ఎయిర్‌పోర్టుతో మహర్దశ
ABN , Publish Date - May 11 , 2026 | 12:28 AM
Airport to be built in 'Palaasa' సిక్కోలు ప్రజల చిరకాల స్వప్నం నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి. పలాస నియోజకవర్గంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు (విమానాశ్రయం) నిర్మాణంతో జిల్లాకు మహర్దశ పట్టనుంది. ఎయిర్‌పోర్టు నిర్మాణానికిగానూ డ్రాఫ్ట్‌మాస్టర్ లేఅవుట్ ప్లాన్, ట్రాఫిక్ అంచనాలతోపాటు వ్యయానికి సంబంధించిన టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీ(టీఈఎఫ్‌ఎస్) నివేదిక ప్రకారం ఇదొక బృహత్తర ప్రాజెక్టు అని స్పష్టమవుతోంది.
‘పలాస’లో 1185.56 ఎకరాల్లో నిర్మాణానికి చర్యలు
వాణిజ్య సముదాయాలకు మరో 337.8 ఎకరాలు
మూడు దశల్లో అభివృద్ధి పనులు
మత్స్య, జీడి రైతులకు ఉపయోగపడేలా కార్గో సేవలు
యువతకు వేలాది కొలువులు
డ్రాఫ్ట్ ప్లాన్, ట్రాఫిక్ అంచనాల సమగ్ర నివేదిక వెల్లడి
శ్రీకాకుళం, మే 10(ఆంధ్రజ్యోతి):
సిక్కోలు ప్రజల చిరకాల స్వప్నం నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి. పలాస నియోజకవర్గంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు (విమానాశ్రయం) నిర్మాణంతో జిల్లాకు మహర్దశ పట్టనుంది. ఎయిర్‌పోర్టు నిర్మాణానికిగానూ డ్రాఫ్ట్‌మాస్టర్ లేఅవుట్ ప్లాన్, ట్రాఫిక్ అంచనాలతోపాటు వ్యయానికి సంబంధించిన టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీ(టీఈఎఫ్‌ఎస్) నివేదిక ప్రకారం ఇదొక బృహత్తర ప్రాజెక్టు అని స్పష్టమవుతోంది. ఈ ఎయిర్‌పోర్టు కేవలం విమానాల రాకపోకలకే పరిమితం కాకుండా.. వాణిజ్య సముదాయాలు, కార్గో రవాణా, యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించేలా ఒక మెగా ఎకనామిక్ హబ్‌గా రూపొందుతోంది.
పలాస నియోజకవర్గం మందస మండలం బడిమి, టి గంగువాడ, వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు, వంకలూరు, అనకాపల్లి.. మొత్తం ఐదు పంచాయతీల పరిధిలో ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టనున్నారు. సువిశాల తీరప్రాంతం కావడంతో.... ‘సీప్లేన్’(సముద్రంపై నుంచే విమానాలు దిగేవిధంగాను, ఆధునికంగా) కూడా అనువుగా ఈ ప్రాంతం అత్యంత అనుకూలం. హైదరాబాద్ అభివృద్ధికి ఎయిర్‌పోర్టు కీలకం. విశాఖపట్నంలో ఎయిర్‌పోర్టుతోపాటు.. నీటివసతి కూడా ఉండటం వల్ల మహానగరంగా అభివృద్ధి చెందింది. అదేరీతిలో జిల్లాలో సుదీర్ఘ తీరప్రాంతం, జలవనరులు పుష్కలంగా ఉండటం, ఆపై మూలపేట పోర్టు సమీపంలో ఉండటంతో అనుబంధ పరిశ్రమలు, కొత్త పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. తద్వారా జిల్లా అభివృద్ధి చెందనుంది.
మూడు దశల్లో.. నిర్మాణ పనులు
పలాస నియోజకవర్గంలో ఎయిర్‌పోర్టును భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 1185.56 ఎకరాల్లో నిర్మించేలా మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. దీనిని మూడు దశల్లో (2028 నుంచి 2087 వరకు) అభివృద్ధి చేయనున్నారు.
తొలిదశ (ఫేజ్-1) కింద రూ.750.52 కోట్ల అంచనా వ్యవయంతో నిర్మాణాలు చేపడతారు. ఈ దశలో ఏ320 నియో తరహా పెద్ద విమానాలు దిగేందుకు వీలుగా 2400 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో రన్‌వేను నిర్మిస్తారు. ఈ దశ పూర్తయ్యేసరికి ఏడాదికి సుమారు 6 లక్షల మంది(0.6 మిలియన్ పీపీఏ) ప్రయాణించే సామర్థ్యంతో టెర్మినల్ అందుబాటులోకి వస్తుంది.
ప్రయాణికుల రద్దీ పెరిగే కొద్దీ రూ. 757.18కోట్ల అంచనాతో రెండో దశ(ఫేజ్-2) పనులు చేపడతారు. ఈ దశలో రన్‌వే పొడవును 3200 మీటర్లకు పెంచుతారు. ప్రయాణీకుల సామర్థ్యం ఏటా 33 లక్షలకు (3.3 మిలియన్ పీపీఏ) చేరుకుంటుంది.
మూడో దశ (ఫేజ్-3) పనులకు రూ. 820.77 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. అప్పటికి విమానాశ్రయ సామర్థ్యం ఏటా 55 లక్షల మంది(5.5 మిలియన్ పీపీఏ) ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేస్థాయికి ఎదుగుతుంది.
విమానాశ్రయానికి అనుబంధంగా వాణిజ్య అవసరాల కోసం ఏకంగా 337.8 ఎకరాలను కేటాయించారు. ఇందులో హోటళ్లు, రిటైల్ మాల్స్, ఐటీ సంస్థలు, లాజిస్టిక్ పార్కులు రానున్నాయి.
