ఇకనైనా మారుతారా?
ABN , Publish Date - Apr 11 , 2026 | 12:12 AM
some MLAs were given the Chief Minister's Class జిల్లాలో ప్రతిపక్షం తుడిచిపెట్టుకుపోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎనిమిదికి ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లోనూ ఎదురులేకుండా గెలిచేశాం కదా.. ఇక ఆడిందే ఆట, పాడిందే పాట అని కూటమి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అనుకుంటే పొరపాటే. జిల్లాలో ప్రతిపక్షం లేకపోవచ్చు.. కానీ, పాలకుల పనితీరును అడుగడుగునా గమనిస్తున్న ‘నిఘా నేత్రం’ అమరావతిలో ఉంది.
ఇటీవల కొందరు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి క్లాస్
నియోజకవర్గాల్లో సర్వేలు.. మార్కుల కేటాయింపు
మంత్రి లోకేశ్ వద్దకు చేరుతున్న అదనపు సమాచారం
తెరవెనుక వ్యవహారాలపై జాగ్రత్త వహించాల్సిందే
మళ్లీ సమీక్షకల్లా మార్పు రావాలని ప్రజల ఆకాంక్ష
శ్రీకాకుళం, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రతిపక్షం తుడిచిపెట్టుకుపోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎనిమిదికి ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లోనూ ఎదురులేకుండా గెలిచేశాం కదా.. ఇక ఆడిందే ఆట, పాడిందే పాట అని కూటమి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అనుకుంటే పొరపాటే. జిల్లాలో ప్రతిపక్షం లేకపోవచ్చు.. కానీ, పాలకుల పనితీరును అడుగడుగునా గమనిస్తున్న ‘నిఘా నేత్రం’ అమరావతిలో ఉంది. క్షేత్రస్థాయిలో ఏ ఎమ్మెల్యే గ్రాఫ్ ఎలా ఉంది? ఎవరి అనుచరులు ఏం చేస్తున్నారు? సహజ వనరులు పక్కదారి పడుతున్నాయా? ఇవన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్ద పక్కాగా ‘సర్వే’ నివేదికల రూపంలో ఉంటున్నాయి. ఈ రిపోర్టుల ఆధారంగానే రెండు రోజుల కిందట విజయవాడలో జరిగిన జిల్లా ప్రజాప్రతినిధుల సమీక్షలో సీఎం కొందరికి గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ.. ఎలాంటి తప్పులు చేస్తున్నారో బయటపెట్టారు. కొందరికి అక్షింతలు వేశారు. మరోసారి నిర్వహించే సమీక్షకు అక్షింతలు కాకుండా సీఎం నుంచి అభినందనలను పొందితే జిల్లా అభివృద్ధిపథాన నడిచినట్లే.
సర్వేలు చెబుతున్నాయి
సాధారణంగా అధికారపార్టీ ప్రజాప్రతినిధుల అనుచరులు, బంధువులు చేసే అక్రమాలు, దందాలు ప్రజల దృష్టికి వెళ్లినా.. ఆ విషయాన్ని నేరుగా ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి చేప్పే సాహసం చేయలేరు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే తప్పుచేసినా.. అధిష్ఠానం అడిగే పరిస్థితి లేకపోయింది. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయిస్తున్నారు. ‘ఎమ్మెల్యేలు ప్రజలందరినీ కలుపుకుని వెళ్తున్నారా? కూటమిలోని ఇతర పార్టీల నాయకులను, కార్యకర్తలను పట్టించుకుంటున్నారా? ప్రజలతో ఎమ్మెల్యేల ప్రవర్తన ఎలా ఉంది? ఎమ్మెల్యేల బంధువుల, అనుచరులు అక్రమాలకు పాల్పడుతున్నారా? వారి అతి వల్ల ఎమ్మెల్యేకు చెడ్డపేరు వస్తోందా? సంబంధం లేని వ్యవహారాల్లో ఎమ్మెల్యేలు తలదూరుస్తున్నారా?’ ఇలా ప్రతి అంశాన్నీ ముఖ్యమంత్రి సర్వేల ద్వారా రాబడుతున్నారు. ప్రజల నోళ్లలో నానుతున్న వాస్తవాలను ఇంటెలిజెన్స్, ప్రైవేట్ సర్వేల ద్వారా బేరీజు వేసుకుంటున్నారు. దీనికితోడు మంత్రి నారా లోకేశ్ వద్దకు కొంత సమాచారం చేరుతోంది.
సందిగ్ధంలో కొందరు ఎమ్మెల్యేలు
సర్వేల నివేదిక ఆధారంగా ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు.. జిల్లా ఎమ్మెల్యేలతో అమరావతిలో సమీక్ష నిర్వహించారు. ప్రతి ఎమ్మెల్యే పనితీరుకు మార్కులు కేటాయించారు. సర్వేలో ప్రజల నుంచి మంచి అభిప్రాయం వ్యక్తమైన వారిని మెచ్చుకుంటూనే.. వ్యతిరేకత వచ్చిన వారిని మారాలని హెచ్చరించారు. వారు చేసిన తప్పిదాలను తెలియజేశారు. ఏ ఎమ్మెల్యే ఎక్కడ విఫలం అవుతున్నారో అధినేతకు స్పష్టంగా తెలిసిపోవడంతో కొందరు ప్రజాప్రతినిధులు ఈ సమీక్షలో ఏం బదులివ్వాలో తెలియక సందిగ్ధంలో పడిపోయారు.
మార్పు చెందాల్సిందే
చంద్రబాబునాయుడు అమరావతిలో బిజీగా ఉన్నా.. ఆయన దృష్టి జిల్లాల పనితీరుపైనే ఉంది. మరోవైపు మంత్రి నారా లోకేశ్ టీమ్ కూడా ప్రత్యేక దృష్టి సారించిందనే విషయాన్ని ఎమ్మెల్యేలు గుర్తుంచుకోవాలి. జిల్లాలో ప్రతిపక్షం లేకపోయినా విమర్శలకు, వివాదాలకు ఆస్కారం లేకుండా పాలన సాగించాలి. మరోసారి సీఎం సమీక్షలో అక్షింతలు కాకుండా అందరూ అభినందనలు పొందాలంటే కొన్ని విషయాల్లో కఠినంగా ఉండాల్సిందే. ఇసుక, గ్రావెల్, మద్యం దుకాణాల వ్యవహరాల్లో నేరుగా గానీ, పరోక్షంగా గానీ జోక్యం చేసుకోకూడదు. జిల్లాలో సహజ వనరులను కాపాడుతూ పారదర్శకంగా వ్యవహరించాలి. చిన్నపాటి విభేదాలు, అసమ్మతి లేకుండా కూటమి నాయకులను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలి. గత వైసీపీ ప్రభుత్వ పాలకుల మాదిరిగా అధికారులను ఇబ్బంది పెడుతూ, పద్ధతికి విరుద్ధంగా పనులు చేయాలని ఒత్తిడి తీసుకురాకూడదు. జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేలా అధికారులతో సమన్వయం చేసుకోవాలి. సర్వేల్లో నెగిటివ్ ముద్ర పడకుండా పనితీరును మెరుగుపరుచుకోవాలని జిల్లా ప్రజలు, కూటమి అభిమానులు కోరుతున్నారు.