Share News

‘మహా’త్సవం!

ABN , Publish Date - May 29 , 2026 | 12:10 AM

Mahanadu celebrations జిల్లాలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం రెండోరోజు గురువారం అత్యంత వైభవంగా ముగిసింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతి వేడుకలను పురస్కరించుకుని జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో గల 83 క్లస్టర్లలోనూ పండగ వాతావరణం నెలకొంది.

‘మహా’త్సవం!
శ్రీకాకుళంలో ఎన్టీఆర్‌ బర్త్‌డే కేక్‌ను కట్‌ చేస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌, టీడీపీ శ్రేణులు

  • జిల్లాలో మిన్నంటిన మహానాడు ఉత్సవాలు

  • ఎన్టీఆర్‌ జయంతి వేడుకలతో పండగ వాతావరణం

  • 8 నియోజకవర్గాలు.. 83 క్లస్టర్లలో ‘హైబ్రిడ్‌’ విధానంలో తమ్ముళ్ల సందడి

  • పార్టీ నిధికి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు రూ.10 లక్షల విరాళం

  • అభినందించిన సీఎం చంద్రబాబు

  • శ్రీకాకుళం, మే 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం రెండోరోజు గురువారం అత్యంత వైభవంగా ముగిసింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతి వేడుకలను పురస్కరించుకుని జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో గల 83 క్లస్టర్లలోనూ పండగ వాతావరణం నెలకొంది. పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున కేకులు కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. మంగళగిరిలో జరుగుతున్న ప్రధాన మహానాడును జిల్లావ్యాప్తంగా అన్ని క్లస్టర్‌ కేంద్రాల్లో ఎల్‌ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేసి హైబ్రిడ్‌ (వర్చువల్‌) విధానంలో వీక్షించారు. మంగళగిరిలోని ప్రధాన మహానాడు వేదికపై జిల్లాకు చెందిన పలువురు ప్రముఖ నేతలు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌, పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు ప్రధాన మహానాడులో నేరుగా పాల్గొని, అక్కడ ఆమోదించిన పలు కీలక తీర్మానాల్లో భాగస్వాములయ్యారు.

  • అచ్చెన్న తీర్మానానికి జేజేలు

  • మంగళగిరి ప్రధాన వేదికపై టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టిన కీలక తీర్మానానికి జిల్లాలోని కార్యకర్తలు, నాయకులు ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతూ ఆమోదం తెలిపారు. జిల్లాలో మహానాడు కార్యక్రమాలు విజయవంతం కావడంపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. టెక్కలి నియోజకవర్గ కార్యకర్తలతో పాటు జిల్లాలోని తెలుగు తమ్ముళ్లందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

  • పాతపట్నంలో రూ.10లక్షల విరాళం

  • పాతపట్నం నియోజకవర్గంలో మహానాడు ఉత్సవాలు ఉత్సాహంగా సాగాయి. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో నియోజకవర్గవ్యాప్తంగా ఏకంగా 9,600 మందికి పైగా భారీ భోజన వసతి సౌకర్యాలను కల్పించారు. పార్టీ కోసం ఎమ్మెల్యే గోవిందరావు రూ.10 లక్షలను ఫండ్‌గా అందజేశారు. ఈ విషయాన్ని మంగళగిరి మహానాడు వేదికపై స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చదివి వినిపించడంతో జిల్లా అంతటా పార్టీశ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

  • సైకిల్‌పై వచ్చిన శ్రీకాకుళం ఎమ్మెల్యే..

  • శ్రీకాకుళం నియోజకవర్గంలో మహానాడు వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌ స్వయంగా సైకిల్‌ తొక్కుకుంటూ కార్యకర్తలతో కలిసి మహానాడు కార్యక్రమానికి తరలివచ్చారు. అంతకుముందు ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా నగరంలోని ఏడు రోడ్ల జంక్షన్‌ వద్ద ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి, పక్కనే ఉన్న కేంద్రమాజీమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

  • ప్రతి క్లస్టర్‌లోనూ..

  • ఎచ్చెర్ల నియోజకవర్గంలో పార్టీ పరిశీలకులు వజ్జ బాబూరావు ఆధ్వర్యంలో 10 క్లస్టర్లలో మహానాడు వేడుకలు ఘనంగా ముగిశాయి. నరసన్నపేట నియోజకవర్గంలో సారవకోట క్లస్టర్‌లో స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి నేతృత్వంలో కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఆమదాలవలస, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో జిల్లా టీడీపీ అధ్యక్షులు మొదలవలస రమేష్‌ పాల్గొని కార్యకర్తలో ఉత్సాహం నింపుతూ మహానాడును విజయవంతం చేశారు. జిల్లావ్యాప్తంగా రెండు రోజులపాటు జరిగిన ఈ ప్రతిష్టాత్మక మహానాడు మహాత్సవంలో మొత్తం 60 వేల మందికి పైగా ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2026 | 12:10 AM