100 కి.మీ. ప్రాజెక్ట్ ఇన్‌ప్ల్యూయెన్స్ జోన్..
పలాస ఎయిర్‌పోర్టుకు సంబంధించి చుట్టుపక్కల 100 కిలోమీటర్ల పరిధిని ‘ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లూయెన్స్ జోన్’(పీఐజెడ్)గా (ప్రాథమిక క్యాచ్‌మెంట్ ఏరియా) నిర్ధారించారు. ఈ పరిధిలోకి శ్రీకాకుళం, పలాస, సోంఏట, పాలకొండ, ఇచ్ఛాపురంతోపాటు పొరుగు రాష్ట్రమైన ఒడిశాలోని బ్రహ్మపూర్ వస్తాయి. ప్రస్తుతం ఈ ప్రాంత ప్రజలు విమాన ప్రయాణం కోసం విశాఖపట్నం(200 కి.మీ) వెళ్లాల్సి వస్తోంది. త్వరలో ప్రారంభంకానున్న భోగాపురం విమానశ్రయం కూడా 154 కి.మీ. దూరంలో ఉంది. తాజా అంచనాల ప్రకారం.. పలాస ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే, విశాఖకు వెళ్లే వారిలో సుమారు 84 మంది ఎయిర్ ప్రయాణికులు ఇటు మళ్లే అవకాశం ఉంది. అలాగే, సుదూర ప్రాంతాలకు వెళ్లే ఏసీ రైలు ప్రయాణికుల నుంచి 28 మంది, ఇంటర్ సిటీ ఏసీ బస్సు ప్రయాణికుల నుంచి మరో 20 మంది ఇక్కడి నుంచి విమాన ప్రయాణం వైపు మొగ్గుచూపుతారని సర్వేలో తేలింది. మొత్తం మీద బేస్ ఇయర్(2025 అంచనాల) నాటికి.. రోజుకు సగటున 264 మంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తారని నివేదిక స్పష్టం చేసింది.
మత్స్య, జీడి రైతులకు వరం..
ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతాలకు చెందిన మత్స్య, ఆక్వా, జీడిపప్పు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ఈ విమానాశ్రయం ప్రధాన కేంద్రంగా మారనుంది. త్వరగా పాడైపోయే సముద్ర ఉత్పత్తులను (సీఫుడ్) వేగంగా మార్కెట్‌కు తరలించడానికి ఇక్కడి కార్గో సేవలు ఎంతో ఉపయోగపడతాయని నివేదిక పేర్కొంది. ప్రారంభ దశలోనే విశాఖపట్నం నుంచి 10 శాతం కార్గో ఇక్కడికి మళ్లుతుందని, తద్వారా ప్రతిరోజూ 800 కేజీల సరుకు పలాస నుంచి ఎగుమతి అవుతుందని అంచనా వేశారు.
యువతకు కొలువుల జాతర!
ఆంధప్రదేశ్‌లో కొత్తగా నిర్మిస్తున్న 9 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల ప్రాజెక్టులతోపాటు, పలాసలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు కానుండటంతో ఏవియేషన్ రంగంలో స్థానిక యువతకు వేలాది ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఇంటర్మీడియట్ (10+2), సాఽధారణ డిగ్రీ(నాన్-ఇంజనీరింగ్), ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి విమానాశ్రయాలు, ఎయిర్‌లైన్స్, గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీల్లో(జీహెచ్‌ఏ) కొలువులు దక్కనున్నాయి.
విమానాశ్రయాల్లో ఎయిర్‌పోర్ట్ సేఫ్టీ ఆఫీసర్, టెర్మినల్ ఆపరేషన్స్ అసిస్టెంట్, వేర్‌హౌస్ కోఆర్డినేటర్, రన్‌వే/ఏప్రాన్ ఆపరేటర్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, సెక్యూరిటీ స్టాఫ్, కమర్షియల్/లీజింగ్ ఎగ్జిక్యూటివ్, రిటైల్ ఫ్లోర్ మేనేజర్ తదితర ఉద్యోగాలు లభించనున్నాయి.
ఎయిర్‌లైన్స్-కార్గో విభాగాల్లో... ఫ్లైట్ లోడ్ కంట్రోలర్, క్యాబిన్ క్రూ, రిజర్వేషన్ ఏజెంట్, కార్గో అసిస్టెంట్, లాజిస్టిక్స్ కోఆర్డినేటర్, గ్రౌండ్ సపోర్ట్ ఆపరేటర్, ఎక్స్-రే క్వాలిఫైడ్ ఎగ్జిక్యూటివ్స్ వంటి అవకాశాలు రానున్నాయి. .
గ్రౌండ్ హ్యాండ్లింగ్(జీహెచ్‌ఏ)- సాంకేతికత విభాగంలో స్టేషన్ ఇంజనీరింగ్ మేనేజర్, సివిల్/ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, ఫ్లీట్ సూపర్‌వైజర్, కోచ్ డ్రైవర్లు, బ్యాగేజ్ హ్యాండ్లింగ్/సార్టింగ్ ఏజెంట్లు తదితర పోస్టులు భర్తీ అవుతాయి. వీటికి తోడు హై-లెవల్ పోస్టులైన పైలట్‌లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు (ఏటీసీ), ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్లకు (ఏఎంఈ) డీజీసీఏ లైసెన్సులతో అవకాశాలు దక్కనున్నాయి. మొత్తం మీద.. పలాస గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం పూర్తయితే.. రవాణా సదుపాయంతోపాటు పారిశ్రామికంగా, ఉపాధి పరంగా జిల్లా అభివృద్ధి చెందనుంది.