వ్యాన్‌లో కుక్కి.. తాళ్లతో కట్టి..
ABN , Publish Date - Jan 21 , 2026 | 12:14 AM
18 cattle smuggled from Odisha నీరు లేదు. గడ్డి లేదు. కనీసం కాలు కదిపేందుకు కూడా చోటు లేదు. మూడు మినీ లగేజీవ్యాన్‌ల్లో పరిమితికి మించి 18 పశువులను చొప్పున కుక్కేశారు. కొమ్ములను సైతం తాళ్లతో కట్టి బంధించేశారు. ఒడిశా నుంచి అక్రమంగా తరలిస్తున్నారు. పితాతొళి గ్రామానికి చెందిన ఓ మహిళకు అనుమానం వచ్చి.. స్థానికులతో కలిసి ద్విచక్రవాహనాలపై ఆ వ్యాన్‌లను వెంబడించగా.. రెండు తప్పించుకున్నాయి. ఒక వాహనం మాత్రం మట్టిరోడ్డులో కూరుకుపోయింది. ఆ వాహనాన్ని తెరిచి చూడగా ఆ పశువుల మూగవేదన వినిపించింది.
మెడకు ఉరితాడులా బిగించి..
మూగజీవాలపై అమానుషం
ఒడిశా నుంచి 18 పశువుల అక్రమ రవాణా
వెంబడించి పట్టుకున్న పితాతొళి గ్రామస్థులు
అప్పటికే మూడు జీవాల మృతి
ఇచ్ఛాపురంలో వెలుగుచూసిన పశు మాఫియా
ఇచ్ఛాపురం, జనవరి 20(ఆంధ్రజ్యోతి):
నీరు లేదు. గడ్డి లేదు. కనీసం కాలు కదిపేందుకు కూడా చోటు లేదు. మూడు మినీ లగేజీవ్యాన్‌ల్లో పరిమితికి మించి 18 పశువులను చొప్పున కుక్కేశారు. కొమ్ములను సైతం తాళ్లతో కట్టి బంధించేశారు. ఒడిశా నుంచి అక్రమంగా తరలిస్తున్నారు. పితాతొళి గ్రామానికి చెందిన ఓ మహిళకు అనుమానం వచ్చి.. స్థానికులతో కలిసి ద్విచక్రవాహనాలపై ఆ వ్యాన్‌లను వెంబడించగా.. రెండు తప్పించుకున్నాయి. ఒక వాహనం మాత్రం మట్టిరోడ్డులో కూరుకుపోయింది. ఆ వాహనాన్ని తెరిచి చూడగా ఆ పశువుల మూగవేదన వినిపించింది. అందులో అప్పటికే మూడు మృత్యువాత పడే హృదయ విదారక దృశ్యం కనిపించింది. ఇందుకు సంబంధించి ఇచ్ఛాపురం రూరల్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఒడిశా నుంచి మూడు మినీ వ్యాన్లతో పశువులను మంగళవారం ఇచ్ఛాపురం తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో చీకటి బ్లాక్ పరిధిలోని పితాతొళి గ్రామంలో అనుమానంతో గ్రామస్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఓ రెండు వాహనాలు ఆపకుండా వారి మీదకు దూసుకొచ్చాయి. అదే వేగంతో వెళ్లిపోయాయి. అయితే మూడో వాహనం రాగా దానిని గ్రామస్థులు వెంబడించారు. పురుషోత్తపురం వద్ద ఇచ్ఛాపురం పట్టణానికి వెళ్లే క్రమంలో ఆ మినీ వ్యాన్‌ను రూటు మార్చారు. రైల్వేట్రాక్ పక్కన మట్టి రోడ్డుపై వెళ్లే మార్గంలో గోతిలో వ్యాన్ దిగబడింది. దీంతో వాహనంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు వెంటనే పారిపోయారు. పితాతొళి గ్రామస్థులు వ్యాన్ తలుపులు తెరిచి చూడగా మూగజీవాలు అచేతనంగా కనిపించాయి. ఐదుకి మించి పట్టని వాహనంలో ఏకంగా 18 పశువులను కుక్కేసి.. తాళ్లతో బంధించినట్టు గుర్తించారు. అప్పటికే ఊపిరాడక మూడు మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. దీనిపై పితాతొళి గ్రామస్థులు ఇచ్ఛాపురం పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడకు చేరుకుని పశువులను అతి కష్టమ్మీద బయటకు తీశారు.
మహిళ నేతృత్యంలో వెంబడించి..
పితాతొళి గ్రామానికి చెందిన వాసంతి అనే మహిళ నేతృత్వంలోనే గ్రామ యువకులు వెంబడించి వాహనాన్ని పట్టుకోవడం విశేషం. ఇచ్ఛాపురం పట్టణంలోనే ఓ వ్యాపారి ఒడిశాలో వీటిని కొనుగోలు చేసి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. నిత్యం ఒడిశాతో పాటు ఇచ్ఛాపురం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పశువులను తెచ్చి కంటైనర్లలో ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. పైగా పట్టణంలో గోమాంసం పెద్ద ఎత్తున చలామణి అవుతున్నట్టు అనుమానాలు ఉన్నాయి. ఒడిశాతో పాటు పరిసర ప్రాంతాల్లో రైతుల ముసుగులో దళారులను ఏర్పాటుచేసుకుని దందాకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. పోలీస్‌స్టేషన్‌లోనే సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తి సంప్రదింపులు చేస్తున్నట్టు వాసంతి ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్‌ఐ జనార్దనరావు తెలిపారు.