Share News

డబ్బు. మద్యం.. విందు!

ABN , Publish Date - Nov 28 , 2026 | 12:13 AM

Distribution of handouts to voters by Sarpanch candidates సర్పంచు పదవి కోసం అభ్యర్థులు ప్రలోభాలకు దిగారు. ఓటుకు రూ.2వేలు చొప్పున ఇస్తున్నారు. కొన్నచోట్ల పురుషులకు మద్యం, మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారు.

డబ్బు. మద్యం.. విందు!

ఓటర్లకు సర్పంచు అభ్యర్థుల పంపకాలు

ఒక్కో ఓటుకు రూ.2వేలు చొప్పున..

మహిళలకు చీరల పంపిణీ

వార్డు సభ్యులకు కుక్కర్లు, ఇతర కానుకలు

నరసన్నపేట, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): సర్పంచు పదవి కోసం అభ్యర్థులు ప్రలోభాలకు దిగారు. ఓటుకు రూ.2వేలు చొప్పున ఇస్తున్నారు. కొన్నచోట్ల పురుషులకు మద్యం, మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో రెండు, మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఈ నెల 29, డిసెంబరు 2న పోలింగ్‌ జరగనుంది. అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ఖర్చుకు వెనుకాడటం లేదు. కొన్ని గ్రామాల్లో ఓటుకు రూ.2 వేల వరకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పురుషులకు మద్యం, మహిళలకు చీరలు, వార్డు సభ్యులకు కుక్కర్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. రెండో విడతలో పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, కొత్తూరు, ఎల్‌.ఎన్‌.పేట, ఆమదాలవలస, బూర్జ, పొందూరు, సరుబుజ్జిలి, ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు, జి.సిగడాం మండలాల్లోని 383 పంచాయతీల్లో, మూడో విడతలో నరసన్నపేట, జలుమూరు, పోలాకి, సారవకోట, గార, శ్రీకాకుళం, టెక్కలి, నందిగాం, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల్లోని 324 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి.

పాత విభేదాలకు స్వస్తి..

సర్పంచ్‌ ఎన్నికలు గ్రామాల్లో వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన అంశంగా మారాయి. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలతో పోలిస్తే అభ్యర్థుల వ్యక్తిగత పరిచయాలు, పలుకుబడి, సంబంధాలు ఇక్కడ కీలకంగా మారుతున్నాయి. దీంతో అభ్యర్థులు పాత గొడవలు, రాజకీయ విభేదాలను పక్కనపెట్టి మరీ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. గతంలో విభేదాలున్న వారి ఇళ్లకు వెళ్లి సయోధ్య కుదుర్చుకుంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో పది మందికిపైగా ఓటర్లు ఉండటంతో ఆయా కుటుంబాల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు.

ఓటుకు రూ.రెండు వేల వరకు?

ఆర్థికంగా బలమైన అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు భారీగా ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రత్యర్థి ఎంత ఇస్తే అంతకంటే ఎక్కువ ఇవ్వాలనే ధోరణి కనిపిస్తోంది. ప్రస్తుతం కొన్ని చోట్ల ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు ఆఫర్లు ఇస్తున్నట్లు సమాచారం. ఆర్థిక స్థోమత లేని అభ్యర్థుల ఖర్చును ప్రధాన పార్టీల నాయకులు భరిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళలకు చీరలు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వార్డు సభ్యులు ఉపసర్పంచ్‌ ఎన్నికల్లో కీలకం కావడంతో వారికి కుక్కర్లు, గౌన్లు ఇచ్చేందుకు కొందరు అభ్యర్థులు సన్నద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని స్టీల్‌ దుకాణాలకు పెద్దఎత్తున కుక్కర్ల ఆర్డర్లు రావడంతో వ్యాపారులు సరుకు తెప్పించే పనిలో ఉన్నారు.

రోజూ విందులు..

గ్రామాల్లో ప్రచారంతోపాటు విందులు కూడా కొనసాగుతున్నాయి. ఉదయం అల్పాహారం, రాత్రి మద్యం, విందులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రచారానికి వచ్చిన ఓటర్లలో మద్యం అలవాటు ఉన్నవారికి బాటిళ్లు అందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఓటర్లను ప్రలోభపెడితే చర్యలు: ఎస్పీ

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టినా.. బెదిరించినా కఠినచర్యలు తప్పవని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ‘ఈ నెల 29న రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టాం. 2,300 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు సిద్ధం చేశాం. ఇద్దరు ఏఎస్పీలు, ఐదుగురు డీఎస్పీలు, 30 మంది సీఐలు, 70 మంది ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఎన్నికల విధుల్లో పాల్గొనున్నారు. స్థానికేతరుల కదలికపై ప్రత్యేక నిఘా పెట్టాం. సమస్యాత్మక గ్రామాల్లో అదనపు పోలీస్‌ బలగాలను సిద్ధం చేశాం. చెక్‌పోస్టులు, హోటళ్లు, లాడ్జీల్లో తనిఖీలు ముమ్మరం చేశామ’ని ఎస్పీ తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు, అనుమానాస్పద కార్యకలాపాల సమాచారాన్ని జిల్లా పోలీస్‌ కంట్రోల్‌రూం 63099 90933, 63099 90923, 63099 90804, 63099 90811 నెంబర్లకు తెలియజేయాల’ని ఎస్పీ సూచించారు.

Updated Date - Nov 28 , 2026 | 12:13 AM