తగ్గుతున్న ‘పాడి’
ABN , Publish Date - May 20 , 2026 | 12:18 AM
Animal husbandry has become a burden ఒకప్పుడు పాడి పంటలతో పల్లెలు కళకళలాడేవి. ప్రతి ఇంటి ముందూ పశువుల శాలలు, అందులో నాలుగైదు ఆవులు, దూడలు, గేదెలతో పాటు ఎద్దులు ఉండేవి. కళ్లాల్లో పెద్దపెద్ద గండి వాములు సైతం కనిపించేవి. కానీ ప్రస్తుతం పల్లెల్లో పశుసంపద కనుమరుగవుతోంది. యాంత్రీకరణ సాగు పెరగడం, పచ్చిక బయళ్లు తగ్గిపోవడం, గ్రాసం దొరక్కపోవడం వంటి కారణాలతో పశుపోషణ భారంగా మారింది.
పల్లెల్లో అంతరిస్తున్న పశుసంపద
యాంత్రీకరణ సాగుతో గ్రాసం కొరత
పచ్చిక బయళ్లు కూడా కరువు
భారంగా మారిన పశుపోషణ
కోటబొమ్మాళి/ నరసన్నపేట, మే 19(ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు పాడి పంటలతో పల్లెలు కళకళలాడేవి. ప్రతి ఇంటి ముందూ పశువుల శాలలు, అందులో నాలుగైదు ఆవులు, దూడలు, గేదెలతో పాటు ఎద్దులు ఉండేవి. కళ్లాల్లో పెద్దపెద్ద గండి వాములు సైతం కనిపించేవి. కానీ ప్రస్తుతం పల్లెల్లో పశుసంపద కనుమరుగవుతోంది. యాంత్రీకరణ సాగు పెరగడం, పచ్చిక బయళ్లు తగ్గిపోవడం, గ్రాసం దొరక్కపోవడం వంటి కారణాలతో పశుపోషణ భారంగా మారింది. కొరత కారణంగా పశుగ్రాసం నుంచి దాణా వరకూ అన్ని ధరలూ పెరిగిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దీంతో చాలామంది రైతులు పాడి సంపదను అమ్మేసుకుంటున్నారు. జిల్లాలో పశుగణన ప్రకారం 3,75,345 ఆవులు, గేదెలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతిరోజూ సుమారు 5.03 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి చేస్తున్నారు. వేసవిలో పశుగ్రాసం కొరతతో పాలదిగుబడి 5శాతం వరకు తగ్గిందని పాడిరైతులు చెబుతున్నారు. ప్రభుత్వం ఈఏడాది 50శాతం రాయితీపై పశుగ్రాసం అందిస్తున్న సరిపోవడం లేదని పేర్కొంటున్నారు. పాడి నిర్వహణ కష్టమవుతోందని వాపోతున్నారు.
మేత కరువు..
గతంలో గ్రామాల్లో ప్రభుత్వ భూములు, వాగులు, వంకలు పశువులకు మేతనిచ్చే పచ్చిక బయళ్లుగా ఉండేవి. కానీ నేడు ఆధునిక యంత్రాల రాకతో అంగుళం భూమిని వదలకుండా కొండలు, గుట్టలను సైతం చదును చేసి సాగులోకి తెస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతుండడంతో పశువులను మేపడానికి చోటు లేకుండా పోయింది. పొద్దంతా తిరిగినా పశువులు ఖాళీ డొక్కలతో తిరిగి వస్తుండడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ట్రాక్టర్లు వాడకం పెరగడంతో ఎద్దులతో చేసే వ్యవసాయం 10శాతానికి పడిపోయింది. దీంతో క్షేత్రస్థాయిలో వీటి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మరోపక్క పశువులను కాసే వారు కరువవ్వడం పాడి పరిశ్రమపై ప్రభావం చూపుతోంది. పశుసంపద నశిస్తుండడంతో పాల ఉత్పత్తి తగ్గడమే కాకుండా సేంద్రియ ఎరువుల లభ్యత కూడా తగ్గి భూసారం దెబ్బతింటోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గ్రామాల్లో ఖాళీ స్థలాలు లేవు..
ఆధునిక యంత్రాలు రావడంతో గ్రామాల్లో బీడు భూములు, గుట్టలు, కొండలను సైతం చదునుచేసి పంటలను సాగు చేస్తున్నారు. యంత్రాలతో వరి నూర్పులు చేస్తుండడంతో గడ్డి (గ్రాసం) పనికి రాకుండాపోతుంది. ఎక్కడా ఖాళీ స్థలాలు లేకపోవడంతో పచ్చిక కూడా కానరావడం లేదు. దీంతో గ్రాసం కరువై పశుపోషణ భారంగా మారింది.
- సనపల భాస్కరరావు, ఊడికలపాడు, కోటబొమ్మాళి మండలం.
గిట్టుబాటు ధర కల్పించాలి
చాలాకాలంగా మేము పాడిని నమ్ముకుంటూ వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నాం. గతంలో నాలుగైదు గేదెలు ఉండేవి. ప్రస్తుతం మూడు ఆవులు మాత్రమే ఉన్నాయి. అవి కూడా అప్పు చేసి కొన్నాం. కష్టానికి తగ్గ ప్రతిఫలం లేక అప్పులు పాలవుతున్నాం. హామీలేని రుణాలు తక్కువ వడ్డీకి ఇస్తే బాగుంటుంది. పాలకు గిట్టుబాటు ధర కల్పించాలి.
- పల్లి సింహాచలం, జమ్ము
పాల ధర రూ.60కు పెంచాలి
పాలధర లీటరు రూ.60వరకూ పెంచాలి. పాలశీతల కేంద్రాలకు వెళ్లినప్పుడు సాంద్రత తక్కువగా ఉందన్న పేరుతో రూ.40 మాత్రమే ఇస్తున్నారు. పాడిరైతులకు బ్యాంకులు ప్రత్యేక రుణాలు కల్పించాలి
- కత్తిరి వరహాలమ్మ, అలుదు, పాడిరైతు
50శాతం రాయితీపై పశుదాణా
జిల్లాలో పాడిరైతులకు 50శాతం సబ్సిడీపై పశుదాణాను పంపిణీ చేస్తాం. పశుగ్రాసం పెంచేందుకు జిల్లాలో 2500 ఎకరాల్లో సాగు చేసేందుకు ప్రణాళిక రూపొందించాం. ఇప్పటికి 500 ఎకరాలను గుర్తించి పాడి రైతులకు అవగాహన కల్పించాం. పాడిరైతులకు అండగా ఉండేందుకు గోకులాలు, ఇతర పథకాలను అమలు చేస్తున్నాం.
రాజాగోపాల్, జేడీ పశుసంవర్ధశాఖ, శ్రీకాకుళం