రుణాలు.. ‘గోల్డ్’మాల్!
ABN , Publish Date - Sep 28 , 2026 | 11:51 PM
Loans against fake gold అత్యవసరంగా నగదు కావాలంటే బంగారు నగలు తాకట్టుపెట్టి రుణం పొందడం ప్రస్తుత రోజుల్లో సాధారణంగా మారుతోంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన అనేక బ్యాంకులు, గోల్డ్‌లోన్ సంస్థలు ఈ సేవలు అందిస్తున్నాయి. అయితే, ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ఘటనలు బంగారం తాకట్టుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
నకిలీ బంగారం తాకట్టుతో లోన్లు
జిల్లాలో పెరుగుతున్న మోసాలు
బ్యాంకుల్లో అప్రైజర్ పాత్రే కీలకం
మోసం చేసిన వ్యక్తులపైనే కేసులు
రుణాలిస్తున్నవారి సంగతేంటో?
శ్రీకాకుళం క్రైం, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి):
శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ మహిళ ఈ ఏడాది జూన్ 17న పెట్రోమాక్స్ వీధిలోని ఓ ఫైనాన్స్ సంస్థలో బంగారు గాజులను తాకట్టు పెట్టి రూ.2,43,300 రుణం పొందింది. జూలైలో ఆ సంస్థ ఉన్నతాధికారులు నిర్వహించిన ఆడిట్‌లో ఆ మహిళ తాకట్టు పెట్టిన బంగారం నకిలీదని తేలింది. దీంతో టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ నెల 18న ఆ మహిళపై కేసు నమోదు చేశారు.
గత ఏడాది శ్రీకాకుళం నగరానికి చెందిన నలుగురు యువకులు నరసన్నపేటలోని ఓ ప్రైవేటు బ్యాంకులో నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టుపెట్టి సుమారు రూ.3.50లక్షల రుణం పొందారు. తర్వాత జరిగిన బ్యాంకు ఆడిట్‌లో ఈ విషయం బయటపడింది. ఆ యువకులను బ్యాంకు మేనేజర్ మందలించారు. కొన్ని నెలల సమయం ఇచ్చి నగదును బ్యాంక్‌కు తిరిగి కట్టించుకున్నారు.
గార ఎస్‌బీఐలో రెండేళ్ల కిందట భారీ మోసం జరిగింది. బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం లాకర్ల నుంచి మాయమైంది. దాదాపు రూ.4.7కోట్ల విలువైన బంగారాన్ని బ్యాంకు సిబ్బందే పక్కదారి పట్టించారు.
అత్యవసరంగా నగదు కావాలంటే బంగారు నగలు తాకట్టుపెట్టి రుణం పొందడం ప్రస్తుత రోజుల్లో సాధారణంగా మారుతోంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన అనేక బ్యాంకులు, గోల్డ్‌లోన్ సంస్థలు ఈ సేవలు అందిస్తున్నాయి. అయితే, ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ఘటనలు బంగారం తాకట్టుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతుండడంతో కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు పొందుతున్నారు. కొన్ని ప్రైవేటు ఆర్థిక సంస్థలు, బ్యాంకు సిబ్బంది ఆఫర్లతో ముందుకు వస్తున్నట్టు తెలుస్తోంది. ‘మీ వద్ద డబ్బు లేకపోయినా, ఇప్పటికే వేరేచోట తాకట్టు పెట్టిన బంగారాన్ని మేమే విడిపిస్తాం. మా సంస్థలో దాన్ని తాకట్టు పెట్టి అధిక సొమ్ము ఇస్తాం. లేదా బంగారం విడిపించి విక్రయిస్తాం. వచ్చిన మొత్తాన్ని మీకు అందిస్తాం’ అంటూ కొన్ని ఫైనాన్స్ సంస్థలు ఖాతాదారులను సంప్రదిస్తున్నాయి. ఆ వచ్చిన మొత్తంలో కమీషన్ పేరిట అధికంగా లాగేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వ్యవహారాల్లో నిబంధనలు, బంగారం భద్రత, ఖాతాదారుల ప్రయోజనాలపై స్పష్టత అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అప్రైజర్ నిపుణులు బంగారం స్వచ్ఛత, బరువు, ఆభరణాలు నకిలీవా?, కావా?, వాటి స్వరూపం, గ్రాముకు తగ్గ విలువ, తాకట్టు పెడుతున్న వ్యక్తిగత ఐడీ కార్డు తదితర అంశాలను పరిశీలించిన తర్వాతే రుణం మొత్తాన్ని నిర్ణయిస్తారు. కానీ, కొన్నిసార్లు నకిలీ బంగారం తాకట్టు పెట్టి రుణం పొందుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఎక్కడో లోపం జరుగుతుందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎవరి నిర్లక్ష్యం వల్ల నకిలీ బంగారం అసలైందిగా గుర్తించబడుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్ని సందర్భాల్లో సిబ్బంది చేతివాటం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం లేదా అంతర్గత నియంత్రణ వ్యవస్థల్లో లోపాలు కారణంగా ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఘటనల్లో రుణం పొందిన వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కానీ, ఆ బంగారాన్ని పరిశీలించి రుణం మంజూరు చేసిన వారిపై చర్యలు ఉండడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఖాతాదారుల నమ్మకంతో అప్పగించిన బంగారానికి పూర్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదే. నకిలీ బంగారం బ్యాంకుల్లోకి ఎలా చేరుతుంది, తాకట్టు బంగారం ఎలా మాయమవుతుంది ఈ వ్యవహారాల్లో అంతర్గత సిబ్బంది పాత్ర ఉందా? మూల్యాంకన వ్యవస్థల్లో లోపాలున్నాయా? అనే ప్రశ్నలకు సంబంధిత బ్యాంకులు, పోలీసులు దర్యాప్తు, ఆడిట్ నివేదికలు సమాధానం చెప్పాల్సి ఉంది.
కేసులు నమోదు చేస్తాం
బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారానికి సంబంధించి అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు అందితే సమగ్రంగా విచారణ చేపట్టి చర్యలు చేపడతాం. ఆడిట్‌లో తేడాలు ఉన్నట్లు విచారణలో తేలితే బ్యాంకు సిబ్బందిపై కూడా కేసులు నమోదు చేస్తాం.
- వివేకానంద, డీఎస్పీ, శ్రీకాకుళం