సిక్కోలులో మహానాడు!
ABN , Publish Date - Apr 20 , 2026 | 12:47 AM
Site observation in three areas తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ఏటా మే నెలలో నిర్వహించే ‘మహానాడు’కు ఈసారి సిక్కోలు వేదిక కానుంది. గత ఏడాది కడప జిల్లాలో ఈ పార్టీ పండుగను ఘనంగా నిర్వహించిన అధిష్ఠానం.. ఈసారి ఉత్తరాంధ్రలో నిర్వహించాలని నిర్ణయించింది. వాస్తవానికి మహానాడు నిర్వహణ కోసం ముందుగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల వద్ద స్థలాన్ని పరిశీలించారు. అనివార్య కారణాల వల్ల అక్కడ రద్దు చేశారు. శ్రీకాకుళం జిల్లాలోనే మహానాడు నిర్వహించేందుకు టీడీపీ అధిష్ఠానం మొగ్గుచూపింది.
జిల్లాలో మూడు ప్రాంతాల్లో స్థల పరిశీలన
పైడిభీమవరంలో నిర్వహణకు నేతల మొగ్గు
త్వరలో అధికారికంగా ప్రకటించనున్న మంత్రి లోకేశ్
శ్రీకాకుళం, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ఏటా మే నెలలో నిర్వహించే ‘మహానాడు’కు ఈసారి సిక్కోలు వేదిక కానుంది. గత ఏడాది కడప జిల్లాలో ఈ పార్టీ పండుగను ఘనంగా నిర్వహించిన అధిష్ఠానం.. ఈసారి ఉత్తరాంధ్రలో నిర్వహించాలని నిర్ణయించింది. వాస్తవానికి మహానాడు నిర్వహణ కోసం ముందుగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల వద్ద స్థలాన్ని పరిశీలించారు. అనివార్య కారణాల వల్ల అక్కడ రద్దు చేశారు. శ్రీకాకుళం జిల్లాలోనే మహానాడు నిర్వహించేందుకు టీడీపీ అధిష్ఠానం మొగ్గుచూపింది. దీంతో అనువైన స్థలాన్ని అన్వేషించే పనిలో పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర పార్టీ జోనల్ చైర్మన్ శ్రీనివాసుల రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ దామచర్ల సత్య, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, పాతపట్నం, శ్రీకాకుళం ఎమ్మెల్యేలు మామిడి గోవిందరావు, గొండు శంకర్ తదితర ముఖ్య నేతలు ఆదివారం స్థల పరిశీలన చేపట్టారు. ఎచ్చెర్ల, శ్రీకాకుళం నియోజకవర్గాల పరిధిలోని పైడిభీమవరం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం నగర పరిసరాల్లో మూడు స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ స్థలాల భౌగోళిక పరిస్థితులు, పార్కింగ్ వసతులు, రవాణా అనుకూలత తదితర అంశాలను క్రోడీకరించి నేతలు నివేదికను సిద్ధం చేస్తున్నారు. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్‌కు నివేదిక అందజేయనున్నారు. ఈ నివేదికను, క్షేత్రస్థాయి పరిస్థితులను బేరీజు వేసుకున్న అనంతరం.. మంత్రి లోకేశ్ త్వరలో మహానాడు వేదికను ఖరారు చేయనున్నారు.
పైడిభీమవరం వైపే ఆసక్తి!
నాయకులు పరిశీలించిన స్థలాల్లో పైడిభీమవరం వద్ద స్థలంపైనే ప్రాథమికంగా మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ సుమారు 100 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో భారీ స్థలం అందుబాటులో ఉంది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే వేలాదిమంది ప్రతినిధులకు వసతి, భారీ బహిరంగ సభకు వేదిక, వాహనాల పార్కింగ్ సదుపాయాలకు ఈ ప్రాంతం అత్యంత అనుకూలంగా ఉంటుందని నేతలు భావిస్తున్నారు. దీంతో ఈ స్థలాన్నే ఫైనల్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం.