మునిసిపాలిటీలకు మహర్దశ
ABN , Publish Date - Sep 23 , 2026 | 12:23 AM
Development works initiated in towns పట్టణాల ముఖచిత్రం మారేలా.. మరిన్ని మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రంలో పలు మునిసిపాలిటీల్లో రూ.11,360 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబునాయుడు మంగళవారం కుప్పం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.
పట్టణాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం
వర్చువల్‌గా సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభం
శ్రీకాకుళం అర్బన్/ పలాస/ ఇచ్ఛాపురం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): పట్టణాల ముఖచిత్రం మారేలా.. మరిన్ని మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రంలో పలు మునిసిపాలిటీల్లో రూ.11,360 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబునాయుడు మంగళవారం కుప్పం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రహదారులు, పార్కులు, రోడ్డు డివైడర్లు, వీధిదీపాలు, మురుగునీటి వ్యవస్థకు సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం కార్పొరేషన్‌తోపాటు, పలాస, ఇచ్ఛాపురం మునిసిపాలిటీల్లో పలు అభివృద్ధి పనులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్, గౌతు శిరీష ఆధ్వర్యంలో ప్రారంభించారు.
శ్రీకాకుళంలోని ఓ ఫంక్షన్‌హోల్ నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ‘శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో రూ.30 కోట్లతో రహదారులు నిర్మించడం మంచి నిర్ణయం. ప్రతి ఒక్కరూ తమ ప్రాంతాల్లో పనులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. పట్టణం అభివృద్ధికి సహకరించాల’ని కోరారు.
శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ.. ‘శ్రీకాకుళం పట్టణ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా వివిధ పథకాల ద్వారా రూ.325.79 కోట్లతో భారీగా మౌలిక వసతుల పనులు చేపడుతున్నాం. మునిసిపల్ హ్యామ్(హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) ప్రాజెక్టు కింద రూ.30కోట్లతో పనులు చేపట్టనున్నాం. నవభారత్ నుంచి అరసవల్లి మీదుగా పెద్దపాడు వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారులు అభివృద్ధికి రూ.105కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశాం. త్వరలో పనులు ప్రారంభిస్తాం. సింహద్వారం నుంచి డేఅండ్‌నైట్ జంక్షన్, అక్కడ నుంచి ఆమదాలవలస రైల్వేస్టేషన్ వరకు రహదారుల అభివృద్ధి పనులు కూడా చేపడతామ’ని తెలిపారు.
పలాస మండలం మొగిలిపాడులోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘పలాస- కాశీబుగ్గ మునిసిపాలిటిలో మౌలిక సదుపాయల కల్పనకు ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ విధానంలో రూ.25 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ అభివృద్ధి జరుగుతుంద’ని తెలిపారు. అలాగే ఇచ్ఛాపురం మునిసిపాలిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.19 కోట్లు మంజూరు చేసింది. సీఎం చంద్రబాబునాయుడు వర్చువల్‌గా మునిసిపల్ అధికారులతో మాట్లాడారు. మునిసిపాలిటీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, నిధుల వినియోగం, ప్రస్తుత పరిస్థితులపై ఆరాతీశారు. కార్యక్రమంలో కమీషనర్లు శ్రావణ్‌కుమార్, ఇ.శ్రీనివాసులు, టీడీపీ నాయకులు వజ్జ బాబూరావు, గాలి కృష్ణారావు, లొడగల కామేశ్వరరావుయాదవ్, పీరుకట్ల విఠల్‌రావు, గురిటి సూర్యనారాయణ, సప్ప నవీన్, టంకాల రవిశంకర్‌గుప్తా, దడియాల నర్సింహులు, ఎం.నరేంద్ర పాల్గొన్నారు.