Share News

జంతుప్రేమ... జాగ్రత్త సుమా!

ABN , Publish Date - Jul 06 , 2026 | 12:18 AM

Today is World Zoonosis Day చాలామంది కుక్కలు, పిల్లులు, రకరకాల పక్షులను పెంచుతుంటారు. పెంపుడు జంతువులంటే వారికి ప్రాణం. వాటిని కన్న పిల్లలతో సమానంగా కంటికి రెప్పలా చూసుకుంటుంటారు. అవి కూడా అంతకు మించిన ప్రేమను పంచుతుంటాయి. అయితే జంతువులు, పక్షుల పెంపకంలో జాగ్రత్తలు అవసరమని పశువైద్యులు సూచిస్తున్నారు. లేదంటే వాటి నుంచి కొన్ని వ్యాధులు మనుషులకు సంక్రమిస్తాయని హెచ్చరిస్తున్నారు.

జంతుప్రేమ... జాగ్రత్త సుమా!
కుక్కకు టీకా వేస్తున్న పశువైద్యాధికారులు (ఫైల్‌)

  • పెంపుడు జంతువులకు విధిగా టీకాలు వేయాలి

  • లేదంటే మూల్యం తప్పదు

  • వాటితో మనుషులకు 280 వ్యాధుల వ్యాప్తి

  • నేడు ప్రపంచ జూనోసిస్‌ డే

  • కోటబొమ్మాళి/ఇచ్ఛాపురం, జూలై 5 (ఆంధ్రజ్యోతి): చాలామంది కుక్కలు, పిల్లులు, రకరకాల పక్షులను పెంచుతుంటారు. పెంపుడు జంతువులంటే వారికి ప్రాణం. వాటిని కన్న పిల్లలతో సమానంగా కంటికి రెప్పలా చూసుకుంటుంటారు. అవి కూడా అంతకు మించిన ప్రేమను పంచుతుంటాయి. అయితే జంతువులు, పక్షుల పెంపకంలో జాగ్రత్తలు అవసరమని పశువైద్యులు సూచిస్తున్నారు. లేదంటే వాటి నుంచి కొన్ని వ్యాధులు మనుషులకు సంక్రమిస్తాయని హెచ్చరిస్తున్నారు. సోమవారం వరల్డ్‌ జూనోసిస్‌ డే (జంతువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధుల నివారణ దినం) సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

  • జిల్లాలో పరిస్థితి..

  • జిల్లాలో పెంపుడు కుక్కలు, పిల్లులు 33వేల వరకు ఉన్నాయి. అయితే, వీటి పెంపకంలో జాగ్రత్తలు తీసుకోకపోతే వాటి నుంచి మనుషులకు సుమారు 280 వ్యాధులు సంక్రమిస్తాయని అధ్యయనాలు తేల్చాయి. కొన్నిసార్లు ప్రాణాలకే ముప్పు అని పశువైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా వైరస్‌ ద్వారా రేబిస్‌, మెదడు వాపు, గాలికుంటు, స్వైన్‌ఫ్లూ, బర్డ్‌ఫ్లూ, ఇన్‌ఫ్లుయంజా, బ్యాక్టీరియా వల్ల క్షయ, సాల్మోనెల్లోసిస్‌, ఆంథ్రాక్స్‌, బ్రూ సెల్లోసిస్‌, లెఫ్టో స్పైరోసిస్‌, లిస్టీరియోసిస్‌, పరాన్న జీవుల ద్వారా అమీబియాసిస్‌, సార్కోసిస్టోసిస్‌, టీనియాసిస్‌, హైడాటిడోసిస్‌, గజ్జి, అస్కారియాసిస్‌ వ్యాధులు సంక్రమిస్తాయి. వాటి వల్ల మరణించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. అందుకే మన చుట్టూ తిరిగే కుక్కలు, పిల్లులు ఇతర జంతువులకు తప్పకుండా యాంటీ రేబిస్‌ టీకాలు వేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. నేడు (సోమవారం) జిల్లాలోని అన్ని పశుసంవర్థకశాఖ కార్యాలయాల ఆవరణలో యాంటీ రేబిస్‌ టీకాలు వేసేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

  • కుక్కకాటు ప్రమాదకరం..

  • ఇతర జంతువుల కంటే కుక్క కాటు ప్రమాదకరం. కుక్క కరిచిన ఏడో రోజు నుంచి నాలుగేళ్లలోపు ఎప్పుడైనా రేబిస్‌ వ్యాధి లక్షణాలు బయటపడతాయి. జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, మింగలేకపోవడం, నీటిని చూసి భయపడడం, పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం వీటి లక్షణం. కుక్క కరిచిన వెంటనే యాంటీ రేబిస్‌ టీకా ఐదు డోసులు తప్పనిసరిగా వేయించుకోవాలి.

  • ఇవి తప్పనిసరి..

  • చాలామంది పెంపుడు జంతువులను ఇంటి మనుషులుగా చూస్తుంటారు. వాటితో నిత్యం గడుపుతుంటారు. పిల్లలు అయితే చెప్పనవసరం లేదు. వాటితోనే ఎక్కువగా ఉంటారు. అలా జంతువులను తాకితే వెంటనే సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పెంపుడు కుక్కలు బయటకు తీసుకుళ్లే క్రమంలో వీధికుక్కలు కరవకుండా చూసుకోవాలి. చాలామంది వ్యాక్సినేషన్‌పై అవగాహన ఉండదు. ఈ విషయంలో నిర్లక్ష్యం మాత్రం చేయకూడదు. కాబట్టి వ్యాక్సినేషన్‌ తప్పనిసరి. సాధారణంగా దగ్గరగా ఉండే మనుషులకు కరవడం, గీరడం వంటివి జరుగుతుంటాయి. ఇదే వ్యాధుల వ్యాప్తికి కారణం అవుతుంది. అందుకే ముందస్తుగా టీకాలు వేయించడం ఉత్తమం.

  • అందుబాటులో టీకాలు

  • ప్రపంచ జూనోసిస్‌ డే సందర్భంగా పెంపుడు జంతువులకు యాంటీ రేబిస్‌ టీకాలు వేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 33,999 యాంటి రేబీస్‌ టీకాలు అందుబాటులో ఉంచాం. పెంపుడు జంతువులు ఉన్న వాళ్లు తప్పకుండా వాటికి టీకాలు వేయించాలి. అన్ని పశుసంవర్థకశాఖ కార్యాలయాల ఆవరణలో జంతువులకు ఉచితంగా టీకాలు వేస్తారు.

    - డాక్టర్‌ మంద లోకనాథం, పశుసంవర్థక శాఖ ఉప సహాయ సంచాలకుడు, కోటబొమ్మాళి.

  • టీకాలు వేయించాలి..

  • ప్రతీ పెంపుడు జంతువుకు విధిగా యాంటీ రేబిస్‌ టీకా వేయించాలి. జూనోసిస్‌ డే సందర్బంగా సోమవారం ఇచ్ఛాపురం నియోజకవర్గ పరిధిలోని అన్ని పశువైద్య శాలల్లో కుక్కలకు యాంటీ రేబిస్‌ టీకాలు వేస్తాం.

    -అప్పలస్వామి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, ఏరియా వెటర్నరీ డాక్టర్‌, ఇచ్ఛాపురం

Updated Date - Jul 06 , 2026 | 12:18 AM