అక్టోబరులో స్థానిక పోరు
ABN , Publish Date - Aug 20 , 2026 | 12:31 AM
స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. పల్లె, పట్టణ పోరును అక్టోబరు లోపు నిర్వహించే దిశగా అడుగులు వేస్తోంది.
- పల్లె, పట్టణ సమరానికి ప్రభుత్వం సన్నద్ధం
- ప్రత్యక్ష పద్ధతిలో మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్ల ఎన్నిక
- బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు
- కొత్త జిల్లాల ప్రాతిపదికనే జడ్పీ సమరం
- అసెంబ్లీలో కీలక సవరణ బిల్లుల ప్రవేశం
శ్రీకాకుళం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. పల్లె, పట్టణ పోరును అక్టోబరు లోపు నిర్వహించే దిశగా అడుగులు వేస్తోంది. బీసీలకు 34శాతం రిజర్వేషన్ కల్పించడంతో పాటు కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు సంబంధించి మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కీలక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
కొత్త జిల్లాల ప్రాతిపదికనే..
ఈసారి కొత్త జిల్లాల ప్రాతిపదికనే జడ్పీ ఎన్నికలు జరగనున్నాయి. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 38 మండలాలు ఉండేవి. జిల్లా విభజన అనంతరం రాజాం నియోజకవర్గం (4 మండలాలు) విజయనగరం జిల్లాలో, పాలకొండ నియోజకవర్గం (4 మండలాలు) పార్వతీపురం మన్యం జిల్లాలో కలిసిపోయాయి. దీంతో రాబోయే ఎన్నికల్లో ఆ రెండు నియోజకవర్గాలతో శ్రీకాకుళం జడ్పీకి పూర్తిగా సంబంధం ఉండదు. విభజిత శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉన్న 30 మండలాలకు మాత్రమే ఈసారి జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక గ్రామ స్థాయికి వస్తే.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 912 గ్రామ పంచాయతీలు, 665 ఎంపీటీసీ సెగ్మెంట్లకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
ఆ రెండు చోట్ల బ్రేక్..
జిల్లా పరిధిలో శ్రీకాకుళం నగరపాలక సంస్థతో పాటు ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదాల వలస మున్సిపాలిటీలు ఉన్నాయి. శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఆమదాలవలస మున్సిపాలిటీలో డీలిమిటేషన్, ఇతర అభ్యంతరాలపై కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ న్యాయపరమైన చిక్కులు తేలాల్సి ఉండటంతో ప్రస్తుతానికి అక్కడ ఎన్నికలు జరిగే అవకాశం లేదు. అడ్డంకులు లేని ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీల్లోనే ఈ దఫా ఎన్నికలు జరగనున్నాయి. అయితే, శ్రీకాకుళం, ఆమదాలవలసలో కేసులు వేసిన వారితో సంప్రదించి, అక్కడ కూడా ఎన్నికలు జరిపించేలా ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నట్లు తాజా సమాచారం.
-మున్సిపాల్టీల్లో పాలనాపరమైన, అభివృద్ధిపరమైన ఆటంకాలను నివారించేందుకు కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పరోక్ష ఎన్నికల విధానానికి స్వస్తి పలకనుంది. 1986 నాటి విధానాన్ని పునరుద్ధరిస్తూ, ప్రజలే నేరుగా మున్సిపల్ చైర్మన్, మేయర్లను ఎన్నుకునేలా (ప్రత్యక్ష ఎన్నికలు) ముసాయిదాను రూపొందించి సభలో బిల్లు ప్రవేశపెట్టింది. మేయర్, చైర్మన్ పీఠాల కోసం క్యాంపు రాజకీయాలు, అక్రమాలకు ఇకపై చెక్ పడనుంది.
బీసీలకు పెద్దపీట..
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా కూటమి సర్కారు ధృఢ సంకల్పంతో అడుగులు వేసింది. రిజర్వేషన్ల ఖరారుకు నియమించిన డెడికేటెడ్ కమిషన్.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాల దృష్ట్యా బీసీలకు 27 శాతమే సిఫారసు చేసింది. అయినప్పటికీ న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తూ, పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న వెసులుబాటు ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం కోటా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక సంస్థల్లో రూరల్ ప్రాంతాల్లో బీసీలకు 34 శాతం, అర్బన్ ప్రాంతాల్లో 33.1 శాతం రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి.
అక్టోబరు లక్ష్యంగా కసరత్తు..
అక్టోబరు కల్లా ఎన్నికలు నిర్వహించకపోతే స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి వచ్చే నిధులకు గండి పడే ప్రమాదం ఉంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ నాటికి స్థానిక ఎన్నికల ప్రక్రియ మొదలు కావాల్సిందేనని సీఎం యంత్రాంగాన్ని ఆదేశించారు. సెప్టెంబరు 3న ఓటర్ల తుది జాబితా ప్రకటన, నెలాఖరుకల్లా రిజర్వేషన్ల ఖరారు పూర్తి చేసి.. అక్టోబరు 1న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉంది. షెడ్యూల్ జారీ నుంచి ఎన్నికల ఫలితాల వరకు మొత్తం ప్రక్రియకు 45 రోజులు పట్టనుంది. ఇందుకుగాను రూ. 104.15 కోట్ల బడ్జెట్ కోసం మున్సిపల్ శాఖ ప్రతిపాదనలు పంపింది. జిల్లాలో పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల సామగ్రి కొనుగోలు తదితర పనులను అధికార యంత్రాంగం వేగవంతం చేసింది.