Share News

అటు కోతులు.. ఇటు కుక్కలు

ABN , Publish Date - Sep 16 , 2026 | 11:31 PM

జిల్లాలో కోతులు, కుక్కలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. కనిపించిన వారిపై దాడి చేసి గాయపరుస్తున్నాయి.

అటు కోతులు.. ఇటు కుక్కలు
చేతిపై కోతి చేసిన గాయాన్ని చూపిస్తున్న హేమలత, ఆనందమ్మ ముక్కుపై ఉన్న గాయం

- వేర్వేరు చోట్ల దాడి

- 60 మందికి గాయాలు

- మెళియాపుట్టి, నరసన్నపేటలో ఘటన

మెళియాపుట్టి/నరసన్నపేట, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కోతులు, కుక్కలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. కనిపించిన వారిపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. గత రెండు రోజుల్లో మెళియాపుట్టి, సరసన్నపేటలో 60 మంది వీటి దాడిల్లో గాయపడ్డారు. మెళియాపుట్టిలోని జడ్పీ హైస్కూల్‌లో మంగళవారం వంట చేస్తున్న మానస పాత్రో, ఆనందరావు, హేమలత, దుక్కు ఈశ్వరరావుపై కోతులు దాడి చేశాయి. వీరంతా మెళియాపుట్టి ఆరోగ్యకేంద్రంలో వైద్యసేవలు పొందారు. బుధవారం అదే ప్రాంతంలో వై.నిఖిల్‌, బి.ఆనందరావు, అప్పలసూరమ్మ, బి.రత్నం, పి.ఆనందమ్మ, కె.జయలక్ష్మి, పి.కుమారస్వామితోపాటు మరో 19మందిని గాయపరిచినట్లు గ్రామస్థులు తెలుపుతున్నారు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వచ్చి పరిశీలించినా ప్రయోజనం లేకపోడంతో ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి కోతులను పట్టుకోవాలని కోరుతున్నారు.

- నరసన్నపేట పట్టణంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. బుధవారం స్థానిక మసీదు సమీపంలో ఒక ఎరువుల దుకాణం నుంచి పల్లిపేట, ఆర్‌అండ్‌బీ అతిధిగృహం, గాంధీనగర్‌, సంతపేట తదితర ప్రాంతాల్లో సంచరిస్తూ పలువురిపై దాడిచేసి గాయపరిచింది. చల్లబంద గ్రామానికి చెందిన పి.గోవిందరావు, జమ్ముకు చెందిన పల్లి లక్ష్మీనారాయణ, డి.ఎర్రయ్య, నరసన్నపేటకు చెందిన డివెంకటరమణ, ఉదయ్‌శంకర్‌, కరగాంకు చెందిన లక్ష్మణరావు, పి.వెంకటరమణ గాయపడ్డారు. మంగళవారం వి.మోక్షిత్‌, చెంచులు, ప్రసాదరావు, సింహాచలం తదితరులపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. రెండు రోజులుగా నరసన్నపేట ప్రాంతీయ ఆసుపత్రికి కుక్కకాటు బాధితులు క్యూకడుతున్నారు. 30మందికిపైగా చికిత్స అందజేసినట్లు ప్రాంతీయ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. పంచాయతీ సిబ్బంది తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

16nnp1.gif

నరసన్నపేట ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న కుక్కకాటు బాధితులు

Updated Date - Sep 16 , 2026 | 11:31 PM