రెప్పపాటులో ఘోరం
ABN , Publish Date - Jan 04 , 2026 | 11:56 PM
Road accident సోంపేట మండలం కొర్లాం, బారువ జాతీయ రహదారి జంక్షన్ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశాకు చెందిన ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విష మంగా ఉంది.
డివైడర్ దాటి కారును ఢీకొన్న లారీ
పసికందు సహా ముగ్గురి మృతి
మరో ఇద్దరి పరిస్థితి విషమం
సోంపేట రూరల్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): సోంపేట మండలం కొర్లాం, బారువ జాతీయ రహదారి జంక్షన్ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశాకు చెందిన ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విష మంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాలి లా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్‌కు చెందిన ఐదుగురు కారులో ఆదివారం విశా ఖపట్నం బయలుదేరారు. కొర్లాం జంక్షన్ వద్ద వారు ప్రయాణిస్తున్న కారును.. పలాస నుంచి ఇచ్ఛాపురం వెళ్తున్న ఓ లారీ ఢీకొంది. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో లారీ డివైడర్ దాటి రాంగ్‌రూట్‌లోకి వచ్చి కారును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. దీంతో కారులో ప్రయా ణిస్తున్న కనకలత(31) అక్కడికక్కడే మృతి చెందింది. పాప అభిలాష(8), ఆదిత్య బాబు (1), డ్రైవర్(25), మరో బాలిక(12)కు తీవ్ర గాయాలయ్యాయి. హైవే సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు సోంపేట సీఐ మంగ రాజు, బారువ ఎస్‌ఐ హరిబాబునాయుడు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను బారువ సామాజిక ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ అభిలాష్, ఆదిత్యబాబు మృతి చెందారు. డ్రైవర్‌తోపాటు మరో బాలికను మెరుగైన చికిత్స కోసం రాగోలులోని జెమ్స్‌కు తరలిం చారు. కారులో లభించిన ఆధారాలతో పోలీసులు వివరాలు సేకరించారు. రాత్రి 9 వరకు మృతుల వివరాలు తెలియరాలేదు. కారులో ఉన్న వస్తువులన్నీ పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారకుడైన లారీడ్రైవర్ పరారీలో ఉన్నాడు.
అండర్ పాసేజ్ లేక ప్రమాదాలు...
కొర్లాం, బేసీ బారువ మూడు రోడ్ల జంక్షన్‌గా పిలవబడే ఈ ప్రాంతంలో అండర్ పాసేజ్ లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. జాతీయ రహదారి కావడం రోడ్డుకు ఇరువైపులా దాబాలు, ఇతర దుకాణాల సముదాయాలతో ఈ జంక్షన్ నిత్యం రద్దీగా ఉంటుంది. దీనికి తోడు బారువ రైల్వేగేటు కూడా ఇక్కడ ఉంది. అండర్ పాసేజ్ నిర్మించి ప్రమాదాలు నివారించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదిలా ఉండగా ఈ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు విచారణ వ్యక్తంచేస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు అత్యవసర వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ఘటనపై కలెక్టర్ ఆదేశాల మేరకు టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి ఆధ్వర్యంలో వైద్య సేవలు అందిస్తున్నారు.