Share News

పలాస అభివృద్ధికి అద్భుత వరం మయూరవనం

ABN , Publish Date - Jul 02 , 2026 | 12:32 AM

పలాస అభివృద్ధికి అద్భుత వరం మయూర వనమని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.

పలాస అభివృద్ధికి అద్భుత వరం మయూరవనం
మయూర వనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌

- ఎమ్మెల్యే గౌతు శిరీష

- వర్చువల్‌గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌

పలాస, జూలై 1(ఆంధ్రజ్యోతి): పలాస అభివృద్ధికి అద్భుత వరం మయూర వనమని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి చేసిన 17 మయూర వనాలను బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర అటవీశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. పలాసలోని మయూర వనాన్ని కలెక్టర్‌ స్వప్నిల్‌దినకర్‌పుండ్కర్‌తో కలసి ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. పలాసలో రూ.1.60 కోట్ల వ్యయంతో మయూర వనాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రజలు దీన్ని ఇప్పటి నుంచే వినియోగించుకోవచ్చన్నారు. ఇందులో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సి ఉందని, ప్రజలకు వణ్యప్రాణులను ప్రత్యక్షంగా చూసే భాగ్యం మయూరవనాల ద్వారా కలుగుతుందన్నారు. దీంతో పాటుగా అందమైన తోటలు, ప్రకృతి సోయగాలు ఇక్కడ నుంచే తిలకించి ఆనందం పొందడానికి అవకాశం ఉందన్నారు. భవిష్యత్తు తరాల వారికి మయూర వనాలు ఈ విధంగా ఉంటాయని చెప్పడానికి ముందుగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఆలోచన మేరకు ఇవి రూపుదిద్దుకోవడం, అందులో పలాసకు చోటు కల్పించడంపై ఆమె పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖపట్నం నుంచి ఒడిశాలోని భువనేశ్వర్‌ వరకూ ఎక్కడా ఇటువంటి వనాలు లేవని అన్నారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు సహకారంతో జంతు ప్రదర్శనశాల ఏర్పాటుకు కూడా చురుకుగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

టూరిజం సర్కిల్‌గా అభివృద్ధి: కలెక్టర్‌

పలాస, టెక్కలి, పాతపట్నం, బారువ ప్రాంతాలను కలుపుకొని జిల్లాను టూరిజం సర్కిల్‌గా అభివృద్ధి చేస్తామని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. పలాసలో ప్రారంభమైన మయూర వనాన్ని ఏకోటూరిజం పాలసీ కింద అభివృద్ధి చేస్తామన్నారు. బారువ బీచ్‌, టెక్కలి వద్ద తేలినీలాపురం పక్షుల విడిది కేంద్రం, పాతపట్నం ప్రాంతంలో అందమైన కొండలు చెంతనే ఉండడంతో మొత్తం అన్నీ కలుపుతూ టూరిజం సర్కిల్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. పలాసలో ఉన్న వయూరవనంలో ఉన్న 650 ఎకరాల్లో కేవలం 150 ఎకాలు మాత్రమే అభివృద్ధి చేశామని, రానున్న రోజుల్లో మొత్తం అడవంతా అభివృద్ధిలోకి తీసుకువచ్చి టూరిజం స్పాట్‌గా చేయాలన్న ఆలోచనలో ఉన్నామన్నారు. పార్కులో అదనంగా ఈకో టూరిజం పరంగా సైకిలింగ్‌ పెడుతున్నామన్నారు. ఉదయం 6 నుంచి రాత్రి 6 గంటల వరకూ ఇందులో ప్రవేశాలకు అనుమతులు ఇస్తారన్నారు. గైడ్‌ను పెట్టమని డీఎఫ్‌ఓకు సూచించామని, ఈ ప్రాంత గిరిజనులకు ఉపాధి కల్పించే విధంగా షాపులు కూడా పెట్టాల్సి ఉందని అన్నారు.

- మయూర వనంలో జీడి ప్రాసెసింగ్‌ పైలాన్‌ పెట్టాలని కలెక్టర్‌.. డీఎఫ్‌వో ఎస్‌.వెంకటేష్‌కు ఆదేశించారు. జీడి నిర్వహణ ఏ విధంగా జరుగుతుందో అవుట్‌లెట్‌ పెట్టాలని, తగిన స్థలాన్ని ఎంపిక చేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. మయూరవనాన్ని దర్శించే పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.10 టిక్కెట్‌ పెట్టినట్లు కలెక్టర్‌ ప్రకటించారు. కార్యక్రమంలో ఆర్డీవో అప్పలరాజు, సబ్‌డీఎఫ్‌వో నాగేంద్రప్రసాద్‌, ఇన్‌చార్జి రేంజర్‌ అమ్మనాయుడు, టీడీపీ నాయకులు వజ్జ బాబూరావు, పీరుకట్ల విఠల్‌రావు, లొడగల కామేశ్వరరావుయాదవ్‌, మల్లా శ్రీనివాస్‌, గాలి కృష్ణారావు, బడ్డ నాగరాజు, సప్ప నవీన్‌, దువ్వాడ శ్రీకాంత్‌, మల్లా రామేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Jul 02 , 2026 | 12:32 AM