వృద్ధురాలి అదృశ్యంపై అనుమానాలెన్నో..
ABN , Publish Date - Aug 21 , 2026 | 11:57 PM
What happened to the gold jewelry? జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన చింతు చిన్నమ్మడు(70) అనే వృద్ధురాలు అదృశ్యంపై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి.
బంగారు ఆభరణాలు ఏమయ్యాయి?
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ముమ్మరంగా పోలీసుల దర్యాప్తు
రంగంలోకి డాగ్‌స్క్వాడ్.. డ్రోన్ కెమెరాలతో పరిశీలన
నరసన్నపేట, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన చింతు చిన్నమ్మడు(70) అనే వృద్ధురాలు అదృశ్యంపై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. స్వగ్రామంలో భూ వివాదం చక్కపెట్టేందుకు నరసన్నపేటలో ఫ్యామిలీ మెంబర్ ధ్రువీకరణ పత్రం నోటరీ కోసం ఈ నెల 17న ఆమె నరసన్నపేట వచ్చారు. మళ్లీ ఇంటికి చేరుకోకపోవడంతో ఆమె మరిది చింతు సత్యనారాయణ ఈ నెల 19న జలుమూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. ఆమె 15 నుంచి 20 తులాల వరకు బంగారు ఆభరణాలు ధరించగా.. అదృశ్యం కావడం చర్చనీయాంశమవుతోంది. బంగారు ఆభరణాల కోసం ఆశ పడి ఎవరైనా ప్రణాళికతో ఆమెను.. ఏమైనా చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దీనిపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. డాగ్‌స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. మరోవైపు డ్రోన్ కెమెరాలతో నిశితంగా పరిశీలిస్తున్నారు. నరసన్నపేటలోని పలు ప్రాంతాల్లో సీసీ పుటేజీలను పరిశీలించారు. 17న చిన్నమ్మడు విలేకర్ కాలనీ వరకు వచ్చిన ఆనవాళ్లు మాత్రమే సీసీ కెమెరాల్లో కనిపించాయి. శుక్రవారం డాగ్‌స్క్వాడ్ పరిశీలించగా.. ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డు మార్గంలో ఒక ఇంటి వరకు వెళ్లి డాగ్ అక్కడ ఆగింది. అలాగే డ్రోన్ కెమెరా ద్వారా గాలింపు చేపట్టినా.. చిన్నమ్మడు ఆనవాళ్లు కనిపించలేదు. ఆమె ఫోన్ నెంబరును ట్రాక్ చేయగా.. గొట్టిపల్లి తదితర ప్రాంతాల్లో ఉన్నట్లు సిగ్నల్ చూపిస్తోంది. ఐదు రోజులైనా ఆచూకీ లేకపోవడంతో చిన్నమ్మడు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బంగారం ఆభరణాల కోసం ఆమెను ఎవరైనా మాయం చేశారేమోనని అనుమానిస్తున్నారు. పోలీసులు కూడా ఈ దిశగా అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. నోటరీ వ్యవహారంతోపాటు.. భూ వివాదంలో సంబంధం ఉన్న వ్యక్తుల వద్ద వివరాలు సేకరిస్తున్నారు. దీనిపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ గణేష్ తెలిపారు.