Share News

ఇచ్ఛాపురంలో డబ్బు, మద్యం!

ABN , Publish Date - Oct 31 , 2026 | 12:41 AM

Import of liquor into Odisha ఇచ్ఛాపురం మునిసిపల్‌ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ కీలకంగా మారింది. ప్రచారపర్వం శుక్రవారం ముగియడంతో ప్రధాన పార్టీల శిబిరాల్లో పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు వైసీపీకి అధిష్ఠానం నుంచి వచ్చినట్లు ప్రచారం జరుగుతున్న డబ్బు పంపకాల్లో కోత పడటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

ఇచ్ఛాపురంలో డబ్బు, మద్యం!

వైసీపీ అభ్యర్థులకు చేరని అధిష్ఠానం పంపిన డబ్బు

పంపకాల్లో కోత విధించడంపై అభ్యర్థుల ఆందోళన

ఒడిశా మద్యం దిగుమతి.. ఓటుకు వేలల్లో నగదు పంపిణీ

ఇచ్ఛాపురం, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం మునిసిపల్‌ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ కీలకంగా మారింది. ప్రచారపర్వం శుక్రవారం ముగియడంతో ప్రధాన పార్టీల శిబిరాల్లో పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు వైసీపీకి అధిష్ఠానం నుంచి వచ్చినట్లు ప్రచారం జరుగుతున్న డబ్బు పంపకాల్లో కోత పడటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సరిహద్దు పట్టణం కావడంతో ఒడిశా మద్యం కూడా పెద్దఎత్తున అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని వార్డుల్లో ఓటుకు 2 వేల నుంచి 3 వేల రూపాయల వరకు పంపిణీ చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.

నిధుల పంపకాల్లో కోతలు!

ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో మొత్తం 28 వార్డులు ఉన్నాయి. ఎన్నికల ఖర్చుల కోసం వైసీపీ అధిష్ఠానం నుంచి నిధులు వచ్చినట్లు ప్రచారం ఉంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా ఉన్న ఓ కీలక నేత ద్వారా ఈ నిధులను పంపించినట్లు సమాచారం. అయితే ఆ మొత్తం అభ్యర్థులకు పూర్తిస్థాయిలో చేరకపోవడంతో పార్టీలో చర్చ మొదలైంది. కొంతమేర కోత విధించడంతో అభ్యర్థులు నిలదీసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి చైర్‌పర్సన్‌ అభ్యర్థే ఎన్నికల ఖర్చులను భరించాలన్న నిర్ణయం జరిగినట్లు సమాచారం. అయితే, జిల్లా నాయకత్వం వద్ద కుదిరిన ఒప్పందం అమలులో తేడాలు రావడంతో అధిష్ఠానం నేరుగా నిధులు పంపినట్లు ప్రచారం సాగుతోంది. అయినా జిల్లా లేదా స్థానిక నాయకత్వం వద్దే కొంత మొత్తం నిలిచిపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై అధిష్ఠానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ఒడిశా మద్యానికే డిమాండ్‌

సరిహద్దు పట్టణం కావడంతో ఇచ్ఛాపురంలో ఒడిశా మద్యం సులువుగా అందుబాటులోకి వస్తోంది. అక్కడ తక్కువ ధరకు లభించే నాటుసారాతో పాటు చీప్‌ లిక్కర్‌కు కూడా డిమాండ్‌ పెరిగింది. ముఖ్యంగా 90 ఎంఎల్‌ సీసాలు సైతం అందుబాటులో ఉండటంతో రాజకీయ పార్టీలు ఒడిశా మద్యంపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అన్ని ప్రధాన పార్టీలూ అక్కడి నుంచి మద్యం తెప్పించుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఏపీలోనూ అన్ని రకాల బ్రాండ్లు లభిస్తుండటంతో ఆర్థిక స్థోమత ఉన్న అభ్యర్థులు ఇక్కడి మద్యాన్ని కూడా నిల్వ చేసుకుంటున్నారు.

మునిసిపల్‌ ఎన్నికల్లో టోకెన్‌ విధానం అమలు చేస్తున్నట్లు సమాచారం. ప్రధాన పార్టీల శిబిరాలు ప్రత్యేకంగా స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేసుకున్నాయి. పోలింగ్‌ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు టోకెన్లు ఇచ్చిన వారికి మద్యం సరఫరా చేసేలా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

వార్డుల్లో పోటాపోటీగా నగదు పంపిణీ

సరిహద్దు ప్రాంతంలోని ఏఎస్‌పేటలో 3,4 వార్డుల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థి కూడా పోటాపోటీగా నగదు పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం ఉంది. 4వ వార్డులో వైసీపీ అభ్యర్థి ఒక్కో ఓటుకు 2 వేల నుంచి 3 వేల రూపాయల వరకు ఇస్తున్నట్లు సమాచారం. 11వ వార్డులోనూ నగదు పంపిణీ మరింత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థి బంగారు వ్యాపారి కాగా, వైసీపీ అభ్యర్థి హార్డ్‌వేర్‌ వ్యాపారి. ఇద్దరూ ఆర్థికంగా బలంగా ఉండటంతో ఖర్చుకు వెనుకాడకుండా పోటీ పడుతున్నట్లు స్థానికంగా చర్చ సాగుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభివృద్ధి పనుల హామీలూ గుప్పిస్తున్నారు. తమకు ఓటేస్తే వార్డులో మండపం నిర్మిస్తామని ఒక అభ్యర్థి హామీ ఇవ్వగా, మరో అభ్యర్థి స్లాబ్‌తో సహా పూర్తి స్థాయిలో మండపం నిర్మిస్తానని చెబుతున్నట్లు సమాచారం. దీంతో వార్డుల్లో ఎన్నికల పోరు మరింత ఆసక్తికరంగా మారింది. చివరకు ఓటర్లు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే.

Updated Date - Oct 31 , 2026 | 12:41 AM