Share News

వెలుగు చూస్తున్న మరిన్ని మోసాలు

ABN , Publish Date - Aug 09 , 2026 | 11:34 PM

యూరియా, డీఏపీ ఇప్పిస్తానంటూ రైతులు, వ్యాపారులకు రూ.లక్షల్లో టోకరా పెట్టిన పొందూరు యువకుడి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.

వెలుగు చూస్తున్న మరిన్ని మోసాలు

- పెరుగుతున్న బాధితుల సంఖ్య

- ఈ-క్రాప్‌, క్రాప్‌ లోన్‌ పేరిట కూడా రూ.10 లక్షలు వసూలు

- ఇప్పటికే ఎరువుల పేరిట టోకరా

- పరారీలో పొందూరు యువకుడు

పొందూరు, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): యూరియా, డీఏపీ ఇప్పిస్తానంటూ రైతులు, వ్యాపారులకు రూ.లక్షల్లో టోకరా పెట్టిన పొందూరు యువకుడి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. గతంలో పొందూరు రైతు సేవా కేంద్రంలో యూరియా పంపిణీ సమయంలో కేవలం సహాయం కోసం చేరిన ఆ యువకుడు రైతులు, వ్యాపారులు, ఆర్‌ఎస్‌కే సిబ్బందితో పరిచయాలు పెంచుకుని మాయమాటలతో మోసానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం యువకుడు పరారయ్యాడని తెలియడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. దీంతో వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పొందూరు, జి.సిగడాం మండలాల్లోనే కాకుండా ఆమదాలవలస, సంతకవిటి మండలాల్లోనూ బాధితులు ఉన్నారు.

ఈ-క్రాప్‌, క్రాప్‌లోను పేరిట వసూలు..

ఎరువులు ఇప్పిస్తానంటూ ఇప్పటికే రైతులను నిండా ముంచిన ఆ యువకుడు, తాజాగా ఈ క్రాప్‌ చేయిస్తానని, రుణాలు ఇప్పిస్తానని చెప్పి వారిని మోసం చేసినట్లు బయటపడింది. ఇందుకోసం పొందూరు, జి.సిగడాం మండలాలకు చెందిన రైతుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. రూ.10 లక్షలకు పైగానే మోసం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికీ ఫోన్లు చేసి ఎరువులు, రుణాలు ఇప్పిస్తానని మాయమాటలు చెబుతున్నట్లు కొంతమంది రైతులు చెబుతున్నారు. ఆ యువకుడి కోసం తెలియని కొందరు రైతులు కొంతమొత్తంలో ఫోన్‌పే ద్వారా నగదు పంపించి మోసపోతున్నారు. గత ఏడాది ఆర్‌ఎస్‌కే సిబ్బంది సహకారంతో భారీ మొత్తంలో యూరియా, డీఏపీ బస్తాలను పక్కదారి పట్టించి తనకు బాగా పరిచయం ఉన్న రైతులు, ఎరువుల దుకాణాదారులకు అదనపు రేట్లకు విక్రయించినట్లు తెలిసింది. ఈ ఏడాది కూడా అదే విధంగా ఎరువులను అడ్డదారుల్లో పొందేందుకు ముందుగా ఆయనకు సొమ్ములు ఇచ్చి మోసపోయారు. యువకుడి వెనుక ఆర్‌ఎస్‌కేకు చెందిన కొంతమంది సిబ్బంది ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువకుడిపై మోసంపై ఇంటలిజెన్స్‌, స్పెషల్‌బ్రాంచ్‌ పోలీసులు సైతం కూపీ లాగుతున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తారేమోనని ఎదురు చూస్తున్నారు.

Updated Date - Aug 09 , 2026 | 11:34 PM