బంగారంతో వ్యాపారి పరారీ
ABN , Publish Date - Apr 12 , 2026 | 12:22 AM
Jewelry mortgage fraud సంతబొమ్మాళి మండలం బోరుభద్రలో ఘరానా మోసం వెలుగుచూసింది. ప్రజల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని రూ.కోటికిపైగా నగదు, బంగారం ఆభరణాలతో ఓ మందుల దుకాణం వ్యాపారి పరారీ అయ్యాడు.
ఆభరణాలు తనఖా పట్టి అప్పులు
మరోవైపు అధికవడ్డీతో మోసం
రూ.కోటికిపైగా ఉంటుందని అంచనా
లబోదిబోమంటున్న బాధితులు
సంతబొమ్మాళి, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): సంతబొమ్మాళి మండలం బోరుభద్రలో ఘరానా మోసం వెలుగుచూసింది. ప్రజల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని రూ.కోటికిపైగా నగదు, బంగారం ఆభరణాలతో ఓ మందుల దుకాణం వ్యాపారి పరారీ అయ్యాడు. పోలాకి మండలం పిన్నింటిపేటకు చెందిన ఓ వ్యక్తి 30 ఏళ్ల నుంచి బోరుభద్రలో మెడికల్‌షాపు నిర్వహిస్తున్నాడు. మందులు అమ్ముతూ, డబ్బులు అవసరమైన వారికి బంగారం ఆభరణాలు తనఖాగా ఉంచుకుని అప్పులు ఇచ్చేవాడు. కొన్నేళ్ల కిందట ఆ వ్యక్తి నరసన్నపేటకు మకాం మార్చి.. తన మరదలు కుమారుడుకి బోరుభద్రలో మెడికల్‌షాపు వ్యాపారం అప్పగించాడు. వ్యాపారి మరదలు కుమారుడు అదే వ్యాపారాన్ని కొనసాగిస్తూ.. అందరితో నమ్మకంగా మెలిగి బంగారం ఆభరణాల తనఖా పట్టేవాడు. కాగా.. కొద్దిరోజులుగా బంగారం ఆభరణాలు తనఖా పెట్టినవారు డబ్బులు తీసుకువచ్చి.. తమ వస్తువులు ఇవ్వమని అడగ్గా వేరేవారి వద్ద ఉన్నాయని తిప్పుతుండేవాడు. మరికొందరి వద్ద డబ్బులు తీసుకుని నెలలు కావస్తున్నా, తనఖా పెట్టిన బంగారం వస్తువులు తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేసేవాడు. ఇటీవల కొంతమంది బాధితులు ఆయనను గట్టిగా నిలదీశారు. దీంతో మెడికల్ షాప్‌కు తాళాలు వేసి.. గురువారం నుంచి పరారీ అయ్యాడు.
అధిక వడ్డీ ఆశ చూపి..
మెడికల్ షాప్ వ్యాపారి అధిక వడ్డీ ఆశ చూపి.. ఈ ప్రాంతంలో రూ.30లక్షల వరకూ అప్పు చేశాడని తెలుస్తోంది. రూ.వందకు.. రూ.పది చొప్పున వడ్డీ ఇస్తానని నమ్మించాడు. దీంతో చాలామంది డబ్బులు అప్పు ఇచ్చారు. అప్పుచేసిన డబ్బులతోపాటు.. 50తులాల వరకు బంగారు ఆభరణాలతో ఆ వ్యాపారి పరారీ కావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. వీటి విలువ రూ.కోటికిపైగా ఉంటుందని ఆరోపిస్తున్నారు. మోసపోయిన వారిలో బోరుభద్ర, గొదలాంచమలగాం, పాలతలగాం, శిమ్మయ్యపేట, ఉదయపురం, కొల్లిపాడు, గెద్దలపాటు, గొలుగువానిపేట, పిట్టవానిపేట, పాతమేఘవరం గ్రామాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. వీరిలో నిరక్షరాస్యులైన మహిళలు, మత్స్యకారులే అధికంగా ఉన్నారు. కొంతమంది బాధితులు శనివారం మెడికల్‌షాపు వద్దకు చేరుకోగా.. తాళం వేసి ఉంది. ఫోన్ చేసినా ఆ వ్యాపారి స్పందించకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. వ్యాపారి మోసాల విషయమై ఎస్‌ఐ వై.సింహాచలం వద్ద ప్రస్తావించగా.. తమకు రాతపూర్వకంగా ఫిర్యాదు రాలేదన్నారు.
డబ్బులు తీసుకుని బంగారం ఇవ్వలేదు
కొన్నాళ్ల కిందట బోరుభద్రలో మెడికల్‌షాపు వ్యాపారి వద్ద మూడుపావుల బంగారం ఆభరణాలను రూ.20వేలకు తనఖా పెట్టాను. ఇటీవల అసలు, వడ్డీ డబ్బులు కలిపి చెల్లించాను. బంగారం ఇంటికి తెచ్చి ఇస్తానని చెప్పి.. రోజూ తిప్పేవాడు. ఇప్పుడు ఆ వ్యాపారి పరారీ కావడంతో.. నా బంగారం ఆభరనాలు వస్తాయో.. రావోనని ఆందోళనగా ఉంది.
- నల్ల కామమ్మ, కుముందానివానిపేట
ఆరు నెలలుగా తిప్పుతున్నాడు
బోరుభద్ర మెడికల్ షాప్ వద్ద రెండున్నర తులాల బంగారు గొలుసు రూ.యాభై వేలకు తనఖా పెట్టాను. వస్తువు విడిపించడానికి గత ఆరు నెలలు నుంచి డబ్బులు పట్టుకొని తిరుగుతున్నా వస్తువులు ఇవ్వడం లేదు. ఎందుకు తిప్పుతున్నావని ప్రశ్నిస్తే తమపై నమ్మకం లేదా అంటూ ఎదురు ప్రశ్నించేవాడు. తీరా శనివారం మెడకల్‌షాప్‌కు వెళ్లగా పరారయ్యాడని గ్రామస్థులు తెలిపారు. ఏమిచేయాలో తెలియడం లేదు.
- పిట్ట చిన్నమ్మి, పిట్టవానిపేట