Share News

పెట్టుబడులతో ఉత్తరాంధ్రకే వలసలు

ABN , Publish Date - May 17 , 2026 | 12:22 AM

We will develop the srikakulam ఉత్తరాంధ్ర అభివృద్ధిపై గతంలో గొడ్డలి పార్టీతో వేటు పడింది. వలసల ప్రాంతంగా కొనసాగుతోంది. ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకే వలసలు వచ్చేలా సంకల్పించాం. పెట్టుబడులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామ’ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

పెట్టుబడులతో ఉత్తరాంధ్రకే వలసలు
నరసన్నపేట సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, హాజరైన కూటమి శ్రేణులు, అభిమానులు, ప్రజలు

  • మూడేళ్లలో నేరడి బ్యారేజీ పూర్తి

  • జిల్లాను అభివృద్ధి చేస్తాం

  • గొడ్డలి పార్టీతో అప్రమత్తంగా ఉండాలి

  • ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

  • నరసన్నపేటలో ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’.. ప్రజావేదిక విజయవంతం

  • శ్రీకాకుళం జిల్లా ప్రజలు అత్యంత తెలివైనవారు. కష్టజీవులు. ఉత్తరాంధ్ర ప్రజలు బతుకుదెరువు కోసం వలస వెళ్లకుండా.. ఇతర ప్రాంతాలవారే ఇక్కడకు వలస వచ్చేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా. భోగాపురం ఎయిర్‌పోర్టు, డేటా సెంటర్లు, ఐటీ కంపెనీల రాకతో ఉత్తరాంధ్ర ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధన.. సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పాలన సాగిస్తాం.

  • రాష్ట్రంలో యువతశాతం తగ్గిపోతోంది. పిల్లలే మన అసలైన సంపద. జనాభా పెరిగితేనే.. భవిష్యత్‌లో అభివృద్ధి సాధ్యమవుతుంది. జనాభా పెంపు ప్రోత్సాహకంలో భాగంగా మూడో బిడ్డ పుట్టిన వెంటనే రూ.30వేలు, నాలుగో బిడ్డ పుడితే రూ.40వేలు చొప్పున అందజేస్తాం. తల్లికి వందనం పథకం కింద సాయాన్ని భవిష్యత్‌లో మరింత పెంచుతాం.

  • - నరసన్నపేటలో ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’ వేదికగా సీఎం చంద్రబాబునాయుడు భరోసా

  • శ్రీకాకుళం, మే 16(ఆంధ్రజ్యోతి): ‘ఉత్తరాంధ్ర అభివృద్ధిపై గతంలో గొడ్డలి పార్టీతో వేటు పడింది. వలసల ప్రాంతంగా కొనసాగుతోంది. ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకే వలసలు వచ్చేలా సంకల్పించాం. పెట్టుబడులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామ’ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శనివారం నరసన్నపేటలోని ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో నిర్వహించిన ప్రజావేదికలో సీఎం మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ప్రకటిస్తూ.. సిక్కోలు ప్రగతికి వరాల జల్లు కురిపించారు. ‘రాష్ట్రంలో ఎక్కువ జాతీయ రహదారి, సముద్ర తీరం, నీరు, తెలివైన ప్రజలు ఉండే జిల్లా శ్రీకాకుళం. కానీ అభివృద్ధిలో వెనుకుంది. ఈ నేపథ్యంలో సిక్కోలు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాం. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం. 23 నెలల్లో రూ. 23లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా రానున్న రోజుల్లో 24 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అఽధికారం అంటే విధ్వంసం కాదు. ప్రజలు జీవితాలు మార్చే అవకాశం అని నమ్ముతున్నా. అధికారం అంటే విశాఖకు గూగుల్‌, అమరావతికి క్వాంటం తేవడం. దేశంలో ఎక్కడికి పోయినా శ్రీకాకుళం కాలనీ ఉంటుంది. పోర్టులు, ఎయిర్‌ పోర్టులు, ఐటీ కంపెనీలు, డాటా సెంటర్లతో ఉత్తరాంధ్ర దశ మారుతుంది. శ్రీకాకుళం జిల్లాకు మరో ఎయిర్‌పోర్టు తీసుకువస్తాం. పలాసలో కొత్త ఎయిర్‌పోర్ట్‌ ను కూడా త్వరలో నిర్మాణం చేపడతాం. మూలపేట పోర్టు ఉత్తరాంధ్రకే అడ్వాంటేజ్‌ అవుతుంది. ఈ ఏడాదిలోనే మూలపేట పోర్టును ప్రారంభిస్తామ’ని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘రోజుకు ఓ డ్రామాతో వచ్చే వారితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మళ్లీ వైకుంఠపాళి వద్దు. వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా ప్రభుత్వ టెర్రరిజం, కబ్జాలు, బెదిరింపులు, కేసులు, అరాచకాలే. అచ్చెన్నాయుడు లాంటి నేతల్ని అక్రమ కేసుల్లో ఇరికించి అప్పట్లో అరెస్ట్‌ చేశారు. ఇప్పుడు గొడ్డలి ప్లస్‌ అంటూ కొత్త నాటకాలతో వస్తారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల’ని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

  • సాగునీటి ప్రాజెక్టులపై..

  • జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై దృష్టిపెట్టాం. మడ్డువలస స్టేజ్‌-2 జనవరి 2027, హిరమండలం ఎత్తిపోతల పథకం ఏప్రిల్‌ 2027, వంశధార ఫేజ్‌-2 స్టేజ్‌-2 (హిరమండలం రిజర్వాయర్‌) జూలై 2027, తోటపల్లి డిస్ట్రిబ్యూటరీస్‌ జూలై 2027, జంఝావతి రిజర్వాయర్‌ ప్రాజెక్ట్‌ డిసెంబర్‌ 2027 నాటి పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు చేస్తున్నాం. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నేరడి బ్యారేజ్‌కు అడ్డంకులు తొలగి కేంద్రం నుంచి అనుమతులు సాధించాం. నవంబరులో శంకుస్థాపన చేసి.. మూడేళ్లలో నేరెడి ప్రాజెక్టు పూర్తి చేస్తాం. నరస్నపేట నియెజకవర్గ పరిధిలో రాజులచెరువు ఆధునీకరణకు నిధులు మంజూరు చేస్తాం. ఎన్‌హెచ్‌ 5 నుంచి నరసన్నపేట పట్టణ పరిధిలో రూ. 15 కోట్లు వ్యయంతో రహదారి నిర్మాణం చేపడతాం. ఎర్రన్నాయుడు చిల్డ్రన్‌పార్క్‌ ఏర్పాటు చేస్తాం. శ్రీముఖలింగం ఉత్సవాలు ఇకపై రాష్ట్ర పండుగగా ప్రకటిస్తామ’ని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

  • సగర్వంగా స్వచ్ఛత వైపు అడుగులు...

