స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:36 PM
స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని, ఇందుకోసం 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలకు మళ్లీ సవరణలు చేయాలని పంచాయతీరాజ్ చాంబర్ జాతీయ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- దీనికోసం రాజ్యాంగ సవరణ చేపట్టాలి
- పంచాయతీరాజ్ చాంబర్ జాతీయ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్
శ్రీకాకుళం, జూన్ 8(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని, ఇందుకోసం 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలకు మళ్లీ సవరణలు చేయాలని పంచాయతీరాజ్ చాంబర్ జాతీయ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం శ్రీకాకుళంలోని ఓ కన్వెన్షన్ హాల్‌లో ఆయన అధ్యక్షతన పంచాయతీరాజ్ చాంబర్ జాతీయ స్థాయి సమావేశం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలకు (తెలంగాణ, ఏపీ) చెందిన పంచాయతీరాజ్ చాంబర్, సర్పంచుల సంఘాల జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. గ్రామాలు, పట్టణాలు, జిల్లాలు సమగ్రంగా అభివృద్ధి చెందితేనే ప్రపంచ చిత్రపటంలో భారతదేశం అగ్రస్థానంలో నిలుస్తుందని, అందుకు స్థానిక సంస్థలను పూర్తిస్థాయి ‘స్థానిక ప్రభుత్వాలు’గా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన బిల్లును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. 73, 74వ రాజ్యాంగ సవరణలు అమలులోకి వచ్చి మూడు దశాబ్దాలు గడుస్తున్నా.. నేటికీ 11వ షెడ్యూల్‌లోని 29 అంశాలు, 12వ షెడ్యూల్‌లోని 18 అంశాలను రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు పూర్తిస్థాయిలో బదిలీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు దక్కాల్సిన నిధులు, విధులు అందడం లేదని వివరించారు. పంచాయతీరాజ్ చాంబర్ జాతీయ ప్రధాన కార్యదర్శి పుసులూరు నరేంద్ర (ఖమ్మం) మాట్లాడుతూ.. రాజ్యాంగ సవరణ జరిగేంత వరకు తమ డిమాండ్ల సాధనకై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను రూపొందించి ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్‌రెడ్డి (కర్నూలు), తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుస్కూరు అశోక్‌రావు (కరీంనగర్), సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మి (విశాఖపట్నం), ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆనేపు రామకృష్ణ నాయుడు, రౌతు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.