Share News

పాడేరులో వలసకూలీ మృతి

ABN , Publish Date - Apr 11 , 2026 | 12:06 AM

మండల పరిధి కొండపల్లి గ్రామానికి చెందిన వలస కూలీ మడ్డు జగన్నాథం(45) గుండెపోటుకు గురై మృతి చెందాడు.

పాడేరులో వలసకూలీ మృతి

వజ్రపుకొత్తూరు, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): మండల పరిధి కొండపల్లి గ్రామానికి చెందిన వలస కూలీ మడ్డు జగన్నాథం(45) గుండెపోటుకు గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. జగన్నాథం పాడేరు పరిధిలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. గురువారం విధు ల్లో ఉండగా గుండెపోటుతో అస్వస్తతకు గురయ్యాడు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. శుక్రవారం స్వగ్రామం కొండపల్లికి జగన్నాథం మృతదేహాన్ని తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా జగన్నాథంకి భార్య తులసీ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

రణస్థలం, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): కొండములగాం గ్రామానికి చెందిన ఎన్‌. వీరబాబు (39) అనే వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. జేఆర్‌ పురం ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవి తెలిపిన వివరాల మేరకు.. గతకొద్ది రోజులుగా వీరబాబు మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నాడు. గురువారం రాత్రి గడ్డి మందు తాగి ఇంటికి వచ్చిన వీరబాబు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. చికిత్స నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. వీరబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.

సారా తరలిస్తున్న ఇద్దరి అరెస్టు

సోంపేట/కంచిలి, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి 60లీటర్ల సారా తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్టు ఎక్సైజ్‌ సీఐ జీవీ రమణ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. శుక్రవారం ఎక్సైజ్‌ సిబ్బంది దాడులు నిర్వహించగా తెంబగడకి చెందిన భాస్కర్‌ కార్తీ, కృష్ణసబర్‌ సారా తరలిస్తూ పట్టుబడ్డారు. వీరిని అరెస్టు చేసి మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా 14రోజుల రిమాండ్‌ విధించారు. వీరు ఇచ్చిన సమాచారం మేరకు కంచిలి మండలం దొలసాయి గ్రామానికి చెందిన చైతన్య భుయ్యాపై కేసు నమోదు చేసినట్లు సీఐలు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్‌ఐలు సుజాత, జగన్నాథ్‌, సిబ్బంది విజయ్‌, రమణ, మార్కారావు, గాలిబ్‌, వెంకటేష్‌, ఉమాపతి తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 11 , 2026 | 12:06 AM