చంద్రగ్రహణం... ప్రభావం
ABN , Publish Date - Mar 04 , 2026 | 12:24 AM
Temples closed చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం జిల్లాలో ఆలయాలు మూతపడ్డాయి. మధ్యాహ్నం 3.19 గంటలకు చంద్ర గ్రహణం ఆరంభమైంది. ఈ నేపథ్యంలో అరసవల్లిలోని శ్రీసూర్యనారాయణస్వామి ఆలయాన్ని మంగళవారం ఉదయం 9.30 గంటలకు మూసేశారు.
ఆలయాలు మూసివేత
నిర్మానుష్యంగా రహదారులు
అరసవల్లి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం జిల్లాలో ఆలయాలు మూతపడ్డాయి. మధ్యాహ్నం 3.19 గంటలకు చంద్ర గ్రహణం ఆరంభమైంది. ఈ నేపథ్యంలో అరసవల్లిలోని శ్రీసూర్యనారాయణస్వామి ఆలయాన్ని మంగళవారం ఉదయం 9.30 గంటలకు మూసేశారు. దీంతో భక్తులు లేక ఆలయ పరిసర ప్రాంతాలు, క్యూలైన్లు వెలవెలబోయాయి. గ్రహణం అనంతరం రాత్రివేళ ఆలయాల్లో శుద్ధి, సంప్రోక్షణ నిర్వహించారు. బుధవారం ఉదయం స్వామికి నిత్యార్చనలు అనంతరం ఉదయం 6.30 గంటల నుంచి భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తామని ఆదిత్యాలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి.శంకరశర్మ తెలిపారు. కాగా.. గ్రహణం సందర్భంగా చాలా మంది ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడంతో మంగళవారం మధ్యాహ్నం శ్రీకాకుళంలోని రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి. వ్యాపారులు కూడా దుకాణాలను మూసేయడంతో ప్రధాన కూడళ్లు సైతం బోసిపోయాయి. అలాగే మధ్యాహ్నం సంభవించిన చంద్రగ్రహణం వీడుతున్న సుందర దృశ్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. సాయంత్రం 6.31 గంటల సమయంలో చంద్రుడు ఎరుపు రంగులో దర్శనమిచ్చాడు. 6.52 గంటలకు గ్రహణం వీడిన తర్వాత తెలుపు రంగులోకి మారాడు. ఇలా నారింజ వర్ణం నుంచి ఎరుపు, తెలుపు రంగులు మారిన దృశ్యాలను జిల్లావాసులు వీక్షించారు. అనంతరం పలువురు గ్రహణ స్నానం చేశారు. ఆలయాల్లో సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించారు.