Share News

మెడికల్‌ షాపుల బంద్‌ విజయవంతం

ABN , Publish Date - May 21 , 2026 | 12:17 AM

Medical shop strike అక్రమ, నియంత్రణ లేని ఆన్‌లైన్‌ మందుల విక్రయాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కెమిస్టులు, డ్రగ్గిస్టులు చేపట్టిన ఒకరోజు టోకెన్‌ బంద్‌ విజయవంతమైంది. ఏఐఓసీడీ పిలుపు మేరకు బుధవారం జిల్లావ్యాప్తంగా మెడికల్‌ షాపులను స్వచ్ఛందంగా మూసివేశారు.

మెడికల్‌ షాపుల బంద్‌ విజయవంతం
శ్రీకాకుళంలో ఆందోళన చేస్తున్న కెమిస్టులు

అరసవల్లి, మే 20(ఆంధ్రజ్యోతి): అక్రమ, నియంత్రణ లేని ఆన్‌లైన్‌ మందుల విక్రయాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కెమిస్టులు, డ్రగ్గిస్టులు చేపట్టిన ఒకరోజు టోకెన్‌ బంద్‌ విజయవంతమైంది. ఏఐఓసీడీ పిలుపు మేరకు బుధవారం జిల్లావ్యాప్తంగా మెడికల్‌ షాపులను స్వచ్ఛందంగా మూసివేశారు. జిల్లా డ్రగ్‌ ట్రేడ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని డే్క్షనైట్‌ జంక్షన్‌ వద్ద నిరసన చేపట్టారు. అసోసియేషన్‌ నాయకులు మాట్లాడుతూ ‘కెమిస్టులు నిరంతరాయంగా మందుల సరఫరా చేసి, ప్రజల ఆరోగ్య సేవల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. కొవిడ్‌ సమయంలో కెమిస్టులు అందించిన సేవలు వెలకట్టలేనివన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా భారీ డిస్కౌంట్లతో మందులు విక్రయించడం వలన నియంత్రణ లేని విధంగా మందుల అమ్మకాలు సాగుతున్నాయి. ఈ-ఫార్మశీల ద్వారా మందుల విక్రయం విధానాన్ని రద్దు చేయాలి. జీఎస్‌ఆర్‌ 817(ఈ), జిఎస్‌ఆర్‌ 220(ఈ) నోటిఫికేషన్లను తక్షణమే ఉపసంహరించుకోవాల’ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వీటి వలన చిరు వ్యాపారులు, సిబ్బంది జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోగుల భద్రత, ప్రజారోగ్యం, లైసెన్సు కలిగిన కెమిస్టుల రక్షణ కోసం కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, బంద్‌ చేసినా.. రోగుల కోసం కొన్ని మెడికల్‌షాపులు తెరిచి.. అత్యవసర మందులను విక్రయించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు కె.కరుణకుమార్‌ గుప్తా, కార్యదర్శి వి.మణిరాజు పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2026 | 12:17 AM