Share News

‘సర్‌’ను సద్వినియోగం చేసుకోండి

ABN , Publish Date - Jun 28 , 2026 | 12:00 AM

Special Voter List Revision ప్రత్యేక ఓటరు సవరణ జాబితా(సర్‌) కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పిలుపునిచ్చారు. శనివారం సింగుపురంలో ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు.

‘సర్‌’ను సద్వినియోగం చేసుకోండి
‘సర్‌’ ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక ఓటరు సవరణ జాబితా(సర్‌) కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పిలుపునిచ్చారు. శనివారం సింగుపురంలో ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ‘జిల్లాలోని ప్రత్యేక ఓటరు సవరణ జాబితా కార్యక్రమంలో 2,358 మంది బీఎల్‌వోలు విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీల బీఎల్‌ఏలు కూడా బీఎల్‌వోలతో సమన్వయంగా భాగస్వాములవుతున్నారు. ఓటరు వివరాలను కుటుంబ వివరాలతో అనుసంధానం (మ్యాపింగ్‌) ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే 88 శాతం మ్యాపింగ్‌ ప్రక్రియతో జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. జూలై 14 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ప్రతీ కుటుంబాన్ని సందర్శించి, వివరాలను ధ్రువీకరిస్తున్నాం. 90శాతం కంటే ఎక్కువగా ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ జరిగింది. నిరక్షరాస్యులు, వృద్ధులు, సమయం లేని ఓటర్లకు సహాయంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు, ఇతర శాఖల సిబ్బంది సహాయంతో ఫారాలు పూర్తి చేస్తున్నాం. ఈ ప్రక్రియలో ఎన్నికల సంఘం సూచించిన పాస్‌పోర్టు, జనన, కుల ధ్రువీకరణ పత్రాలు, ప్రభుత్వ గుర్తింపు కార్డు.. తదితర 12 రకాల పత్రాల్లో ఏ ఒక్కటి సమర్పించినా సరిపోతుంది. సందేహాలుంటే సంబంధిత ఎన్నికల అధికారి లేదా మునిసిపల్‌ కమిషనర్‌ కార్యాలయాన్ని సంప్రదించాలి. సీఈఓ ఆంధ్రప్రదేశ్‌ వెబ్‌సైట్‌లో ‘‘బుక్‌ ఏ కాల్‌ విత్‌ బీఎల్‌వో’’ సదుపాయాన్ని ప్రజలు వినియోగించుకోవాల’ని కోరారు.

Updated Date - Jun 28 , 2026 | 12:00 AM