విన్నారు.. స్పందించారు
ABN , Publish Date - Mar 18 , 2026 | 12:32 AM
Towards salvation for problems in 'Narasannapet'.. నరసన్నపేట మేజర్ పంచాయతీ ఇందిరానగర్, హడ్కోకాలనీల్లో సమస్యల పరిష్కారం దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ కాలనీల్లో సమస్యలపై ఈ నెల 15న ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్’ ఆధ్వర్యంలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే.
‘నరసన్నపేట’లో సమస్యలకు మోక్షం దిశగా..
‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమానికి విశేష స్పందన
వంశధార కాలనీలో పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
హడ్కోకాలనీ జంక్షన్ వద్ద గుంతలు కప్పిన విశ్రాంత ఉద్యోగి
ఇంటింటా చెత్త సేకరిస్తున్న పారిశుధ్య కార్మికులు
రాత్రివేళల్లో నిఘా పెంచిన పోలీసులు
నరసన్నపేట, మార్చి 17(ఆంధ్యజ్యోతి): నరసన్నపేట మేజర్ పంచాయతీ ఇందిరానగర్, హడ్కోకాలనీల్లో సమస్యల పరిష్కారం దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ కాలనీల్లో సమస్యలపై ఈ నెల 15న ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్’ ఆధ్వర్యంలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి తెలుసుకున్న వివిధ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ప్రధానంగా ఈ కాలనీల్లో పారిశుధ్యం అధ్వానంగా ఉందని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో గత రెండు రోజలుగా పారిశుధ్య కార్మికులు ఇంటింటా చెత్త సేకరిస్తున్నారు. వంశధార కాలువలో చెత్త వేయకుండా ప్రజలు ఇంటి వద్దే తడి, పొడి చెత్తలను వేర్వేరుగా ఉంచుతూ.. స్వచ్ఛరథాలకు అందజేస్తున్నారు.
వంశధార శిథిల క్వార్టర్స్‌లో గంజాయి బ్యాచ్, మందుబాబులు హల్‌చల్ చేస్తున్నట్టు డొంకాన గాయత్రి ఆనాడు కార్యక్రమంలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి రాత్రి వేళల్లో పలుమార్లు ఎస్‌ఐ బి.గణేష్, పోలీసు సిబ్బందితో ఈ ప్రాంతాలను తనిఖీ చేశారు. నిఘా పెంచారు. దీంతో మందుబాబుల బెడద లేదని హడ్కోకాలనీ మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నైను సైతం అంటూ.. విశ్రాంత ఉద్యోగి
ఇందిరానగర్ నుంచి హడ్కోకాలనీ రహదారి ముందు భాగం గుంతలమయంగా మారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు ఎంఎస్‌ఎన్ దేవ్ ప్రస్తావించారు. ఈ సమస్యను కొంతమేర అయినా పరిష్కరించాలని ఇందిరానగర్ వాసి, రిటైర్డ్ సూపరింటెండెంట్ పొన్నాన లక్ష్మణరావు నేను సైతం అంటూ ముందుకొచ్చారు. సుమారు రూ.16వేలు వెచ్చించి.. 8 అడుగుల వరకూ సీసీ రోడ్డు పనులు చేయించారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపుతూ.. కాలనీవాసులకు ఆదర్శంగా నిలిచారు.
పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే
హడ్కోకాలనీ - వంశధార కాలనీలో ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మంగళవారం పరిశీలించారు. ఈ పాఠశాల శిథిలావస్థకు చేరుకోవడంతో ఇబ్బందులు పడుతున్నామని నాడు మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాల భవనాన్ని నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం పాఠశాలను క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే రమణమూర్తి పరిశీలించారు. వంటగది, మరుగుదొడ్లు, రన్నింగ్‌వాటర్ సదుపాయం. పిల్లలు మధ్యాహ్న భోజనం ఎక్కడ చేస్తున్నారో తదితర వివరాలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వార్డుసభ్యులు బత్తుల సంతోషి, హెచ్‌ఎం ఎం. రజని, ఉపాధ్యాయులు సుగుణబాయ్, ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.