‘చౌక’ధరల్లో..
ABN , Publish Date - Aug 05 , 2026 | 11:57 PM
250 types of items through ration shops చౌకధరల దుకాణాలను ఆధునిక మినీ మార్ట్‌లుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కార్డుదారులకు సరసమైన ధరలకు అన్ని రకాల నిత్యావసర సరుకులను విక్రయించనుంది. తద్వారా రేషన్ డీలర్లకు కూడా అదనపు ఆదాయంతో ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని భావిస్తోంది.
మినీమార్టులు వచ్చేస్తున్నాయ్
రేషన్‌షాపుల ద్వారా 250 రకాల నిత్యావసర వస్తువులు
మార్కెట్ ధర కన్నా తక్కువకు విక్రయాలు
జిల్లాలో తొలిదశలో 32 దుకాణాల ఏర్పాటుకు సన్నాహాలు
నరసన్నపేట/ పలాస, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): చౌకధరల దుకాణాలను ఆధునిక మినీ మార్ట్‌లుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కార్డుదారులకు సరసమైన ధరలకు అన్ని రకాల నిత్యావసర సరుకులను విక్రయించనుంది. తద్వారా రేషన్ డీలర్లకు కూడా అదనపు ఆదాయంతో ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని భావిస్తోంది. రేషన్ షాపులను నిరంతరాయంగా నడిచే కమ్యూనిటీ రిటైల్ కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో పౌరసరఫరాల శాఖ అధికారులు మినీమార్టుల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు.
జిల్లాలో 1,603 చౌకధరల(రేషన్) దుకాణాలు, 6,60,739 కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 22 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి కేంద్ర ప్రభుత్వం ఆహారభద్రత పథకం కింద ప్రతినెలా సుమారు 8వేల టన్నుల బియ్యాన్ని ఉచితంగా అందిస్తోంది. బియ్యంతోపాటు కొన్ని డిపోల్లో పంచదార, కందిపప్పు, శనగలు వంటి సరుకులను మార్కెట్ కన్నా కాస్త తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. తొలివిడతగా జిల్లాలో 32 రేషన్ దుకాణాలను మినీమార్టులుగా ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 400 కార్డులకుపైగా ఉన్న రేషన్ దుకాణాలను మినీమార్టులుగా మార్చేందుకు కసరత్తు చేస్తున్నారు. శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం తదితర పట్టణాల్లో కూడా ఏర్పాటు దిశగా చర్యలు చేపడుతున్నారు.
ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం మినీమార్టుల్లో బియ్యంతోపాటు పప్పులు, వంటనూనెలు, మాసాలా దినుసులు, సబ్బులు, వ్యక్తిగత పరిశుభ్రత ఉత్పత్తుల తదితర దాదాపు 250 రకాల నాణ్యమైన నిత్యావసర వస్తువులు విక్రయించనున్నారు. మార్కెట్ ధరలతో పోలిస్తే ప్రతి వస్తువుపై రూ.5 వరకు తక్కువకు అందించేలా చర్యలు చేపట్టారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వస్తువులు అందుబాటు ధరల్లో లభించడంతోపాటు గ్రామీణ రిటైల్ వ్యవస్థకు కొత్త ఊతం లభిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
డీలర్లకు అదనపు ఆదాయం
రేషన్ దుకాణాల ద్వారా డీలర్లకు అంతంతమాత్రమే ఆదాయం వస్తోంది. మినీమార్టుల ద్వారా డీలర్లకు అదనపు ఆదాయం లభించనుంది. ప్రభుత్వం టోల్ వర్తకుల నుంచి నేరుగా నిత్యావసర వస్తువులను మినీమార్ట్‌లకు పంపిణీ చేయనుంది. వీటి ధరలను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ప్రతినెలా విక్రయాల మేరకు డీలర్లకు కమీషన్ అందించనుంది. ఒక్కో డీలరు నెలకు కనీసం రూ.15వేల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది.
తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం
మార్కెట్‌లో బియ్యం ధరకు రెక్కలొచ్చాయి. నాణ్యమైన బియ్యం ధర కిలో రూ.60 నుంచి రూ.65 పలుకుతోంది. సన్నబియ్యం ధర క్వింటాల్ రూ.6వేలు ఉండగా.. కేవలం మూడు నెలల్లోనే రూ.700 వరకు పెరిగింది. మిగిలిన రకాల బియ్యం ధరలు కూడా అదేస్థాయిలో పెరిగాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ కన్నా తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు పౌరసరఫరాలశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల 1 నుంచి శ్రీకాకుళం, ఆముదాలవలస, కోటబొమ్మాళిలోని రైతుబజార్లతోపాటు 30 ప్రధాన రైస్‌మిల్లుల్లో తక్కువ ధరకే ప్రామాణిక బియ్యం విక్రయిస్తున్నారు. సూపర్ ఫైన్/స్టీమ్(బీపీటీ) రకం బియ్యం రూ.52కు, గ్రేడ్-1 పచ్చిబియ్యం(బీపీటీ) రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు. మినీమార్టులు అందుబాటులోకి వస్తే.. బియ్యం మాదిరి ఇతర నిత్యావసర వస్తువులు కూడా మార్కెట్ కన్నా తక్కువకు లభించనున్నాయని వినియోగదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఏర్పాటుకు సిద్ధం
మినీమార్టులు ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో వీటిని ఏర్పాటు చేస్తాం. దీనిపై జిల్లాలో డీలర్లకు అవగాహన కల్పిస్తున్నాం. ముందు అర్బన్ ప్రాంతాలు.. తర్వాత గ్రామాల్లో ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నాం. మార్ట్ ఏర్పాటుకు అనువుగా ఉన్న రేషన్ దుకాణాలను గుర్తించాం.
- సూర్యప్రకాశరావు, డీఎస్‌వో, శ్రీకాకుళం
డీలర్లుకు అండగా..
రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు విక్రయాలు చేపడితే డీలర్లకు అదనపు ఆదాయం లభిస్తుంది. అయితే మార్టు ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోంది.
- ఉణ్న బాలభాస్కరరావు, డీలర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షడు, నరసన్నపేట