మెరుపులతో మాయ
ABN , Publish Date - Feb 04 , 2026 | 11:48 PM
Fraud in silver jewelry sales జిల్లాలో కొంతమంది వ్యాపారులు వెండి ఆభరణాలకు మెరుపులతో వినియోగదారులకు మాయ చేస్తున్నారు. 50 శాతం వెండి, మిగిలినది ఇతర లోహాలతో మిక్సింగ్ చేసి ఆభరణాలను అధిక ధరకు విక్రయిస్తున్నారు.
వెండి నగల విక్రయాల్లో మోసం
ఇతర లోహాల మిక్సింగ్‌తో దోపిడీ
కానరాని స్వచ్ఛత పరీక్షలు
ఉర్లాం గ్రామానికి చెందిన చిట్టెమ్మ మూడు నెలల కిందట నరసన్నపేటలోని ఓ బంగారం దుకాణంలో నాలుగు తులాల వెండి పట్టీలు రూ.12వేలకు కొనుగోలు చేసింది. అవి నల్లగా మారిపోవడంతో ఇటీవల మరో దుకాణానికి వెళ్లి తీసుకెళ్లగా అందులో వెండి ఎక్కువ లేదంటూ రూ.3వేలకు వ్యాపారి లెక్కకట్టారు. మరో 15వేలు తీసుకుని కొత్తపట్టీలు ఇచ్చారు. ఇలా చాలాచోట్ల వెండి ఆభరణాల విక్రయాల్లో వ్యాపారులు మాయాజాలం ప్రదర్శిస్తూ.. వినియోగదారులను దోచేస్తున్నారు.
నరసన్నపేట, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొంతమంది వ్యాపారులు వెండి ఆభరణాలకు మెరుపులతో వినియోగదారులకు మాయ చేస్తున్నారు. 50 శాతం వెండి, మిగిలినది ఇతర లోహాలతో మిక్సింగ్ చేసి ఆభరణాలను అధిక ధరకు విక్రయిస్తున్నారు. జిల్లాలో నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలస, సోంపేట, పలాస, రణస్థలం, టెక్కలి తదితర పట్టణాల్లో అత్యధికంగా బంగారం దుకాణాలు ఉన్నాయి. వీటిలో నరసన్నపేట కేంద్రంగానే 24 మంది వ్యాపారులు వెండి హోల్‌సేల్ విక్రయాలు నిర్వహిస్తున్నారు. వీరంతా జిల్లాలో బంగారం షాపులకు వెండి పట్టీలు, కంకణాలు, ప్రతిమలు, చెంబులు, పళ్లెలతోపాటు పూజకు వినియోగించే వెండి సామగ్రిని సరఫరా చేస్తుంటారు. షాపుల యాజమానుల నుంచి వెండి హోల్‌సేల్ వ్యాపారులు 40శాతం టచ్(అసలు వెండి) నుంచి 70శాతం టచ్ కలిగిన ఆర్డర్లను తీసుకుంటారు. దాని ప్రకారం తమిళనాడులో సేలం నుంచి బల్క్‌గా ఆర్డర్ బుక్ చేసి జిల్లాలో విక్రయాలు సాగిస్తారు. మరికొందరు వ్యాపారులు అహ్మదాబాద్, ముంబై ప్రాంతాల నుంచి వెండి ఆభరణాలను నరసన్నపేట, శ్రీకాకుళం పట్టణాలకు దిగుమతి చేసుకుంటారు. ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు పంపిణీ చేస్తారు.
మొత్తంగా లెక్కించి..
బంగారం ఆభరణాల విషయంలో వినియోగదారులు ఆచితూచి కొనుగోలు చేస్తారు. కానీ, వెండి ఆభరణాల కొనుగోలు సమయంలో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. ఇదే అదునుగా భావించి జిల్లాలో కొంతమంది వ్యాపారులు వినియోగదారులను దోచేస్తున్నారు. వెండి ఆభరణాలను తూకం వేసి.. గ్రాము ధర చొప్పున లెక్కించి వినియోగదారులకు విక్రయిస్తున్నారు. కానీ వాస్తవానికి పట్టీలు, చిన్నచిన్న విగ్రహాలు, పూజాసామగ్రి తదితర వెండి ఆభరణాల్లో 30 శాతం నుంచి 50 శాతం మాత్రమే టచ్(అసలైన వెండి లోహం) కలిగేవి ఉంటాయి. మరికొన్ని వస్తువుల్లో 70 శాతం వరకు టచ్ ఉంటుంది. ఆభరణాల్లో వెండి ఎంతశాతం ఉందో అంతకే ధర నిర్ణయించాలి. కానీ మొత్తం 100 శాతం వెండి ఉన్నట్టు లెక్కించి.. విక్రయిస్తున్నారు. ఆభరణాల తయారీ మజూరీని సైతం వసూలు చేస్తున్నారు. మెరుపునిచ్చే లోహాలను ఆభరణాల తయారీలో కలిసి మాయ చేస్తున్నారు. మరోవైపు డిజైనింగ్ చేసే వస్తువులు.. అష్టలక్ష్మీ, లక్ష్మీ, శ్రీవేంకటేశ్వర తదితర విగ్రహాలను విక్రయించే సమయంలోనూ అదనపు ధర వసూలు చేస్తున్నారు. అలాగే వెండి పూత కలిగిన ఫొటోల విక్రయాల్లోనూ దోచుకుంటున్నారు.
నాణ్యత కేంద్రాల్లోనూ అదే తీరు
‘నమ్మకం లేకపోతే మా దగ్గర కొనుగోలు చేసే వస్తువుల నాణ్యత పరీక్షించుకోండి’ అని వ్యాపారులు చెబుతున్నారు. కానీ నాణ్యత కేంద్రాలు కూడా ఆ వ్యాపారుల అండతోనే నడుస్తున్నాయి. సదరు వ్యాపారి చెప్పిన పర్సంటైల్‌కు మాత్రమే నాణ్యత కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది వినియోగదారులు నాణ్యత కేంద్రాల్లో పరీక్ష చేయించినా ఫలితం లేకపోతోంది.