరి మృతదేహాలు కనిపించడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది. కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలతో విషాదం అలుముకుంది. సీఐ తిరుపతిరావు, ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హరిపురం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనాథగా మిగిలిన పెద్దకుమార్తె
కృష్ణకుమారి భర్త ఏడాది కిందట ప్రమాదంలో మృతి చెందాడు. కూలి, వ్యవసాయ పనులు చేస్తూ కుమార్తెలను చదివిస్తోంది. యోగీశ్వరి హరిపురంలో పదోతరగతి చదివి.. ఇటీవల పరీక్షలు రాసింది. ఫలితాల కోసం ఎదురుచూస్తుండగా.. ఇంతలోనే పిడుగుపాటుకు గురై మృత్యుఒడికి చేరింది. పెద్ద కుమార్తె నిఖిత ఇంటర్ పూర్తి చేసింది. ఏడాది కిందట తండ్రిని, ఇప్పుడు అమ్మను, చెల్లినీ కోల్పోయి.. తాను అనాథగా మిగిలానని నిఖిత రోదన పలువురిని కంటతడి పెట్టించింది.
కేంద్ర, రాష్ట్రమంత్రులు దిగ్ర్భాంతి
పెద్దకేసుపురంలో పిడుగుపడి తల్లీకుమార్తె మృతి చెందారని విషయం తెలుసుకుని కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. మంత్రి అచ్చెన్నాయుడు.. ఎమ్మెల్యే గౌతు శిరీష, అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ప్రభుత్వం తరపున మృతులకు రూ.4 లక్షలు చొప్పున పరిహారాన్ని కుటుంబ సభ్యులకు అందజేస్తామన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.