24న మెగా పేరెంట్-టీచర్ మీటింగ్
ABN , Publish Date - Jul 18 , 2026 | 12:04 AM
రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈ నెల 24న మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు.
-తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి
- జిల్లాలో యూరియా కొరత లేదు
- కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళంఎడ్యుకేషన్/ కలెక్టరేట్, జూలై 17(ఆంఽధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈ నెల 24న మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో నిర్వహించిన సమావేశంలో తల్లులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. ఈసారి మీటింగ్‌లో తల్లులతో పాటు తండ్రులు కూడా హాజరుకావాలని కోరారు. కనీసం ఒక పూట అయినా సమ యం కేటాయించి, పిల్లల విద్యాప్రగతిపై ఉపాధ్యాయులతో చర్చించాలన్నారు. ‘విద్యార్థుల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు అందజేస్తాం. మధ్యాహ్న భోజన పథకం నాణ్యతను ప్రత్యక్షంగా చూపిస్తాం. విద్యాశాఖ రూపొందించిన లెర్నింగ్ ఎక్సలెన్స్ ఆన్ ఆంధ్రప్రదేశ్ (లీప్) యాప్‌ను విస్తృతంగా వినియోగించుకోవాలి. పలాస మండలం మినహా మిగిలిన ప్రాంతాల్లో యాప్ డౌన్‌లోడ్ శాతం తక్కువగా ఉంది. తల్లిదండ్రులు తప్పనిసరిగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. పాఠశాలల అభివృద్ధికి పూర్వవిద్యార్థులు, దాతలు భాగస్వాములు కావడానికి రూపొందించిన డోనర్ యాప్ కూడా అదే రోజు ప్రారంభిస్తాం. పాఠశాలల్లో కిచెన్లు షెడ్లు, మరుగుదొడ్ల మరమ్మతులు, నీటివసతి వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ యాప్ ఉపయోగపడుతుంది.’అని కలెక్టర్ తెలిపారు.
అవసరం మేరకు యూరియా సరఫరా
జిల్లాలో యూరియా కొరత లేదని, అవసరం మేరకు సరఫరా చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని 535 రైతు సేవా కేంద్రాలకు గాను ఇప్పటికే 400కు పైగా కేంద్రాలకు యూరియా సరఫరా చేసినట్లు చెప్పారు. యాప్‌లో పేర్లు నమోదు కాని కౌలుదారులు సంబంధిత రైతు సేవా కేంద్రానికి వెళ్లి ‘కల్లివేటర్’ ఆప్షన్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. భూ యజమాని ఓటీపీ ధృవీకరణ అనంతరం యూరియా పొందవచ్చన్నారు. 50 సెంట్ల కంటే తక్కువ భూమి కలిగిన రైతులకు అవసరమైన మేర కిలోల లెక్కన యూరియా అందించేందుకు ఆర్‌ఎస్‌కేల్లో తూనిక యంత్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే ఇద్దరు లేదా ముగ్గురు చిన్న రైతులు ఒక గ్రూపుగా ఏర్పడి, యూరియా పొందవచ్చని తెలిపారు. వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాని ఈనాం, దేవదాయ, డి-పట్టా భూములు సాగు చే స్తున్న రైతులు కూడా తహసీల్దార్ ధృవీకరణతో మండల వ్యవసాయాధికారి ద్వారా ఏపీఎంఎస్ యాప్‌లో నమోదు చేసుకుని, ఎరువులు పొందవచ్చని తెలిపారు. ప్రైవేటు వ్యాపారులు అధిక ధరలకు అమ్మకాలు సాగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఈవో ఏ.రవిబాబు, జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ పాల్గొన్నారు.