రూ.8.28 కోట్లు దుర్వినియోగం
ABN , Publish Date - Oct 19 , 2026 | 11:53 PM
Expenditures at Ambedkar University in violation of regulations ఎచ్చెర్లలోని అంబేడ్కర్ యూనవర్సిటీలో నిధుల దుర్వినియోగం చర్చనీయాంశమవుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.8.28 కోట్లు దుర్వినియోగమైనట్టు ఇటీవల ఆడిట్ రిపోర్టులో బయటపడింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కొంతమంది అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది.
అంబేడ్కర్ యూనివర్సిటీలో నిబంధనలకు వ్యతిరేకంగా ఖర్చులు
పాలక మండలి అనుమతులు లేకుండా నిర్ణయాలు
ఆడిట్ రిపోర్టులో బయటపడిన అక్రమాలు
ఎచ్చెర్ల రూరల్, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్లలోని అంబేడ్కర్ యూనవర్సిటీలో నిధుల దుర్వినియోగం చర్చనీయాంశమవుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.8.28 కోట్లు దుర్వినియోగమైనట్టు ఇటీవల ఆడిట్ రిపోర్టులో బయటపడింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కొంతమంది అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. ఇష్టారాజ్యంగా నిధులు ఖర్చు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
యూనివర్సిటీలో పాలక మండలి అనుమతి లేకుండానే సీపీడబ్ల్యూడీ సంస్థ నిర్మించిన భవనానికి రూ.6.37 కోట్లు చెల్లించారు. సబ్జెక్టు కాంట్రాక్టు ఫ్యాకల్టీకి రూ.96.97 లక్షలు ఇచ్చారు. కనీసం 30 శాతం అడ్మిషన్లు లేని రూరల్ డెవలప్‌మెంట్, సోషల్ వర్కు, ఎకనామిక్స్ వంటి సబ్జెక్టులకు అవసరం లేకున్నా కాంట్రాక్టు టీచర్లను నియమించారు. చెల్లించిన వేతనం, పని గంటలు వంటివి నిరూపించే ఫైళ్లు ఆడిట్ కమిటీకి ఇవ్వలేదు.
ప్రధానంగా వాహనాల వినియోగానికి రూ. 21.23 లక్షలు ఖర్చు చేశారు. కారు వినియోగం, లాగ్ రిజిస్ట్రార్, పెట్రోల్, డీజిల్, నిర్వహణ ఖర్చులు వంటి బిల్లులు మాత్రం సమర్పించలేదు.
యూనివర్సిటీ పరిధిలో 20 కిలోమీటర్ల లోపు టోల్‌గేట్లు లేవు. అయినా టోల్ ఫీజు ఫాస్టాగ్‌కు రూ. రూ.50వేలు ఖర్చు చేశారు. విశాఖపట్నం నుంచి విశ్వవిద్యాలయానికి రాకపోకల కోసం ఈ నిధులు ఖర్చు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రూ.20,53,324 రిపేర్ ఖర్చులు చూపించారు. వీటికి ట్రాన్స్‌ఫోర్టు ఆధారిటీ సర్టిఫికెట్ లేదు.
రూ.6.19లక్షలతో ఆల్టో కారు కొనుగోలు చేశారు. ఒక ఉన్నతాధికారి.. తన మనవడిని పాఠశాలకు తీసుకెళ్లి వచ్చేందుకు, కుటుంబ సభ్యుల అవసరాల నిమిత్తం దీనిని వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వ అనుమతి లేకుండా రిటైర్డ్ ఉద్యోగిని రూ.లక్ష వేతనానికి నియమించకూడదు. కానీ ఆంధ్రా విశ్వవిద్యాలయం విశ్రాంత ఉద్యోగిని నెలకు రూ.లక్ష వేతనానికి నియమించారు. క్టార్టర్, ఇతర సౌకర్యాలు కల్పించారు. ఫైనాన్స్ కోడ్ మేరకు ఎగ్జిక్యూటివ్ కౌన్సెల్ ఆమోదం లేదు. నిబంధనలకు వ్యతిరేకంగా విశ్రాంత డ్రైవర్‌కు టీఏ, డీఏ రూ.9 వేలు చెల్లించారు. ఓ ఏజెన్సీకి ఎలాంటి రశీదులు, డ్యాక్యుమెంట్‌లు లేకుండా రూ.17,36,520 రిఫండ్ చేశారు. ఇలా ఇష్టారాజ్యంగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆడిట్‌లో వెల్లడైంది. బాధ్యులపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్న చర్చ సాగుతోంది.