Share News

మాయా‘జలం’

ABN , Publish Date - Feb 22 , 2026 | 11:32 PM

ఒకప్పుడు పల్లెల్లో బావులు, బోర్ల నీటిని.. పట్టణాలు, నగరాల్లో కుళాయి నీటిని ప్రజలు వినియోగించేవారు.

మాయా‘జలం’
నరసన్నపేటలో ఒక ప్లాంట్‌లో నేరుగా క్యాన్‌లకు నీటిని నింపుతున్న దృశ్యం

- జిల్లాలో పుట్టగొడుగుల్లా వాటర్‌ ప్లాంట్లు

- మినరల్‌ వాటర్‌ పేరుతో విక్రయాలు

- లేబుళ్లు మార్చి మోసం

- కనీస ప్రమాణాలు పాటించని వైనం

- ప్రజారోగ్యంతో ఆటలు

ఒకప్పుడు పల్లెల్లో బావులు, బోర్ల నీటిని.. పట్టణాలు, నగరాల్లో కుళాయి నీటిని ప్రజలు వినియోగించేవారు. ప్రస్తుతం అనారోగ్య సమస్యలు, ఇతర కారణాలతో పేద, ధనిక అనే తేడాలేకుండా చాలామంది మినరల్‌ వాటర్‌ను తాగుతున్నారు. అయితే, ప్రజల తాగునీటి అవసరాలను కొందరు వ్యాపారులు తమ ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు. అధికారుల అనుమతులు లేకుండానే వాటర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. మినరల్‌ వాటర్‌ పేరుతో జనరల్‌ వాటర్‌ను అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్నారు.

------------------------

నరసన్నపేట, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వాటర్‌ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. కొందరు వ్యాపారులు నిబంధనలు తుంగలోతొక్కి ఇష్టారాజ్యంగా ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. కనీస ప్రమాణాలు పాటించకుండా, నీటిని పూర్తిస్థాయిలో శుద్ధి చేయకుండా విక్రయిస్తూ ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు. ఎలాంటి అనుమతులు, ఐఎస్‌ఐ గుర్తింపు లేకుండా రోజుకు లక్షల లీటర్ల నీటిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. నీటి కేంద్రాల నిర్వాహకుల నుంచి భారీగా నజరానాలు ముట్టడమే దీనికి కారణమనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇంటింటా కుళాయిలను ఏర్పాటు చేసింది. అనేక చోట్ల పనులు పూర్తికాకపోవడంతో పట్టణాలతో పాటు గ్రామాల్లో కూడా శుద్ధి జలాన్ని వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మినరల్‌ వాటర్‌కు డిమాండ్‌ ఏర్పడింది. దీనికి తోడు ఈ ఏడాది మార్చిలోనే ఎండలు మండుతుండడంతో తాగునీటి వనరులు అడుగంటుతున్నాయి. ప్రజలకు నీటి అవసరాలు పెరగడంతో మినరల్‌ వాటర్‌ అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోక వైపు హోటళ్లు, పాస్ట్‌ఫుడ్‌ షాపుల్లో వాటర్‌ బాటిళ్లు, ప్యాకెట్ల ద్వారా నీటి విక్రయాలు చేయడంతో వీటి డిమాండ్‌ అమాంతగా పెరిగింది. దీన్ని ఆసరా చేసుకొని ఆయా కేంద్రాల నిర్వాహకులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. కనీస జాగ్రత్తలు పాటించకుండా నీటిని పూర్తిస్థాయిలో శుద్ధి చేయకుండా అమ్ముతూ ప్రజలను దోచుకుంటున్నారు.