  • ‘17 నెలలలుగా స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేస్తున్నాం. సమాజం మారితేనే స్వచ్ఛాంధ్ర సాకారం అవుతుంది. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధన లక్ష్యంతో పనిచేస్తున్నాం. స్వచ్ఛపథం కార్యక్రమంలో భాగంగా గ్రామీణ అర్బన్‌ ప్రాంతాల్లోని రహదారులను శుభ్రపరిచేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. జూన్‌ నాటికి నూరు శాతం చెత్త శుభ్రం చేసేలా చర్యలు చేపడుతున్నాం. ప్రతి రోజు పట్టణాల్లో 7,527 టన్నులు, గ్రామాల్లో 1,430 టన్నుల చెత్తను సేకరిస్తున్నాం. రూ. 1,254 కోట్లతో 6 వేస్ట్‌ టూ ఎనర్జీ ప్రాజెక్టులు 6 సీబీజీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. చెత్త ప్రాసెసింగ్‌ కోసం రూ. 603 కోట్లతో 107 ఇంటిగ్రేటెడ్‌ ప్లాంట్లు సిద్ధం చేస్తున్నాం. ఇవి అక్టోబర్‌ నాటికి అందుబాటులోకి వస్తే డంపింగ్‌ యార్డ్‌ అనేదే ఉండదు. 633 స్వచ్ఛ రథాలతో రోజుకు 125 టన్నుల పొడి చెత్త సేకరిస్తున్నాం. ఇప్పటికి 47లక్షల కేజీల చెత్తను సేకరించి రూ. 8 కోట్ల విలువైన నిత్యావసరాలు ఇచ్చారు. కొత్తగా గ్రీన్‌ షాప్స్‌ ను ప్రారంభించాం. ప్రజలే అక్కడికి వెళ్లి ప్లాస్టిక్‌, ఐరన్‌ వంటి వ్యర్థాలను ఇచ్చి.. వస్తువులు పొందవచ్చు. వావ్‌ పేరుతో పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నెల్లూరు, అనకాపల్లి, చిత్తూరులలో సర్క్యులర్‌ ఎకానమీ పార్కులు నిర్మిస్తున్నాం. నేటి నుంచి 50 ప్లాస్టిక్‌ వ్యర్థ యూనిట్లు వస్తుండగా మరో 210 యూనిట్లు జూన్‌కు అందుబాటులోకి తెస్తామని’’ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

  • కేడర్‌తో సమీక్ష...

  • నరసన్నపేటలోని టీడీపీ శ్రేణులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రజాప్రతినిధుల పనితీరును.. ర్యాంకులను మళ్లీ సీఎం చంద్రబాబు ప్రస్తావించి పలు కీలక సూచనలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. సమీక్ష ముందు.. ఓ ఎమ్మెల్యేని ఉద్దేశించి ‘‘సెట్‌ అయ్యావు.. గోహెడ్‌.. సేవే కాదు.. రాజకీయం కొద్దిగా అలవర్చుకో..’’ అని సీఎం సూచించారు. అలాగే మరో ఎమ్మెల్యేను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ట్యూన్‌ చేసుకో’ అని చెప్పారు. మరో ఎమ్మెల్యే గురించి మాట్లాడుతూ.. ‘పనితీరులో 128వ ర్యాంకు రావడం ఏమిటి..? సోషల్‌ మీడియాలో కూడా వెనుకబడటం... ఇతర కారణాల’పై సీఎం ప్రస్తావించినట్లు సమాచారం. త్వరలో తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అంతకుముందు ప్రజావేదికలో శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగం పెర్ఫార్మెన్స్‌ను.. ర్యాంకులు.. శాతాల వారీగా.. పాజిటివ్‌, నెగిటివ్‌ అంశాలను లేవనెత్తడంతో అధికారులకు చెమట్లు పట్టాయి.

  • ప్రధాని సూచన పాటిస్తూ... నాలుగు కాన్వాయ్‌లతోనే

  • ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఇటీవల దేశ ప్రజలను ఉద్దేశించి కొన్ని సూచనలు చేశారు. ఆ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజావేదికలో ప్రస్తావించారు. పశ్చిమాసియా యుద్ధం వల్ల పరోక్ష ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో ఉందని.. అందరం పొదుపు పాటిద్దామని.. బంగారం కొనుగోలు తగ్గించాలని.. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌లను వాడాలని ప్రజలకు చెప్పారు. తాను కూడా నరసన్నపేట ప్రజావేదిక నుంచి పార్టీ కార్యకర్తల సమావేశానికి వెళ్లేందుకు.. కాన్వాయ్‌లను నాలుగుకే కుదించానని తెలిపారు.

Updated Date - May 17 , 2026 | 12:22 AM