Share News

మహేంద్రతనయ ఆక్రమణ

ABN , Publish Date - May 19 , 2026 | 12:04 AM

Occupied on both sides of the riverbank ఉద్దానం ప్రాంతంలో అధికశాతం సాగు, తాగునీరు అందిస్తున్న మహేంద్రతనయ నది ఆక్రమణల చెరలో చిక్కి శల్యమవుతోంది. కొంతమంది నాయకులు, బడా రైతులు నదీ తీరప్రాంతాన్ని ఆక్రమిస్తున్నారు.

మహేంద్రతనయ ఆక్రమణ
భోగాపురం వద్ద మహేంద్రతనయ నదీ ప్రాంతాన్ని ఆక్రమించి.. సాగు

  • - నదీ తీరం ఇరువైపులా కబ్జా

  • - మారుతున్న ప్రవాహ దిశ

  • - కోతకు గురవుతున్న భూములు

  • - ఆందోళనలో అన్నదాతలు

  • హరిపురం, మే 18(ఆంధ్రజ్యోతి): ఉద్దానం ప్రాంతంలో అధికశాతం సాగు, తాగునీరు అందిస్తున్న మహేంద్రతనయ నది ఆక్రమణల చెరలో చిక్కి శల్యమవుతోంది. కొంతమంది నాయకులు, బడా రైతులు నదీ తీరప్రాంతాన్ని ఆక్రమిస్తున్నారు. మరోవైపు అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో నది రూపురేఖలు మారిపోయి.. భూములు కోతకు గురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • మందస, సోంపేట మండలాల పరిధిలో ప్రధాన సాగునీటి వనరు మహేంద్రతనయ. ఈ నది ద్వారా సుమారు 38 వేల ఎకరాల పంట పొలాలకు సాగునీరు, 5.5 లక్షల మందికి తాగునీరు లభిస్తోంది. ఒడిశాలోని తూర్పుకనుముల నుంచి ఈ రెండు మండలాల మీదుగా ప్రవహిస్తున్న మహేంద్రతనయ నది.. బారువ వద్ద సముద్రంలో కలుస్తోంది. సుమారు 24 కిలోమీటర్లు పొడవున ఉన్న నదీ తీరం అడుగడుగునా ఆక్రమణకు గురైంది. కొన్నిచోట్ల నదిలో ఓ పక్క ఆక్రమించి.. జీడి, నేరడి, టేకు తోటలు పెంచుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో పంట పొలాలుగా, కూరగాయల సాగు భూములుగా కూడా మారుస్తున్నారు. ఇంకొందరు తీరంలో అక్రమ బోర్లు వేస్తున్నారు. ఇలా నదిలో అధిక ప్రాంతం కబ్జాకు గురవడంతో చాలాప్రాంతాల్లో చిన్న పిల్ల కాలువలా తయారైంది. పొత్తంగి, సిరిపురం, చిన్నకోష్ఠ, పెద్దకోష్ట, చీపి, టీ-శాసనం, పొత్రకొండ, గోపాలపురం, అనంతపురం, మూలిపాడు తదితర గ్రామాల వద్ద ఆక్రమణలు అధికంగా ఉన్నాయి. దీంతోపాటు ఇసుక అక్రమ రవాణాతో భూగర్భజలాలకు ముప్పు ఏర్పడింది. నదీ పరివాహక ప్రాంత గ్రామాల్లో తాగునీటి బోర్లుకు నీరందని దుస్థితి నెలకొంది.

  • పొంచి ఉన్న ప్రమాదం

  • నదీ తీరం ఆక్రమణలకు గురవతుండటంతో వర్షాలు, తుఫాన్‌ల సమయంలో వరద తీవ్రత అధికమై ప్రవాహ దిశ మారి పొలాలు, తోటలు కోతకు గురవుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే మందస మండలంలో గౌడుగురండి, కొత్తపల్లి, శాసనాం, మూలిపాడు, శ్రీనివాసపురం తదితర సుమారు పది గ్రామాలు వర్షాకాలంలో ముంపు బారిన పడుతున్నాయి. పొత్తంగి గ్రోయిన్‌, గౌడుగురండి గ్రామాల్లో పదికిపైగా ఇళ్లు కోతకు గురై నది ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఆ గ్రామ ప్రజలు వర్షం పడితే చాలు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. అధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించకపోతే తాగునీటి పథకాల నిర్మాణాలతో పాటు పలు గ్రామాల పరిస్థితి ఆందోళనకరంగా మారనుందని స్థానికులు వాపోతున్నారు.

  • పరిశీలించి చర్యలు చేపడతాం

  • మహేంద్రతనయ నదిలో ఆక్రమణలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం. తహసీల్దార్‌, రెవెన్యూ అధికారులతో నివేదికలు తెప్పించి.. ఉన్నతాధికారులకు అందిస్తాం. వారి ఆదేశాల మేరకు నదీ తీరాన్ని సర్వే చేయించి ఆక్రమణలు తొలగిస్తాం. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం.

    - అప్పలరాజు, ఆర్డీవో, పలాస

Updated Date - May 19 , 2026 | 12:04 AM