మహేంద్రతనయలో.. ఒడిశా కాలుష్యం
ABN , Publish Date - Feb 10 , 2026 | 11:37 PM
Waste in river waters ఒడిశా రాష్ట్ర వ్యర్థాలతో మహేంద్రతనయ నదీ జలాలు మరింత కలుషితం కానున్నాయి. పాతపట్నానికి కూతవేటు దూరంలో ఉండే ఒడిశాకు చెందిన గజపతి జిల్లా పర్లాకిమిడి నుంచి మురుగునీటితో పాటు వ్యర్థాలు అధికశాతం మహేంద్రతనయ నదిలో కలిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
నదీ జలాల్లో కలుస్తున్న ఆ రాష్ట్రం వ్యర్థాలు
పాతపట్నంలో ప్రమాదపుటంచున పలు గ్రామాలు
ఇప్పటికే 80 ఎకరాల సాగుభూమి నిరుపయోగం
కె.గోపాలపురం, హెచ్.గోపాలపురంలో తాగునీరు కలుషితం
పాతపట్నం, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): ఒడిశా రాష్ట్ర వ్యర్థాలతో మహేంద్రతనయ నదీ జలాలు మరింత కలుషితం కానున్నాయి. పాతపట్నానికి కూతవేటు దూరంలో ఉండే ఒడిశాకు చెందిన గజపతి జిల్లా పర్లాకిమిడి నుంచి మురుగునీటితో పాటు వ్యర్థాలు అధికశాతం మహేంద్రతనయ నదిలో కలిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పర్లాకిమిడిలో జిల్లాకేంద్రాసుపత్రి పక్క నుంచి కొత్తగా మురుగు కాలువలు ఒడిశా భూభాగంలోనే మహేంద్రతనయ నదిని కలుపుతూ నిర్మాణాలు చేస్తున్నారు. దీంతో నదిలో నీరు మరింత కలుషితమయ్యే ప్రమాదం ఉందని పాతపట్నం పరిసర ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. గతంలో అక్కడ మురుగునీటిని కాలువలు, పొలాల మధ్యగుండా పట్టణ శివారులోని గుమ్మగెడ్డచానల్‌కు కలిపేవారు. ఆ నమూనాలో మార్పు చేసి నేరుగా మహేంద్రతనయ నదిలో కలపడంతో తమకు తాగు, సాగునీటి జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని ఈ ప్రాంతవాసులు వాపోతున్నారు.
ఆ రెండు గ్రామాల్లో..
దశాబ్దాలుగా పర్లాకిమిడి నుంచి మురుగునీరు, ప్లాస్టిక్‌తోపాటు పలు వ్యర్థాలు పాతపట్నం పంచాయతీ పరిధిలోని కె.గోపాలపురం, హెచ్.గోపాలపురం గ్రామాల మీదుగా పాతపట్నంలో మహేంద్రతనయ నదీ జలాల్లో కలుస్తున్నాయి. వాస్తవానికి పర్లాకిమిడి నుంచి వచ్చే మురుగునీరు హెచ్.గోపాలపురం ముందు ఒడిశా భూభాగంలోనే మలుపు తిప్పుతూ పొలాల గుండా వెళ్లి దూరంగా ఉన్న గుమ్మగెడ్డలో కలిసేలా నమూనా ఉండేది. కాలక్రమంలో పర్లాకిమిడి జిల్లా కేంద్రంగా రూపుదాల్చుకొని అభివృద్ధి చెందింది. మురుగునీరు, ప్లాస్టిక్‌లతోపాటు హాస్పిటల్స్ తదితర ప్రాంతాల నుంచి వ్యర్థాలు గణనీయంగా పెరిగిపోయాయి. ఈ వ్యర్థాలు నదిలో కలవడంతో.. చెంతనే ఉన్న పాతపట్నంలోని కె.గోపాలపురం, హెచ్.గోపాలపురం గ్రామాల్లో సాగునీరు సైతం కలుషితమైంది. మురుగునీటితో నిండిన పొలాల్లో సాగు చేయలేక రైతులు భూములు విడిచిపెట్టేశారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో సుమారు 80 ఎకరాలపైగా సాగుభూమి కొన్ని దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉండిపోయింది. దీర్ఘకాలంగా ఈ భూభాగంలో మురుగునీరు నిల్వ ఉండిపోతుండడంతో భూగర్భ జలాలుసైతం కలుషితమై.. ఆ గ్రామాల్లో బోరు తవ్వినా కలుషితనీరే వస్తోంది. దీంతో ఆయా గ్రామవాసులు తాగునీటికి సైతం పాతపట్నం రక్షిత నీటి పథకంపైనే ఆధారపడుతున్నారు. అలాగే ఒడిశా కలుషిత వ్యర్థాల కారణంగా.. పాతపట్నంతోపాటు మండలంలో బూరగాం, కాగువాడ, కొరసవాడ, సీది , తామర, తీమర, పాసిగంగుపేట పంచాయతీల్లో కూడా తాగునీటిపై ప్రభావం చూపే పరిస్థితి నెలకొంది.
సాగునీటిపై తీవ్రప్రభావం
మహేంద్రతనయ నదీజలాలపైనే ఆధారపడి పాతపట్నంలోని శ్రీనీలకంఠేశ్వరుని ఆలయం వద్ద ఎత్తిపోతల పథకం ఉంది. దీని ద్వారా పాతపట్నం పరిధిలోని వందలాది ఎకరాల ఆయకట్టు భూమి సాగవుతోంది. కొరసవాడవద్ద ఎత్తిపోతల పథకంపై ఆధారపడి సుమారు 500 ఎకరాల వరకూ వ్యవసాయ భూమి సాగు అవుతోంది. నదీజలాలు కాలుష్యం ప్రారంభమైతే ముందుగా తాగునీరు, క్రమక్రమంగా సాగునీరు కరువై తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ ప్రాంతవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు, అధికారులు స్పందించి నదీ జలాలు కాలుష్యం కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.