Share News

17 రోజుల్లో పెళ్లి.. అంతలోనే ఆత్మహత్య

ABN , Publish Date - Mar 04 , 2026 | 11:47 PM

మరో 17 రోజుల్లో పెళ్లి పీటలపై కూర్చోవలసిన యువతి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన నందిగాం పంచాయతీ వేణుగోపాలపురం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

  17 రోజుల్లో పెళ్లి.. అంతలోనే ఆత్మహత్య
ప్రవల్లిక (ఫైల్‌)

- రైలు కిందపడి ఇంజనీరింగ్‌ విద్యార్థిని బలవన్మరణం

టెక్కలిరూరల్‌/నందిగాం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): మరో 17 రోజుల్లో పెళ్లి పీటలపై కూర్చోవలసిన యువతి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన నందిగాం పంచాయతీ వేణుగోపాలపురం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. రైల్వే ఎస్‌ఐ కోటేశ్వరావు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. వేణుగోపాలపురం గ్రామానికి చెందిన కింతలి గోపాలరావు, శిరీష దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ప్రవల్లిక (20) టెక్కలి సమీపంలోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఐటీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈమెకు ఈ నెల 21న పెళ్లి నిశ్చయమైంది. ఈ మేరకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటిలాగే ప్రవల్లిక బుధవారం ఉదయం తన కళాశాల బస్సులో కాలేజీకి వెళ్లింది. అక్కడ నుంచి తలగాం వెళ్లి రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తుండడాన్ని స్థానికులు గుర్తించారు. ఆ సమయంలో గుణుపూర్‌ నుంచి నౌపడ వైపు వస్తున్న రైలును చూసి స్థానికులు కేకలు వేసినా ప్రవల్లిక వినిపించుకోకుండా పట్టాలపై నిలబడింది. దీంతో రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె దగ్గర లభ్యమైన కళాళాల గుర్తింపు కార్డులోని వివరాల ఆధారంగా స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రవల్లిక తండ్రి గోపాలరావు తాపీమేస్త్రిగా పని చేస్తున్నాడు. తల్లి శిరీష కూలి పనులకు వెళ్తుంటుంది. వారి కష్టంతో తన ఇద్దరు పిల్లలను చదివిస్తున్నారు. మంచి ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషిస్తుందనుకున్నామని, పెళ్లి కూడా నిశ్చయమైందని, ఇంతలోనే ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీనిపై పలాస రైల్వే పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలనుంది. పోస్టుమార్టం కోసం మృతదేహన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Updated Date - Mar 04 , 2026 | 11:47 PM