Share News

తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌

ABN , Publish Date - Jun 02 , 2026 | 12:08 AM

జిల్లాలో కొంతకాలంగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను జిల్లా పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు.

తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి, వెనుకన నిందితులు (ముసుగు ధరించినవారు)

-పగలు స్టీల్‌ వ్యాపారం మాటున రెక్కీ

- రాత్రుళ్లు దొంగతనాలు

- అంతరాష్ట్ర ముఠా అరెస్టు

- రూ.80 లక్షల చోరీ సొత్తు రికవరీ

- వివరాలు వెల్లడించిన ఎస్పీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైం, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొంతకాలంగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను జిల్లా పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. పక్కా వ్యూహంతో వలపన్ని ఇద్దరు కేటుగాళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.80 లక్షల చోరీ సొత్తును (బంగారం, వెండి, నగదు) స్వాధీనం చేసుకున్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి విలేకరులకు వెల్లడించారు. ఎస్పీ వివరాల మేరకు.. పశ్చిబెంగాల్‌ రాష్ట్రం మాల్దా జిల్లా ఇంగ్లీష్‌ బజార్‌ పరిధికి చెందిన మహమ్మద్‌ మీజాన్‌ (36), మహమ్మద్‌ హసన్‌ (26) పగటిపూట ఊళ్లలో స్టీల్‌ సామాన్లు అమ్మే వ్యాపారులుగా అవతారం ఎత్తి కాలనీలన్నీ తిరుగుతారు. తాళం వేసి ఉన్న ఇళ్లను పసిగట్టి పక్కాగా రెక్కీ నిర్వహిస్తారు. ఆ తర్వాత చీకటి పడ్డాక గుట్టుచప్పుడు కాకుండా అదే ఇళ్లపై పడి దోచుకెళ్తుంటారు. మీజాన్‌పై జిల్లాలో ఏడు, విజయనగరంలో ఏడు, విశాఖపట్నంలో రెండు చొప్పున మొత్తం 16 కేసులు ఉన్నాయి. జైలు జీవితం గడిపి గతేడాది అక్టోబర్‌లో బయటకు వచ్చాడు. ఇతడు రాష్ట్ర పోలీసుల నిఘా నుంచి తప్పించుకొనేందుకు ఒడిశాలోని బరంపురంలో మకాం వేశాడు. అక్కడ నుంచి తన అనుచరుడు హసన్‌ను వెంటబెట్టుకొని గత మూడు నాలుగు నెలల్లో శ్రీకాకుళం, మన్యం జిల్లాలో ఆరు కొత్త దొంగతనాలకు (కాశీబుగ్గలో మూడు, టెక్కలి, పార్వతీపురం బరంపురంలో ఒక్కొక్కటి) పాల్పడ్డాడు.

ఇలా పట్టుకున్నారు..

గతనెల 25న టెక్కలి పరిధిలో భారీ చోరీ జరిగింది. 19 కిలోల వెండి, 50 గ్రాములు బంగారం, లక్ష నగదు అపహరణకు గురైంది. వీటి విలువ రూ.69 లక్షలు. ఈ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కాశీబుగ్గ ఎస్‌హెచ్‌వోకు వచ్చిన పక్కా సమాచారంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. పలాస మండలం గరుడఖడి జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిలో దొంగలు దాక్కున్నారని తెలుసుకొని మెరుపుదాడి చేసి మీజాన్‌, హసన్‌ను అరెస్టు చేశారు. వారి నుంచి 20 కిలోల 349 గ్రాముల వెండి (విలువ రూ.60 లక్షలు). 12 తులాల బంగారం (విలువ రూ.18 లక్షలు), రూ.లక్షల విలువైన మోటార్‌ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరిని పట్టుకున్న అదనపు ఎస్పీ (క్రైం) పి.శ్రీనివాసరావు, కాశీబుగ్గ డీఎస్పీ టి.భవానీ, సీఐ వై.రామకృష్ణ, ఎస్‌ఐ ఎన్‌.సునీల్‌ బృందాన్ని ఎస్పీ అభినందించారు. హెడ్‌ కానిస్టేబుల్‌ టి.భాస్కరరావు, కానిస్టేబుళ్లు ఉషాకిరణ్‌, నీలకంఠం, రాధాకృష్ణ, ఉమామహేశ్వరరావు, సీసీఎస్‌ కానిస్టేబుల్‌ అలీ సేవలను కొనియాడారు.

Updated Date - Jun 02 , 2026 | 12:08 AM