మైనర్ల ఘాతుకం
ABN , Publish Date - Feb 08 , 2026 | 11:57 PM
Cash, gold stolen from elderly woman's house పలాసలో ఇద్దరు బాలికలు ఓ వృద్ధురాలి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. శీతలపానీయంలో నిద్రమాత్రలు కలిపి.. వృద్ధురాలికి ఇచ్చారు. ఆమె నిద్రలోకి జారుకున్న తర్వాత రూ.2.50 లక్షల నగదు, పావుతులం బంగారం చెవిదుద్దులు దోచేశారు. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
శీతలపానీయంలో నిద్రమాత్రలు కలిపి...
వృద్ధురాలి ఇంట్లో నగదు, బంగారం చోరీ
పలాస, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): పలాసలో ఇద్దరు బాలికలు ఓ వృద్ధురాలి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. శీతలపానీయంలో నిద్రమాత్రలు కలిపి.. వృద్ధురాలికి ఇచ్చారు. ఆమె నిద్రలోకి జారుకున్న తర్వాత రూ.2.50 లక్షల నగదు, పావుతులం బంగారం చెవిదుద్దులు దోచేశారు. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పలాసలోని బత్తులవీధికి చెందిన మల్లా ప్రేమకుమారి అనే వృద్ధురాలు చిన్న అద్దె ఇంట్లో ఒంటరిగానే నివసిస్తోంది. గతంలో జీడి కార్మికురాలిగా పనిచేసేది. వృద్ధాప్య దశలో అవసరాల దృష్ట్యా కూడబెట్టిన డబ్బులు రూ.2.50లక్షల వరకూ ఇనుపపెట్టెలో భద్రపరిచింది. ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్‌తో కాలం వెల్లదీస్తోంది. ఆమెకు శీతలపానీయాలు (కూల్ డ్రింక్స్) అంటే ఎంతో ఇష్టం. ఈ విషయాన్ని గుర్తించిన ఇద్దరు బాలికలు శనివారం మధ్యాహ్నం ఆ వృద్ధురాలి వద్దకు వెళ్లారు. మత్తుమందు కలిపిన శీతలపానీయం ఇచ్చారు. ఆ పానీయం తాగిన వెంటనే వృద్ధురాలు అపస్మారకస్థితికి వెళ్లిపోయింది. వెంటనే బాలికలిద్దరూ ఇంట్లో సామగ్రి వెతికి ఇనుపపెట్టెలో దాచుకున్న నగదు, ఆమెకు ఉన్న బంగారు చెవిదుద్దులు అపహరించారు. రాత్రివరకూ ఆ వృద్ధురాలు బయటకు రాలేదు. దీంతో ఇరుగుపొరుగు వారు వెళ్లి చూడగా.. ఇంట్లో ఆమె అచేతనంగా కనిపించింది. ఆమె మృతి చెందిందని అంతా భావించి.. కాశీబుగ్గ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ వై.రామకృష్ణ వెళ్లి పరిశీలించగా.. ఆమె అస్వస్థతకు గురైనట్టు గుర్తించారు. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఆదివారం ఉదయం ఆమె కాస్త కోలుకున్నారు. కాగా.. శనివారం మధ్యాహ్నం తెలిసిన బాలిక వచ్చి శీతలపానీయం ఇచ్చిందని.. అది తాగిన తర్వాత ఏమైందో తనకు తెలియలేదని వృద్ధురాలు పోలీసులకు చెప్పింది. దాచుకున్న నగదు రూ.2.50 లక్షలు, పావుతులం బంగారం చెవిదుద్దులు కనపడడం లేదని తెలిపింది. కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ తన బృందంతో చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా ఉండడంపై ఆరా తీశారు. బాధితురాలు, స్థానికుల సమాచారం మేరకు ఇద్దరు బాలికలు ఈ చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఇద్దరి బాలికలతోపాటు చోరీ వెనుక ఉన్న వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
వరుస చోరీలు..
బత్తులవీధిలో గత ఏడాది అక్టోబరు నుంచి వరుసగా నాలుగు చోరీలు జరిగాయి. బంగారు ఆభరణాలు, నగదు చోరీకి గురైనట్టు కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఓ బాధితురాలు.. ఓ బాలిక చోరీకి పాల్పడుతోందని ఆరోపించగా.. తిరిగి ఆ బాలికపైనే అఘాయిత్యం చేశారని కేసు పెడతామని అవతలి వ్యక్తులు బెదిరించడంతో ఏమీ చేయలేని దుస్థితి నెలకొంది. ఇటీవల ఓ వికలాంగుడికి చెందిన రూ.35వేల నగదు కూడా చోరీకి గురైంది. ఇలా వరుస ఘటనల నేపథ్యంలో చోరీల నియంత్రణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.