Share News

మూడో అంతస్తు నుంచి జారిపడి వ్యక్తి మృతి

ABN , Publish Date - Mar 22 , 2026 | 12:07 AM

స్థానిక మొగిలి పాడు గ్రామంలో భవన నిర్మాణ పనులు చేస్తుండగా ఓ వ్యక్తి మూడో అంతస్తు నుంచి జారిపడి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది.

మూడో అంతస్తు నుంచి జారిపడి వ్యక్తి మృతి

పలాస, మార్చి 21(ఆంధ్రజ్యోతి): స్థానిక మొగిలి పాడు గ్రామంలో భవన నిర్మాణ పనులు చేస్తుండగా ఓ వ్యక్తి మూడో అంతస్తు నుంచి జారిపడి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసు లు తెలిపిన వివరాల మేరకు.. పెద్ద ఉదయపురం కాలనీకి చెందిన సత్యం కృష్ణారావు(45) వెల్డింగ్‌ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇంటి నిర్మాణంలో భాగంగా మొగిలి పాడులో ఓ ఇంటికి రేకులు బిగించేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో రేకులు సరిచేస్తుండగా జారి కిందపడి పోయాడు. కృష్ణారావు తలకి బలమైన గాయాల య్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం స్థానిక ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కృష్ణారావుకి భార్య గీత, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు సీఐ వై.రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

డిమిరియా వాగులో మృతదేహం గుర్తింపు

హరిపురం, మార్చి 21(ఆంధ్రజ్యోతి): మందస మండలం జిల్లుండ పంచా యతీ డిమిరియా గ్రామ సమీపంలోని వాగులో గుర్తుతెలియని వ్యక్తి మృత దేహం శనివారం గుర్తించినట్టు ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఆ ప్రాంత రైతులు వాగు వద్దకు వెళ్లగా నీటిలో తేలి ఉన్న మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్‌ఐ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని తీసి పోస్టు మార్టం నిమిత్తం హరిపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా గత నెల 13న మందస మండలం అంబుగాం గ్రామానికి చెందిన గుడియా జగన్నా థం(47) అనే వ్యక్తి మతిస్తిమితం లేక కనిపించడంలేదని కుమార్తె భవానీ ఫిర్యాదు చేసింది. దీంతో భవానిని రప్పించి మృతదేహాన్ని పరిశీలించగా.. ఇది తన తండ్రిదేనని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదక వచ్చాక పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు.

Updated Date - Mar 22 , 2026 | 12:07 AM