విచ్చలవిడిగా ప్లాంట్‌లు

జిల్లాలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఆర్వో ప్లాంట్లను విచ్చలవిడిగా కొందరు ఏర్పాటు చేస్తున్నారు. గృహ అవసరాల కోసమని బోర్లు ఏర్పాటు చేసుకొని వాటి నుంచి నీటిని ప్యూరిఫైయర్‌ ద్వారా శుద్ధి చేసి ట్యాంకర్లకు పంపుతున్నారు. కొందరు నేరుగా బోరు నీటినే క్యాన్లు, బాటిళ్లు, ప్యాకెట్లకు నింపుతున్నారు. క్యాను నీటిని రూ.20 నుంచి రూ.30 వరకూ అమ్ముతున్నారు. బాటిళ్లకు అందమైన స్టిక్కర్లను ఏర్పాటు చేస్తున్నారు. అర లీటరు, 200 మి.లీ, లీటర్ల బాటిళ్లను రూ.10 నుంచి రూ.20కు విక్రయిస్తున్నారు. కొందరు నిర్వాహకులు ట్యాంకర్ల ద్వారా నేరుగా ఇళ్లకే సరఫరా చేస్తున్నారు. ఒక్కో ప్లాంట్‌లో రోజకు దాదాపు రూ.20వేల నుంచి రూ.25వేల వరకు వ్యాపారం జరుగుతున్నట్లు అంచనా. ప్రభుత్వ నిబంధనలన్నీ పాటించి వాటర్‌ ప్లాంట్‌ చేయాలంటే రూ.30లక్షలకు పైగా ఖర్చవుతుంది. కానీ ప్రమాణాలు పాటించకుండా ఎక్కువ మంది రూ.5 నుంచి 7 లక్షలు మాత్రమే వెచ్చించి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో సుమారు 850 వరకు నీటి శుద్ధి కేంద్రాలు ఉండగా ఒకట్రెండు ప్లాంట్లకు మినహా మిగతా కేంద్రాలకు ఐఎస్‌ఐ గుర్తింపులేదు. మొదట్లో కొందరు తీసుకున్నా ఏటా రెన్యువల్‌ చేయడం లేదు.

ఇవీ నిబంధనలు..

నీటిని శుద్ధి చేయాలంటే తొలుత ఇసుక ఫిల్టర్‌లోకి, అనంతరం కార్బన్‌ ఫిల్టర్‌లోకి పంపాలి. అక్కడ శుద్ధి చేసిన అనంతరం సాఫానర్‌లోకి పంపి తర్వాత రెండు ఫిల్టర్ల ద్వారా శుద్ధి చేసి ఆర్వోప్లాంట్‌కు చేర్చాలి. అక్కడ నుంచి రివర్స్‌ అస్మోసిస్‌ ద్వారా యూఎస్‌ఏ ల్యాంప్‌నకు పంపి స్టెరిలైజేషన్‌ అనంతరం ఓజోనైజేసన్‌ చేయాలి. తర్వాత నీటిని ట్యాంకులకు నింపాలి. అక్కడ నీటిని 24 గంటల వరకు నిల్వ ఉంచిన తర్వాత వినియోగించాలి. ప్లాంట్‌ చుట్టూ పరిశుభ్రమైన వాతావరణం ఉండాలి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆహార భద్రత అధికారులు ప్లాంట్‌ను తనిఖీ చేసి ధ్రువీకరణ పత్రం మంజూరు చేయాల్సి ఉంది. వాటర్‌ ప్లాంట్‌కు ఐఎస్‌ఐ అను మతి తప్పనిసరి. ప్రాథమిక అనుమతి కోసమే రూ.3లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం రూ.89వేలు కట్టి రెన్యూవల్‌ చేసుకోవాలి. ప్రతి కేంద్రంలోనూ నీటి పరీక్షల కోసం మైక్రో బయాలజీ, కెమిస్ట్రీ ల్యాబ్‌లు, ఏసీ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి. కానీ జిల్లాలో ఒకట్రెండు చోట్ల తప్ప ఎక్కడా ప్రమాణాలు పాటించడం లేదు.

కానరాని తనిఖీలు

తాగునీటి ప్లాంట్లను ఆహార భద్రత అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. గతంలో మేజర్‌ పంచాయతీలు, మునిసిపాలిటీల్లో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ల పేరుతో ప్రత్యేక అధికారులు ఉండేవారు. ఆ బాధ్యతల నుంచి వారిని తప్పించి ఆహార భద్రత అధికారులకు అప్పగించారు. అయితే వారు మినరల్‌ వాటర్‌ ప్లాంట్లలోని లోపాలపై కనీస దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. నిర్వాహకుల నుంచి భారీ మొత్తాలు పుచ్చుకొని మిన్నకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై జిల్లా ఆహార కల్తీనియంత్రణ అధికారులకు సంప్రదించినా వారు స్పందించకపోవడం గమనార్హం.

ఆరోగ్యంపై ప్రభావం

కొన్ని ప్రాంతాల్లో బోరు వాటర్‌ను నేరుగా ట్యాంకులకు నింపి విక్రయిస్తున్నారు. ఈ నీటిని తాగితే మలేరియా, టైఫాయిడ్‌ వంటి రోగాల బారిన పడతారు. ప్రధానంగా తాగునీటి ద్వారా ఉత్పన్నమయ్యే బాక్టీరియా కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. అందులో అభివృద్ధి చెందే ఫంగస్‌ వలన లివర్‌, జీర్ణకోశ వ్యాధుల బారిన పడతారు. ఉదర సంబంధ వ్యాధులతో పాటు కీళ్లనొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వాటర్‌ ప్లాంట్లను తనిఖీ చేసి నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Feb 22 , 2026 | 11:32 PM