రైలు ఎక్కుతూ జారిపడిన వ్యక్తికి గాయాలు
ABN , Publish Date - Apr 28 , 2026 | 12:38 AM
సోంపేట రైల్వే స్టేషన్‌లో సోమవారం మధ్యాహ్నం భువనేశ్వర్ నుంచి సికింద్రాబాదు వెళుతున్న విశాఖ ఎక్స్‌ప్రెస్ ఎక్కే క్రమంలో కాలుజారిపడిపోవడంతో అంపురం గ్రామానికి చెందిన మద్ది రాఘవులు గాయపడ్డాడు.
కంచిలి, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): సోంపేట రైల్వే స్టేషన్‌లో సోమవారం మధ్యాహ్నం భువనేశ్వర్ నుంచి సికింద్రాబాదు వెళుతున్న విశాఖ ఎక్స్‌ప్రెస్ ఎక్కే క్రమంలో కాలుజారిపడిపోవడంతో అంపురం గ్రామానికి చెందిన మద్ది రాఘవులు గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. రాఘవులు తన సోదరులు తేజేశ్వరరావు, దుదిష్టిలతో కలిసి వీసా పనిమీద విశాఖ వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. విశాఖ ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు వెళుతున్న సమయంలో కాలు జారి, ట్రైన్‌కి, ప్లాట్‌ఫాంకి మధ్యలో ఇరుక్కు పోయాడు. వెంటనే తోటి ప్రయాణికులు, స్టేషన్ సిబ్బంది శ్రమించి అతడిని బయటకు తీశారు. గాయపడిన రాఘవులను శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
లారీని ఢీకొన్న కంటైనర్
నందిగాం, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): సుభద్రాపురం సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం ముందు వెళ్తున్న ఓ లారీని వెనుక నుంచి కంటైనర్ ఢీకొంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. టెక్కలి నుంచి పలాస వైపు వెళ్తున్న లారీని సుభద్రాపురం వద్ద తప్పించబోయి వెనుక నుంచి వస్తున్న కంటైనర్ అదుపుతప్పి పొలాల్లోకి దూసుకుపోయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కంటైనర్ డ్రైవర్‌కు గాయాలు కావడంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.