Share News

సాంకేతికతపై పట్టు సాధించండి: ఐజీ

ABN , Publish Date - Feb 14 , 2026 | 12:09 AM

సమాజంలో పెరిగిపోతున్న సాంకేతిక ఆధారిత నేరాలను (సైబర్‌ క్రైమ్స్‌) సమర్ధంగా ఎదుర్కొనేందుకు ట్రైనీ కానిస్టేబుళ్లు సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని విశాఖపట్నం రేంజ్‌ ఐజీ గోపీనాథ్‌ జట్టి పిలుపునిచ్చారు.

   సాంకేతికతపై పట్టు సాధించండి: ఐజీ
శిక్షణ పొందిన అభ్యర్థులతో మాట్లాడుతున్న ఐజీ

శ్రీకాకుళం, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): సమాజంలో పెరిగిపోతున్న సాంకేతిక ఆధారిత నేరాలను (సైబర్‌ క్రైమ్స్‌) సమర్ధంగా ఎదుర్కొనేందుకు ట్రైనీ కానిస్టేబుళ్లు సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని విశాఖపట్నం రేంజ్‌ ఐజీ గోపీనాథ్‌ జట్టి పిలుపునిచ్చారు. జిల్లాలోని తండేంవలస పోలీసు శిక్షణ కేంద్రం (పీటీసీ)లో గురువారం జరిగిన జిల్లా స్పోర్ట్స్‌ మీట్‌ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం అక్కడ శిక్షణ పొందుతున్న స్టైపెండరీ క్యాడెట్‌ ట్రైనీ పోలీస్‌ కానిస్టేబుళ్లతో ప్రత్యేకంగా సమావేశమై దిశానిర్దేశం చేశారు.

అవకాశాన్ని వినియోగించుకోవాలి..

ఐజీ మాట్లాడుతూ 9 నెలల పాటు జరిగే ప్రాథమిక శిక్షణ ఎంతో కీలకమైందన్నారు. ఈ సమయాన్ని ప్రతి అభ్యర్థి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆధునిక దర్యాప్తు పద్ధతులు, డిజిటల్‌ సాక్ష్యాధారాల సేకరణలో మెలకువలు నేర్చు కోవాలన్నారు. విధి నిర్వహణలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం, క్రమశిక్షణ, నిబద్ధతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. శిక్షణ కాలంలో సమస్యలు ఉంటే నిర్భయంగా ఉన్నతా ధికారుల దృష్టికి తీసుకురావాలని సూచిం చారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి, ప్రజలకు ఉత్తమ సేవలందించే బాధ్యతా యుతమైన పోలీసులుగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం ఐజీ గోపీనాథ్‌ జట్టి, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి కలసి శిక్షణ కేంద్రంలోని వసతులను పరిశీలించారు. కంప్యూటర్‌ ల్యాబ్‌, తరగతి గదులు, బ్యారెక్స్‌, మెస్‌, వంటగదిని తనిఖీ చేసి, ట్రైనీలకు అందుతున్న భోజన సదుపాయాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కేవీ రమణ, డీఎస్పీ గోవిందరావు, శిక్షణ కేంద్రం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2026 | 12:09 AM