పొంచిఉన్న అంటువ్యాధుల ముప్పు
ABN , Publish Date - Sep 26 , 2026 | 11:38 PM
తుఫాన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి.
- వర్షాలతో పలుచోట్ల నిలిచిన నీరు
- దోమలవృద్ధికి అవకాశం
- తాగునీటి వనరులూ కలుషితం
- అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యాధికారులు
శ్రీకాకుళంకల్చరల్, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): తుఫాన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దీనివల్ల తాగునీటి వనరులు కలుషితం కావడం, వాతావరణ పరిస్థితులు మారడం వంటి కారణాలతో అంటువ్యాధుల ముప్పు పొంచి ఉంది. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వలేకుండా చూసుకోవాలని, కాచిచల్లార్చిన నీటిని తాగాలని, వేడి ఆహార పదార్ధాలు తినాలని, దోమలు కుట్టకుండా దోమతెరలు వినియోగించాలని చెబుతున్నారు.
ఇవి చేయండి..
వర్షాలకు అన్ని గ్రామాల్లో తాగిపడేసిన కొబ్బరిబొండాలు, ప్లాస్లిక్ గ్లాసులు,పెరట్లోని రుబ్బురోళ్లు, వాడకుండా వదేలిసిన కుండలు, కంటైనర్లు, పాత టైర్లు, పూలకుండీలు, మూతలులేని నీటినిల్వ పాత్రలు, కుండీలు ఇలా అన్నింటిల్లోనూ నీరు చేరింది. ఈ నీటిని వెంటనే తొలగించాలి. లేదంటే ఆ నీటిలో దోమలు గుడ్లు పెట్టి లార్వాగా మారి దోమలవృద్ధికి అవకాశం కలుగుతుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా డెంగ్యూ జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉంది. దీనికి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల స్థాయిలో ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, మేల్ వర్కర్లు ప్రతీ గ్రామంలో ఇంటింటికీ వెళ్లి లార్వా బ్రీడింగ్ ప్లేసులను గుర్తించి యుద్ధప్రాదిపదికన తొలగించాలి. దోమల లార్వాలను చంపే మందులను పిచ్‌కారీ చేయడంతో పాటు మలేరియా లార్వాను తినే గంబూషియా చేపలను వదలడం వంటి చర్యలు చేపట్టాలి.
- వాతావరణ మార్పుల కారణంగా వైరస్‌లు దాడిచేసే అవకాశం ఉంది. దీంతో వైరల్ జ్వరాలు వచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తంగా వ్యవహరించాలి. గ్రామాల్లో ఫీవర్ సర్వే చేసి జ్వరపీడితులను గుర్తించాలి. రక్తనమూనాలు సేకరించి మలేరియా జ్వరాలా కాదా? అన్నది నిర్ధారించుకోవాలి. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డుల సహకారంతో పారిశుధ్యం మెరుగుపరచాలి.
- వర్షాలతో పాటు మలమూత్రాల కారణంగా తాగునీటి వనరులు కలుషితం అయే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. దీనివల్ల డయేరియా, నీళ్ల విరేచనాలు, కలరా వంటివి వ్యాప్తి చెందుతాయి. వీటి నీటి నివారణకు ప్రతీ 15 రోజులకొకసారి తాగునీటి వనరులను క్లోరినేషన్ చేయించాలి. ఇటీవల శ్రీకాకుళం నగరంలో పలు ప్రాంతాల్లో డయేరియా విజృంభించింది. దీని దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టాల్సిన అవసరం ఉంది. తాగునీటి పైపులైన్లు లీకేజీ లేకుండా, పుడ్ పాయిజినింగ్ జరగకుండా చర్యలు చేపట్టాలి.
- ఈ సీజన్‌లో తొందరగా వ్యాపించే అంటువ్యాధుల్లో కండ్లకలక ఒకటి. ఒక ప్రాంతంలో ఇది ప్రబలితే అంతటా వ్యాప్తి చెందుతుంది. ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించేటప్పుడు ఎవరైనా కండ్లకలకతో బాధపడుతుంటే వెంటనే వారికి చికిత్స ప్రారంభించాలి. రోగికి తగిన జాగ్రత్తలు చెప్పడంతో పాటు ఇంట్లో వారికి అవగాహన కలిగించాలి.
అప్రమత్తంగా వ్యవహరించాలి..
వర్షాకాలంలో వ్యాపించే కీటకజనిత వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలి. తగినన్ని మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఐవీ ప్లూయిడ్స్‌ను సమకూర్చుకొని సిద్ధంగా ఉండాలి. అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను సిద్ధం చేయాలి. ఎక్కడ అంటువ్యాధి ప్రబలినట్లు సమాచారం వచ్చినా తక్షణం హాజరై వైద్యసేవలు అందించేలా పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి.
పూర్తి అప్రమత్తతో ఉన్నాం..
‘అంటువ్యాధులపై పూర్తి అప్రమత్తంగా ఉన్నాం. అన్ని తాగునీటి వనరులను క్లోరినేషన్ చేయించాలని సిబ్బందిని ఆదేశించాం. కాచిచల్లార్చిన నీటినే తాగాలని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించాం. నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, ప్రైడే డ్రైడే పక్కాగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. వర్షాలకు ముందు నరసన్నపేటలో ఒక డెంగ్యూకేసు నమోదైంది. దానిని పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. దోమల లార్వాలు పెరగకుండా టెమోపాస్, బీటీఐ రసాయనాలను యాంటి లార్వా ఆపరేషన్ కింద జిల్లాలో వినియోగిస్తున్నాం. అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో తగినన్ని మందులు అందుబాటులో ఉన్నాయి.’ అని జిల్లావైద్యఆరోగ్యశాఖాధికారి నరేష్‌కుమార్, జిల్లా మలేరియా అధికారి సత్యనారాయణ తెలిపారు.